34.2 C
Hyderabad
May 16, 2024 15: 44 PM
Slider ప్రత్యేకం

న్యాయ‌ప‌రిజ్ఞానం పెంపొందించుకోవాలి

#justice

విజయనగరం జిల్లాలో కొత్త‌గా ఏర్పాటైన న్యాయ‌స్థానాల ద్వారా ప్ర‌జ‌ల‌కు స‌త్వ‌ర న్యాయం అందాల‌ని రాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తులు అభిల‌షించారు. ఈ దిశ‌గా న్యాయాధికారులు, న్యాయ‌వాదులు కృషిచేయాల్సి వుంద‌ని వారు పిలుపునిచ్చారు. జిల్లాలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వ‌చ్చిన ఐదుగురు రాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తులు విజయనగరం  జిల్లా న్యాయ‌స్థానాల స‌ముదాయంలో కొత్త‌గా మంజూరైన అద‌న‌పు సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి న్యాయ‌స్థానాన్ని ప్రారంభించారు.

రాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తి, జిల్లా పోర్టుఫోలియో జ‌డ్జి జ‌స్టిస్ కె.శ్రీ‌నివాస‌రెడ్డి, హైకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ ఆకుల వెంక‌ట శేష‌సాయి, జ‌స్టిస్ చీక‌టి మాన‌వేంద్ర‌నాథ్ రాయ్‌, జ‌స్టిస్ ఉప‌మాక దుర్గాప్ర‌సాద‌రావు, జ‌స్టిస్ దుప్ప‌ల వెంక‌ట‌ర‌మ‌ణ‌ల‌తో క‌ల‌సి ప్రారంభించారు. అలాగే న్యాయ‌సేవా స‌ద‌న్ లో ఏర్పాటు చేసిన లీగ‌ల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాల‌యాన్ని జ‌స్టిస్ ఏ.వి.శేష‌సాయి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటైన కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఏ.వి.శేష‌సాయి మాట్లాడుతూ యువ న్యాయ‌వాదుల‌కు త‌గిన శిక్ష‌ణ ఇచ్చి మెరిక‌ల్లాంటి న్యాయ‌వాదుల‌ను అందించాల‌ని సీనియ‌ర్ న్యాయ‌వాదుల‌కు సూచించారు. వ‌య‌స్సు, అనుభ‌వం, విజ్ఞానం రీత్యా సీనియ‌ర్ న్యాయ‌వాదులు జాతికి సంప‌ద వంటివారని వారిని కాపాడుకోవ‌ల‌సి వుంద‌న్నారు.

న్యాయ‌వాదులు, న్యాయాధికారులు ప‌ర‌స్ప‌రం గౌర‌వించుకోవ‌డం ద్వారా స‌మాజానికి మేలుచేయ‌గ‌ల‌మ‌న్నారు. మంచి, నాణ్య‌మైన వాద‌న‌లు వినిపించే న్యాయ‌వాదులు వున్న‌పుడే నాణ్య‌మైన తీర్పులు కూడా వ‌స్తాయ‌న్నారు. మ‌హాక‌వి గుర‌జాడ‌ను స్మ‌రించుకొంటూ దేశ‌మంటే మ‌ట్టికాదోయ్ దేశ‌మంటే మ‌నుషులోయ్ అంటూ జాతిని జాగృతి చేసి మార్గ‌నిర్దేశం చేసిన‌ మ‌హాక‌వి గుర‌జాడ వంటి క‌విని అందించిన ఈ నేల ఎంతో ధ‌న్య‌మైన‌ద‌ని పేర్కొన్నారు. ఎంద‌రో ఉద్దండులైన‌ న్యాయ‌మూర్తులు, న్యాయ‌వాదుల‌ను ఈ జిల్లా అందించింద‌న్నారు. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు అల్ప సంతోషుల‌ని అటువంటి వారికి ఎల్ల‌ప్పుడూ మంచే జ‌రుగుతుంద‌న్నారు.

హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ చీక‌టి మాన‌వేంద్ర‌నాథ్ రాయ్ మాట్లాడుతూ జిల్లా కోర్టు భ‌వ‌న స‌ముదాయాల‌కు 99 కోట్ల‌తో మంజూరైన కొత్త భ‌వ‌నాల‌ను నాణ్య‌త‌గా నిర్మించేలా బార్ కౌన్సిల్, జిల్లా అధికార యంత్రాంగం త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. జిల్లాలో అద‌న‌పు సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి కోర్టు ఏర్పాటుకోసం 2012లోనే ప్ర‌తిపాద‌న‌లు చేసిన‌ప్ప‌టికీ వాటిని ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని, 2019 త‌ర్వాత దీనిపై దృష్టిసారించి త‌గిన ప్ర‌య‌త్నాలు చేయ‌డంతో ప్ర‌స్తుతం కోర్టు ఏర్పాటు సాధ్య‌మ‌య్యింద‌ని పేర్కొన్నారు.

ఈ కోర్టు ఏర్పాటుకోసం ఎంతో పోరాటం చేసి సాధించామ‌న్నారు. దీనిలో స్థానిక నాయ‌కుల స‌హ‌కారం కూడా వుంద‌న్నారు. ప్ర‌స్తుతం రెండు కోర్టులు ఏర్పాటైనందున న్యాయ‌వాదులు, న్యాయాధికారులు స‌మిష్టిగా ప‌నిచేసి పెండింగ్ లోని కేసులు స‌త్వ‌రంగా ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు. కోర్టుల‌న్నీ బ్రిటిష్ కాలం నాటి భ‌వ‌నాల్లోనే వున్నాయ‌ని అందువ‌ల్ల జిల్లాలోని కోర్టుల్లో అవ‌స‌ర‌మైన మౌళిక వ‌స‌తులు క‌ల్పించ‌డంలో జిల్లా క‌లెక్ట‌ర్‌లు కోర్టు యంత్రాంగానికి స‌హ‌క‌రించాల‌ని సూచించారు.

జిల్లా కోర్టు భ‌వ‌నాల‌ను గ‌తంలో చెరువులో నిర్మించినందున అతిత‌క్కువ కాలంలోనే దెబ్బ‌తిన్నాయ‌ని పేర్కొన్నారు. అందువ‌ల్ల ప్ర‌స్తుతం కొత్త‌గా మంజూరైన భ‌వ‌నాల‌ను ఎంతో నాణ్య‌త‌గా, క‌నీసం వందేళ్ల వ‌ర‌కు భ‌వ‌నాలు నిలిచేలా నిర్మించే విధంగా టెక్నాల‌జీని అందించాల‌ని రోడ్లు భ‌వ‌నాల శాఖ‌ను కోరామ‌న్నారు.న్యాయ‌వాద వృత్తిలో రాణించాలంటే త‌గిన ప‌రిజ్ఞానాన్ని పెంపొందించుకొనేందుకు యువ న్యాయ‌వాదులు ప్ర‌య‌త్నించాల‌ని జిల్లా పోర్టుఫోలియో జ‌డ్జి జ‌స్టిస్ కె.శ్రీ‌నివాస‌రెడ్డి సూచించారు.

వారు ఈ వృత్తిలో చేరేముందు ఒక ల‌క్ష్యాన్ని ఏర్ప‌ర‌చుకోవాల‌ని చెప్పారు. ఆ ల‌క్ష్యాన్ని చేరుకోడానికి ఏ స్థాయిలో కృషిచేయాలో అవ‌గాహ‌న క‌లిగి వుండాల‌న్నారు. జూనియ‌ర్ న్యాయ‌వాదులు నిరంత‌రం పుస్త‌కాల‌ను అధ్య‌య‌నం చేయ‌డం ద్వారా ఈ వృత్తిలో బాగా రాణిస్తార‌ని చెప్పారు. జిల్లా కోర్టు భ‌వ‌నాల నిర్మాణంకోసం మ‌ట్టి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణను బార్ అసోసియేష‌న్ త‌మ సొంత ఖ‌ర్చుల‌తో చేయించేందుకు ముందుకు రావ‌డంపై అభినందించారు.

