తెలంగాణ తదుపరి చీఫ్ సెక్రటరీ ఎవరు? ఇంకో ఐదు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సిన అంశం ఇది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఎస్ కె జోషి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఎస్ కె జోషి తరువాత రాష్ట్రంలో సీనియర్ అధికారిగా అజయ్ మిశ్రా ఉన్నారు.
చీఫ్ సెక్రటరీగా అజయ్ మిశ్రాను నియమిస్తారా లేక మరొకరిని ఎంపిక చేసుకుంటారా అనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. ముఖ్యమంత్రికి కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన అధికారిగా సోమేష్ కుమార్ ఉన్నారు కానీ ఆయనను చీఫ్ సెక్రటరీగా నియమించాలంటే దాదాపుగా 12 మంది సీనియర్ ఐ ఏ ఎస్ లను కాదని నియమించాల్సి ఉంటుంది.
అలా చేయడం మంచి సాంప్రదాయం కాదని కొందరు అంటున్నారు. ఎస్ కె జోషి తరువాత సీనియర్ అయిన అజయ్ మిశ్రా మరో ఏడు నెలల్లో రిటైర్ కాబోతున్నారు. ప్రతి ఐ ఏ ఎస్ అధికారి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి చేసి పదవీ విరమణ చేయాలనుకుంటారు. అందువల్ల అజయ్ మిశ్రాకు అవకాశం ఇవ్వడం సహజ న్యాయం కిందికి వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.
దాదాపు 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను సూపర్ సీడ్ చేసి సోమేష్ కుమార్ ను చీఫ్ సెక్రటరీగా నియమించేందుకు ముఖ్యమంత్రి కూడా ఆలోచిస్తున్నారని తెలిసింది. అందువల్ల అజయ్ మిశ్రా కే చీఫ్ సెక్రటరీ పదవికి ఎంపిక చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. నిజాయితీ పరుడుగా పేరు ఉన్న అజయ్ మిశ్రాకే ఈ సారి అవకాశం దక్కేలా కనిపిస్తున్నది.