25.2 C
Hyderabad
May 16, 2024 21: 35 PM
Slider సంపాదకీయం

పవన్ కల్యాణ్ వాగ్బాణాలకు విలవిలలాడిన వైసీపీ

#pavan

ఎంతో క్లారిటీతో ఏపి ముఖ్యమంత్రిని, రాష్ట్రంలోని ముగ్గురు మంత్రులను ఏకిపారేసిన పవన్ కల్యాణ్ ప్రసంగం పూర్తి అయ్యే లోపే వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంతకాలం తనపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు ‘‘వారి భాష’’ లోనే సమాధానం ఇచ్చారు.

వెధవలు, సన్నాసులు అనే పదాలు వాడుతూ తనను అలాంటి వారు తిడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఐటి మంత్రి గుడివాడ అమర్ నాథ్ ను అయితే మరింత అవహేళన చేశారు. ఆయన పేరును కూడా ప్రస్తావించకుండా తీవ్రంగా విమర్శించారు. తనపై వంటికాలితో లేచే వైసీపీ నేతలందరిని పేరు పేరునా పవన్ కల్యాణ్ తీవ్రంగా దుయ్యబట్టారు. వైపీసీ నేతలు సాధారణంగా వాడేస్తున్న దారుణమైన భాషలోనే పవన్ కల్యాణ్ సమాధానం చెప్పడమే కాకుండా మళ్లీ చెప్పు చూపించే ప్రయత్నం చేశారు.

ఈ సారి తాను కాదని, జనసైనికులు చెప్పులు చూపించాలని పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ ప్రసంగం ముగిసీముగియగానే ముందే స్క్రిప్టు రాసిపెట్టుకున్నారా అన్నంత స్పీడ్ గా వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ మధ్య కాలంలో వైసీపీ సోషల్ మీడియా ఎంతో చురుకుగా ఉన్నది. తమ అధినేతపై ఎవరు ఏ మాట మాట్లాడినా వేల సంఖ్యలో ట్విట్లు మరు క్షణంలో వచ్చేస్తున్నాయి.

ఇలా ఎలా చేయగలుగుతున్నారనేది చాలా మందికి కలుగుతున్న అనుమానం. ఎందుకంటే ఇలా చేయాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొన్ని వేల మందికి జీతాలు ఇచ్చి పెట్టుకుంటే తప్ప ఇంత భారీ స్థాయిలో దాడి చేయడం సాధ్యం కాదు. ఇలా ఒక్క సారి కాదు పదే పదే ఇదే విధంగా చేస్తున్నారు. పవన్ కల్యాణ్ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు కూడా సాధారణంగా లేవు.

మంత్రి రోజా ఈ మధ్య కాలంలో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ లను సొంత జిల్లాలో ఓడిపోయిన వారు రాజకీయాలకు ఎందుకు పనికి వస్తారు అంటూ దారుణమైన వ్యాఖ్య చేశారు. అంతే దారుణమైన భాషలో పవన్ కల్యాణ్ నేడు సమాధానం ఇచ్చారు. ఒక్క రోజా, అమర్ నాథ్ లనే కాదు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్ కూడా ఆన్ లైన్ జూదం ఆడతారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం పలువురిని ఆశ్చర్యపరిచింది.

జగన్ తనకు చదువుకునే రోజుల నుంచి తెలుసునని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. రాజకీయ వ్యూహాన్ని ఆయన ఈ సభలో చాలా స్పష్టంగానే చెప్పారు. ఆయన వెల్లడించిన రాజకీయ వ్యూహంతో ఒక్క సారిగా వైసీపీ గుండెల్లో గుబులు రేగిఉంటుంది. ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళుతున్నట్లు నర్మగర్భంగా చెప్పారు. ఇదే జరిగితే ఫలితం ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు తెలుసు.

అందుకే పవన్ కల్యాణ్ ప్రసంగం పూర్తి అయ్యే లోపునే తమ విమర్శలు ప్రారంభించారు. పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు మరింత దారుణంగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ కూడా అదే భాష వాడారు కాబట్టి ఇప్పుడు భాష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి పవన్ కల్యాణ్ రణ స్థలం నుంచి రణభేరి మోగించారు. దాని రీసౌండ్ చాలా దూరం చాలా కాలం పాటు వినిపిస్తూనే ఉంటుంది.

Related posts

కొల్లాపూర్ పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్

Satyam NEWS

ధ్వని మోషన్ పోస్టర్ ప్రయోగాత్మకంగా ఉంది గెటప్ శ్రీను !!!

Satyam NEWS

20న అయోధ్య మైదానంలో హైందవ శంఖారావం…!

Bhavani

Leave a Comment