తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ టి రామారావు 24వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో ఆయన కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడి సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి మనుమడు దేవాన్షుతో కలిసి వచ్చి ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు.
ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ కార్యకర్తలతో వచ్చి నివాళి అర్పించారు. సనత్ నగర్ నియోజకవర్గం లోని రసూల్ పురా చౌరాస్తాలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకూ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీకి శ్రీపతి సతీష్ నాయకత్వం వహించారు. ఎన్టీఆర్ అమర్ జ్యోతి ర్యాలీ ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకోగానే మాజీ ఎమ్మెల్యే, సీనియర్ తెలుగు మహిళ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ వర్ధంతి పెద్ద ఎత్తున జరుపుకోవడం హర్షణీయమని అన్నారు.
ఇది తెలుగు ప్రజలను గౌరవించుకోవడమని అన్నారు. అన్నగారి సేవలు చిరస్మరణీయమని ఆయన రాజకీయాలలో వేసిన బాటలోనే ఇప్పటికీ వందలాది మంది నాయకులు నడుస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన ఎన్టీఆర్ పేద వాడికి ఇప్పటికీ ఎప్పటికీ ఆరాధ్య దైవమని కాట్రగడ్డ ప్రసూన అన్నారు.