38.2 C
Hyderabad
April 29, 2024 19: 03 PM
ప్రత్యేకం

తరతరాల పోరాటమే తరగని ఆస్తి

#Independenceday 2

1947 ఆగస్టు 15వ తేదీ ఒక రోజు మాత్రమే కాదు. కోట్లాది మంది భారతీయులు కొత్త ఊపిరి పీల్చిన… ఇంకా పీలుస్తున్న ఒక అవకాశం. బ్రిటీష్ వాడు దేశాన్ని వదిలివెళ్లిన రోజు. మన పాలన మనం చేసుకోవడానికి వీలు కలిగిన రోజు వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి భారతావని విడుదలయిన రోజు అది.

దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగస్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది. భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్ది చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది.

క్రమ క్రమంగా ఆక్రమించుకున్న బ్రిటన్

1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్ది తొలినాళ్ళ నుంచే ఆయన గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారు. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగి భారత సిపాయిలు, రాజులు అందులో ఓడిపోయాకా 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాకా దేశం బ్రిటీష్ పాలన కిందకి వచ్చింది.

 బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలంగానూ దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది.

ఏడాది ముందే వచ్చిన స్వాంతంత్ర్యం

బ్రిటిష్ ఇండియా ఆఖరు గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ 1948లో నిర్ణీతమైన స్వాతంత్ర్య దినాన్ని ముందుకు జరుపుతూ 1947 ఆగస్టు 15న జరగాలని నిర్ణయించారు. రెండవ ప్రపంచయుద్ధం జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 కావడంతో భారత స్వాతంత్ర్యానికి దానిని ఎంచుకున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి. మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాత్రి సమయంలో నెహ్రూ మాట్లాడిన మాటలివి ‘‘అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం. మన ఈ నిర్ణయాన్ని పూర్తిగా, కూలంకషంగా సాధించే సమయం యిప్పుడు ఆసన్నమయింది.

అర్థరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే, ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో పారవశ్యం చెందివున్న సమయాన, భారతదేశం, పునరుజ్జీవనంతో, స్వేచ్ఛగా స్వతంత్రదేశంగా ఆవిర్భవిస్తుంది’’ ఆ మహనీయుడు మాట్లాడిన మాటలు దేశ లక్ష్యాన్ని నిర్దేశించాయి. ఆ నాటి నుంచి ఈ నాటి వరకూ పాలకులు మారినా దేశం పటిష్టమైందే తప్ప పటిమ కోల్పోలేదు.

అదే భారత్ విశిష్టత. ఇన్ని జాతులు, ఇన్ని మతాలు ఇన్ని ప్రాంతాలు ఉన్న మరో దేశం అయితే ఈ పాటికి ఏనాడో విచ్ఛిన్నం అయ్యేది. భారత మాత అనే సెంటిమెంటు మనలను కలిపి ఉంచుతున్నది. కట్టపడేస్తున్నది.

గుమ్మడి శ్రీనివాస్

Related posts

అయోధ్య భూ వివాదం కొనసాగిన తీరు ఇది

Satyam NEWS

Selection process: వీర విధేయుడుకే పగ్గాలు!

Satyam NEWS

మండలి రద్దు అవుతుందా?: వైసీపీ ఎమ్మెల్సీల గుండెల్లో రైళ్లు

Satyam NEWS

Leave a Comment