24.7 C
Hyderabad
May 16, 2024 23: 49 PM
Slider నిజామాబాద్

కేసీఆర్ ను ఒడిస్తాం.. రిటైర్మెంట్ ఇప్పిస్తాం

#katipalli

బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి

కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ ను ఒడిస్తామని, రాజకీయాల నుంచి శాశ్వతంగా రిటైర్మెంట్ ఇప్పిస్తామని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గజ్వేల్ వదిలి కామారెడ్డికి రావడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గజ్వేల్ లో అభివృద్ధి జరిగిపోయిందా.. ఇప్పుడు కామారెడ్డిలో అభివృద్ధి చేస్తారా.. అని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా అక్కడ ప్రత్యర్థి పార్టీ వాళ్ళను కుక్కల్ని కొనుగోలు చేసినట్టు కొనుగోలు చేస్తున్నారన్నారు. 1985 నుంచి ఇప్పటివరకు సిద్దిపేటలో ఏ పార్టీ కూడా నామరూపం లేదన్నారు.

కొనుగోలు చేసిన నాయకులను కుక్కల కంటే హీనంగా చూస్తారని తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే కేసీఆర్ గజ్వేల్, కొడుకు కేటీఆర్ సిరిసిల్ల, అల్లుడు హరీష్ రావు సిద్దిపేట ఎంచుకున్నారని, మూడు నియోజకవర్గాలు పక్కపక్కనే ఉండేలా చూసుకున్నారన్నారు. కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా కొనుక్కుని గెలిస్తారు తప్ప పోటీ చేసి కాదన్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ కు ప్రధాని అని, గ్రామాలలో ఉన్న లీడర్లే ఎమ్మెల్యేలు అని పేర్కొన్నారు.

అక్కడ కేసీఆర్ 15 మందితో ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారని కొందరి పేర్లను ఉదహరించారు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, కొనుగోళ్లు, బెదిరింపులు, కేసులు చేయించడం వీళ్ళ పని అని తెలిపారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రతాప్ రెడ్డి, హరీష్ రావు మూడు గ్రూపులు ఉంటాయని, వీళ్ళు అనుకున్నదే అక్కడ జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు చేసుకునే జహంగీర్ అనే వ్యక్తి వీళ్ళ దెబ్బకు కారు డ్రైవర్ అయ్యాడని తెలిపారు. ఎర్రవల్లికి నాలుగు వైపులా నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటు చేసుకున్న కేసీఆర్.. ఈ రోడ్డు ఎవరి అబ్బివృద్ది కోసమో చెప్పాలన్నారు.

దూరపు కొండలు నునుపు అన్నట్టు గజ్వేల్ అభివృద్ధి అని, అక్కడికి వెళ్లి చూస్తేనే అసలు కథ తెలుస్తుందన్నారు. నక్సలైట్లను పోలీసులు చుట్టుముట్టిన దానికన్నా హీనంగా మల్లన్న సాగర్ బాధితులను పోలీసులు చుట్టుముట్టి చిత్రహింసలకు గురిచేశారన్నారు. కామారెడ్డికి కేసీఆర్ వస్తే భయపడి పారిపోయాను అనుకున్నారని, తాను భయపడి పారిపోయే వ్యక్తిని కాదన్నారు. 2014 కు ముందు గంప గోవర్ధన్ చాలా మంచివాడని కితాబిచ్చారు.

2014 తరవాత షబ్బీర్ అలీ వద్ద ఉన్నవాళ్లు గంప చుట్టూ చేరారని, అందులో నవగ్రహాలు ఏకుమేకై కూర్చున్నారని, ఇప్పుడు ఆ నవగ్రహాలను చూస్తే గంప గోవర్ధన్ భయపడే పరిస్థితి తయారైందన్నారు. కొడుకును రాజకీయాల్లోకి తేవలనుకున్న గంపకు ఆయన పరిస్థితే అగమ్యగోచరంగా తయారైందన్నారు. కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నట్టు ప్రకటన రాగానే గంప పీడ పోయిందని కొందరు దావత్ చేసుకున్నారన్నారు.

కేసీఆర్ వస్తే గజ్వేల్ ఉన్న లీడర్ల మాదిరిగా ఇక్కడ తయారవుతారని, ఊరికొక ఎమ్మెల్యే అవుతారని, పెత్తనాలు చేస్తారన్నారు. కేసీఆర్ వస్తే ఇక్కడ అరాచకం పెరుగుతుందని చెప్పారు.

ఇప్పటిదాకా ఎమ్మెల్యేను ఇంటికి వెళ్లి కలవాలంటేనే కాళ్ళు కదల్చలేని ప్రజలు ఇప్పుడు కేసీఆర్ ను కలిసే పరిస్థితి ఉంటుందా.. ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. ఒకవేళ కేసీఆర్ గెలిస్తే కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పెడతారని, ఇందులో బస్వపూర్ నుంచి సదాశివనగర్ వరకు భూముల్ని పెడతారని, ఇండస్ట్రీ, సెజ్ ల పేరుతో భూములు తీసుకుంటారన్నారు. కామారెడ్డి మరో మల్లన్నసాగర్ కాకముందే ప్రజలు మేల్కోవాలన్నారు.

రెండేళ్లలోనే రంగనాయక్ సాగర్ నిర్మించిన కేసీఆర్ పదేళ్లయినా ప్రాణహిత చేవెళ్లకు చెందిన భూంపల్లి ప్రాజెక్టు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ఈ పదేళ్ళలో వెయ్యి కోట్లు కేటాయించి ఉంటే కామారెడ్డి, ఎల్లారెడ్డి భూములు సస్యశ్యామలం అయ్యేవన్నారు. రంగనాయక్ సాగర్ ద్వారా 80 వేల ఎకరాలు సిద్దిపేట, 30 వేల ఎకరాలు సిరిసిల్ల భూములకు నీళ్లు పోతున్నాయని తెలిపారు. కాళేశ్వరం ద్వారా అక్కడి రైతులకు ఎకరానికి 13,03,480 రూపాయలు ఖర్చు చేస్తున్న కేసీఆర్ కామారెడ్డి రైతులకు మాత్రం 5 వేల రైతుబంధు మాత్రమే ఇస్తున్నారన్నారు.

రైతుబంధు, పింఛన్లను కావాల్సిన 20 వేల కోట్ల నిధులు కేవలం ఎక్సైజ్ ద్వారా వస్తున్నాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి కూడా రెండు చోట్లా పోటీ చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి.. నిజాయితీగా పనిచేసే వారు ఎవరో గిర్తించాలని కోరారు. కామారెడ్డి నుంచి కేసీఆర్, షబ్బీర్ అలీని తరిమి కొడతామన్నారు. కామారెడ్డి మాత్రమే కాదు.. యావత్ తెలంగాణ మొత్తం కేసీఆర్ కు బైబై చెప్పే రోజులు వచ్చాయన్నారు. కేసీఆర్ తో రాజకీయ పదవి విరమణ చేపిస్తామని తెలిపారు. కామారెడ్డిలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

పాజిటీవ్: ఇంకా కనికాను వదలని కరోనా వైరస్

Satyam NEWS

గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలి 32 మంది మృతి

Satyam NEWS

భావితరాలకు భవిష్యత్తు కోసమే హరితహారం

Satyam NEWS

Leave a Comment