25.2 C
Hyderabad
May 16, 2024 20: 30 PM
Slider కర్నూలు

కర్నూలులో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

#Dr. G. Srujana

కర్నూల్ నగరంలో గణేష్ నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గణేష్ నిమజ్జనాన్ని విజయవంతంగా, తేజోవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తరఫు నుండి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు. సోమవారం గణేష్ నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా వినాయక ఘాట్ వద్ద ఏర్పాట్లను కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మునిసిపల్ కమీషనర్ భార్గవ్ తేజ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా కర్నూలు నగరంలో జరిగే వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, ఫిషరీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు..

గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా అంతే గౌరవంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుందన్నారు.. నిన్నటి వరకు నీటి ఎద్దడి వల్ల కొంత ఇబ్బంది కలుగుతుందేమో అని అనుకున్నామని, అయితే నిన్న కురిసిన వర్షాల కారణంగా టిబి డ్యామ్ ఇన్ఫ్లో పెరగడం వల్ల టిబి డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడంతో నీటి ప్రవాహం సమస్య కూడా లేదన్నారు. కర్నూలు నగరంలో రేపు జరగనున్న గణేష్ నిమజ్జనంలో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటించాలని డిఈఓ కి ఆదేశాలు జారీచేశామన్నారు.

నిమజ్జనం జరిగే వినాయక ఘాట్ వద్ద విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు 3 ప్లాట్ ఫారం లు, 9 క్రేన్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత వాటిని కొంత ముందుకు తీసుకొని వెళ్లేందుకు మోటర్ బోట్ ఏర్పాటు చేయాలని మత్స్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.

సాయంత్రం లోపు బ్యారికేడింగ్ పనులు పూర్తి చేయాలని , వాటిని పోలీస్ అధికారులు పరిశీలించిన తర్వాత లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేయాలని ఆర్ అండ్ బి ఎస్ఈ ని అదేశించారు.కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులకు సూచించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తులకు, విగ్రహాలను తీసుకుని వచ్చే బృందాలకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వివిధ శాఖల అధికారులు అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి ఏర్పాట్లను పూర్తి చేశారన్నారు.

మరి ముఖ్యంగా వర్షాలు పడనందున, అటు సుంకేసుల డ్యామ్ లో తక్కువ నీరు ఉన్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం తరఫునండి జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులు కర్ణాటక ప్రభుత్వంతో, టిబి అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయించడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజల ప్రార్థనల వల్ల, దేవుడి కరుణతో అక్కడ వర్షాలు పడడం వల్ల ఇక్కడ సంతోషంగా నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకుంటామన్నారు. కర్నూలు నగరంలో జరిగే గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని సహాయ సహకారాలు అందాయని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి , ఆర్ అండ్ బి ఎస్ఈ నాగరాజు, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Related posts

రెండు గంటల పాటు whats app కు గ్రహణం!

Satyam NEWS

కువైట్ యన్టీఆర్ సేవాసమితి వరుస అన్న వితరణ

Satyam NEWS

జీవనవిధానం మెరుగు పరిచేందుకు నూతన ఆవిష్కరణలు అవసరం

Satyam NEWS

Leave a Comment