24.7 C
Hyderabad
May 17, 2024 01: 35 AM
ప్రత్యేకం

భారతీయులలో దేశభక్తిని నింపిన పైడిమర్రి ‘ప్రతిజ్ఞ’

#PaidimarriVenkataSubbarao

అర్ధ శతాబ్దకాలంగా మరుగున పడిన భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు చరిత్ర అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నది. ప్రతిజ్ఞ అనగానే గుర్తుకొచ్చేది “భారతదేశం నా మాతృభూమి,భారతీయులందరూ నా సహోదరులు.

నేను నా దేశమును ప్రేమిస్తున్నాను”దీనిని ప్రతిరోజు పాఠశాల ప్రార్థనా సమయంలో కోట్లాదిమంది విద్యార్థులచే ‘ప్రతిజ్ఞ’ చేయిస్తుంటారు. ఆ ప్రతిజ్ఞ చేసే విద్యార్థులకు గానీ,చేయించే ఉపాధ్యాయులకు గానీ ప్రతిజ్ఞ రచయిత గురించి తెలియకపోవడం విచారకరం.

 రాష్ట్రంలో 1963 నుంచి అమలులో ఉండగా 1965 నుంచి దేశవ్యాప్తంగా ప్రతిజ్ఞ పాఠం అమలవుతున్నది. అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలుగు, హిందీ,ఇంగ్లీషు, ఉర్దూ భాషలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రతిజ్ఞను అనువాదం చేయించి అమలు చేస్తున్నది.

పైడిమర్రిని మరచిపోయిన ప్రపంచం

కానీ ప్రతిజ్ఞను రచించిన రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును ఎక్కడా ముద్రించలేదు. జాతీయ గీతం,జాతీయ గేయం,రాష్ట్రీయ గీతం రచించిన రచయితల పేర్లు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో ముద్రించారు. భారతీయుడు తన జాతి,దేశం పట్ల సద్గుణ సంపన్నుడిగా జీవించేందుకు ఉద్దేశించబడిన జాతీయ ప్రతిజ్ఞను రచించి జాతికి అందించిన ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును ముద్రించకుండా విస్మరించారు.

ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావును ప్రజలకు పరిచయం చేయకుండా దాచిపెట్టారు.’ప్రతిజ్ఞ’ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం మూలంగా ఆయన పేరును విస్మరించాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న కాలంలో పైడిమర్రి వెంకట సుబ్బారావు చరిత్రను వెలికితీసే ప్రయత్నం కొంత జరిగింది.

తెలంగాణ విద్యావంతుల వేదిక కృషితో పైడిమర్రి వెంకట సుబ్బారావు చరిత్ర వెలుగులోకి వచ్చింది.ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన సమగ్ర నివేదికను తెలంగాణ విద్యావంతుల వేదిక 2014 నవంబర్ 27న రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, రాష్ట్ర గవర్నర్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ కు అందించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక కోరిన విజ్ఞప్తి మేరకు 2015-16 విద్యాసంవత్సరం నుంచి కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అన్ని భాషల్లో అన్ని ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును ముద్రిస్తున్నారు.

నల్గొండ జిల్లాలో పుట్టిన పైడిమర్రి

తెలంగాణ ప్రభుత్వం 5వ తరగతి తెలుగు పుస్తకం వెనుక భాగం లోపలి పేజీలో పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను ముద్రించి విశేష ప్రాచు ర్యం కల్పించి గౌరవించింది. పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో వెంకట్రామయ్య, రాంబాయమ్మ దంపతులకు 1916 జూన్ 10న జన్మించారు.

1988 ఆగస్టు 13న మరణించారు. ఉన్నత చదువులు చదువుకున్న పైడిమర్రి వెంకట సుబ్బారావు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ కోశాధికారిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా ఉన్నత కోశాధికారిగా ఖమ్మం, నిజామాబాద్, నెల్లూరు, విశాఖపట్నం, నల్గొండ జిల్లాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు.

తెలుగు, హిందీ, సంస్కృతం,ఇంగ్లీష్,పార్శీ, అరబ్బీ భాషలలో పైడిమర్రి వారికి మంచి ప్రావీణ్యం ఉన్నది.వీరు గొప్ప సాహితీవేత్త,రచయిత.

హోమియో వైద్యుడిగా సేవలు అందించిన పైడిమర్రి

ఉషస్సు కథా సంకలనం, కాలభైరవుడు నవల, బాల రామాయణం,గీతా మీమాంస, దైవభక్తి మెుదలైన రచనలు చేశారు. పైడిమర్రి పద్యాలు సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికలో ముద్రించారు. 1971లో ఉద్యోగ విరమణ చేసిన ఆయన హోమియో వైద్యుడిగా నల్గొండ పట్టణంలో రోగులకు ఉచిత సేవలందించారు.

ఆయన గొప్ప దేశభక్తుడు.1961లో భారత చైనాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో పైడిమర్రి విశాఖపట్నంలో ఖజానా ఉద్యోగిగా విధులు నిర్వహించేవారు. దేశంలో అన్నివర్గాల ప్రజల్లో జాతీయ ఐక్యత, దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతిజ్ఞను రచించారు.

కాంగ్రెస్ నాయకుడు తెన్నేటి విశ్వనాథం ద్వారా తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, విద్యాశాఖ మంత్రి పి.వి.జి.రాజు ప్రతిజ్ఞను పరిశీలించి స్ఫూర్తిదాయకంగా ఉన్నదని భావించి పాఠశాల ప్రార్థనా సమయాల్లో ‘ప్రతిజ్ఞను’ ఆలపించేలా చర్యలు తీసుకున్నారు.

1964లో కేంద్ర విద్యా సలహామండలి సమావేశం బెంగళూరులో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అప్పటి యూజీసీ చైర్మన్ యం.సి.చాగ్లా ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న ప్రతిజ్ఞ గొప్పతనాన్ని తెలుసుకొని దేశంలోని అన్ని పాఠశాలల్లో విధిగా ప్రతిజ్ఞ చేయించాలని,అందుకుగాను అన్నిరకాల ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞను ముద్రించాలని ఆదేశించారు.1965 జనవరి 26 నుంచి ‘ప్రతిజ్ఞ’ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది.

చంద్రశేఖర్ శర్మ, హుజూర్ నగర్

Related posts

బైంస అల్లర్ల బాధితులకు మంత్రాలయ పీఠం బాసట

Satyam NEWS

మోడ్రన్ ద్రౌపది: కొడుకులు ఎందరున్నా కోడలు ఒక్కరే

Satyam NEWS

వినాయకుడికి పూజలు చేసిన ముస్లిం అధికారిణి

Satyam NEWS

Leave a Comment