38.2 C
Hyderabad
May 2, 2024 19: 26 PM
ప్రత్యేకం

ఆత్మనిర్భర్ భారత్ కు అన్నీ ఆటుపోట్లే

#NarendraModi

భారతదేశం బహుసవాళ్లను అధిగమిస్తున్న దశలో 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అతి నిరాడంబరంగా నిర్వహించేందుకు జాతి సమాయత్తం కానుంది. కోవిడ్-19 సంక్షోభం దేశాన్ని అన్నిరకాలుగా ఒకవైపు వేధిస్తుండగా…మరోవైపు చైనా, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలు కవ్వించే విధంగా వ్యవహరించడంతో దేశం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుటోంది.

అయినా…ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ఆయాదేశాలకు గట్టిస్థాయిలో బదులివ్వడంతో ప్రపంచదేశాలు భారత్ శక్తిసామర్ధ్యాలను గుర్తించాయి. అవసరమైతే పాకిస్తాన్, చైనాలతో మధ్యవర్తిత్వం చేయగలనని సలహా ఇచ్చిన అమెరికా సూచనను సున్నితంగా భారత్ తిరస్కరించింది.

కరోనా దేశాన్ని ఒక్కటి చేసింది

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు జాతి మొత్తాన్ని ఏక తాటిపైకి తీసుకొచ్చి దేశఐక్యతను, ఐకమత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పింది. కరోనా క్లిష్టదశలో భారత్ సత్సాంప్రదాయ ప్రతీకైన నమస్కారాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం విశేషం.

పాశ్చాత్య దేశాలలో ఆనవాయితీగా ఉన్న కరచాలనాలు స్థానంలో మన దేశీయ నమస్కారం చేరడం భారత్ ప్రతిష్ట అమాంతం పెరిగిపోయింది. గడచిన సంవత్సరం నాటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోట ప్రసంగం భారతీయులలో ఆశల్ని రేకెత్తించింది.

తరువాతి కాలంలో తీసుకున్న రాజకీయ, ఆర్ధిక నిర్ణయాలు ఎక్కువ శాతం ప్రభుత్వ ప్రతిష్టను పెంచేవి కావడం గమనార్హం. ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎన్ డి ఏ తీసుకొచ్చిన తలాక్ చట్టం, 370అధికరణం రద్దు , ఇటీవల ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్బర్ కార్యక్రమం , ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

విద్యా విధానం మోడీ ప్రత్యేకత

తాజాగా ప్రధాని ప్రకటించిన నూతన జాతీయ విద్యా విధానం, రైతులకు అండగా ఉండాలన్న లక్ష్యంతో లక్షకోట్ల రూపాయల వ్యవసాయ మౌలిక నిధి ప్రారంభించడం వంటి సంక్షేమ చర్యలు మోదీ ప్రాధాన్యతలను సూచిస్తున్నాయి.

 ఇదిలావుండగా….. ప్రధానమంత్రి హోదాలో శతాబ్దాల వివాద చరిత్ర ఉన్న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ  మోదీ స్వయంగా నిర్వహించడం లౌకికవాదాన్ని సమర్ధించేవారిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

1976 లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్, సోషలిస్టు పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చారు. అప్పటినుంచి ప్రజా ప్రతినిధులు  మతపరమైన  కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి సంశయించే పరిస్థితి నెలకొంది.

ప్రయివేటు పెట్టుబడులకు తలుపులు బార్లా

సెక్యులర్ సిద్ధాంతానికి కట్టుబడి దేశంలోని అన్నిమతాలను సమానంగా గౌరవించాలని, ప్రత్యేకించి ఒక మతానికి   ప్రాధాన్యత ఇవ్వకూడదని లౌకికవాదులు స్పష్టం చేస్తున్నారు. కరోనా విస్తృతి అరికట్టడంలో కేంద్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

విద్యారంగంలో , మీడియాలో, ఇప్పటి వరకు కేంద్రం అధీ నంలో ఉన్న కొన్ని రంగాలలో ప్రైవేటీకరణకు బార్లా తలుపులు తెరుస్తున్నట్లు విమర్శలు వచ్చిపడుతున్నాయి. మరోవైపు కాషాయీకరణకు ప్రభుత్వం చాపకింద నీరులా పావులు కదుపుతోందని ఆరోపణలు తరచూ వస్తున్నాయి.

మోదీ ప్రభుత్వం సాధికారంగా ప్రకటించిన స్వచ్ఛభారత్, మేకిన్ ఇండియా మొదలైన కార్యక్రమాలు ఏ మేరకు ఫలితాలు సాధించాయి చెప్పాలని ఒత్తిడిచేస్తున్నాయి. విద్య, వైద్యం, రక్షణ రంగాలకు కేంద్రబడ్జెట్ లో అవసరం మేరకు కేటాయింపులు లేకపోవడం వంటి అంశాలకు ప్రధాని సమాధానం చెప్పాలని వైరి పక్షాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక వర్గం మీడియా డిమాండ్ చేస్తున్నారు.

పాక్, చైనా వ్యవహారాలపై భిన్నస్వరాలు

దేశం సరిహద్దుల్లో చెలరేగుతున్న పాక్, చైనా వ్యవహారశైలిపై భారత్ స్పందన అనుమానాస్పదంగా ఉన్నట్లు కాంగ్రెస్ సహా కొన్ని రాజకీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవాధీనరేఖల వద్ద దురాక్రమణలు చోటు చేసుకున్నట్లు, భారత్ భూభాగంలో కొంత భాగం దురాక్రమణకు గురైనట్లు వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

భారత్ దీటుగా ఎదుర్కోలేని కారణంగా నేపాల్, చైనా, పాకిస్తాన్ ఇష్టారాజ్యంగా కొత్త మ్యాపులను సృష్టించి ఆయాదేశాలలో అధికార ముద్రను పొందినట్లు బాహ్యప్రపంచానికి వెల్లడించడం భారతదేశ సార్వభౌమాధికారానికి పెద్ద సవాలుగా పరిణమించినట్లు ఒక వర్గం మీడియా తెలుపుతోంది. పీఎం కేర్స్ ఫండ్ విషయంలో నూ అనేక సందేహాలు ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి.

ఇటువంటి అనేక ప్రశ్నలకు భారత ప్రధాని హోదాలో నరేంద్రమోదీ సానుకూలంగా స్పందించి ప్రజలకు వివరణ ఇవ్వగలరని జాతి ఉత్కంఠగా నిరీక్షిస్తోంది. భిన్న సంస్కృతులు, భిన్న రాజకీయ విభేదాలు ఉన్నా అఖండభారత దేశ స్వేచ్చాస్వాతంత్ర్యాలు చెక్కుచెదరవన్న నమ్మకం ప్రతిభారతీయుని హృదయస్పందన ప్రతిధ్వనిస్తోంది.

జై హింద్! జై భారత్!

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

రాష్ట్రంలో చర్చిలు ఎన్ని? అందులో పాస్టర్లు ఎందరు?

Satyam NEWS

విజయనగరం జిల్లా న్యాయ‌స్థానానికి కొత్త‌ భ‌వ‌న స‌ముదాయం

Satyam NEWS

గ్రామ స‌చివాల‌యంలో ‘మ‌న్మ‌ధ రాజా’ సాంగ్‌…

Satyam NEWS

Leave a Comment