న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఉప‌మాక దుర్గాప్ర‌సాద‌రావు మాట్లాడుతూ విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం జిల్లాల్లోని న్యాయ‌స్థానాల భ‌వ‌నాల ప‌రిస్థితి ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు. సాలూరు, పార్వ‌తీపురం న్యాయ‌స్థానాలు మిన‌హా ఇత‌ర కోర్టు భ‌వ‌నాల ప‌రిస్థితి ద‌య‌నీయంగా వుంద‌న్నారు. జిల్లాలోని ఎస్‌.కోట‌, కొత్త‌వ‌ల‌స‌, చీపురుప‌ల్లి, బొబ్బిలి త‌దిత‌ర ప్రాంతాల్లోని కోర్టుల‌కు కొత్త భ‌వ‌నాలు మంజూరు చేయించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తామ‌న్నారు.

ఎస్‌.కోట‌, కొత్త‌వ‌ల‌స‌, చీపురుప‌ల్లి, బొబ్బిలిలో కోర్టు భ‌వనాల నిర్మాణానికి అంచ‌నాలు రూపొందించామ‌న్నారు. జిల్లా కోర్టు భ‌వ‌న స‌ముదాయంలో ఒక కాన్ఫ‌రెన్సు హాలు కూడా ఏర్పాటు కోసం సూచ‌న చేశామ‌న్నారు. వ‌చ్చే ఐదేళ్ల‌లో జిల్లాలో అన్ని కోర్టులూ మంచి వ‌స‌తుల‌తో ఏర్ప‌డ‌తాయ‌ని ఆశిస్తున్న‌ట్టు చెప్పారు. బార్ అసోసియేష‌న్ స‌హ‌కారంతోనే వ‌స‌తులు స‌మ‌కూర్చ‌డం సాధ్యం అవుతుంద‌ని చెప్పారు.

కోర్టు భ‌వ‌నాల నిర్మాణం చేసేట‌పుడు ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు అనుగుణంగా తీర్చిదిద్ద‌డానికి బార్ అసోసియేష‌న్ మంచి సూచ‌న‌లు అందించాల్సి వుంద‌న్నారు. న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దుప్ప‌ల వెంక‌ట‌ర‌మ‌ణ మాట్లాడుతూ జిల్లా కోర్టు భ‌వ‌నంలో న్యాయ‌వాదులు, న్యాయ‌మూర్తుల శారీర‌క, మాన‌సిక ధృడ‌త్వం కోసం త‌గిన వ‌స‌తులు ఏర్ప‌రిచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

ఇక్క‌డి బార్ అసోసియేష‌న్ ప‌న్నెండేళ్లుగా చేసిన పోరాట ఫ‌లితంగా సాధించుకున్న ఈ న్యాయ‌స్థానంలో కేసులు త్వ‌ర‌గా ప‌రిష్కారం కావాల‌న్నారు. 250 పోక్సో కేసులు వున్నాయ‌ని, మ‌రో 4000 ఇత‌ర కేసులు వున్నాయ‌ని అందువ‌ల్ల వెంట‌నే న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించి ప‌రిష్క‌రించాల్సి వుంద‌న్నారు.జిల్లాలో కోర్టుల‌కు అవ‌స‌ర‌మైన మౌళిక వస‌తులు స‌మ‌కూర్చ‌డంలో జిల్లా యంత్రాంగం త‌ర‌పున పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్  నాగ‌ల‌క్ష్మి చెప్పారు. జిల్లాకు 99 కోట్ల‌తో కొత్త కోర్టు భ‌వ‌నాలు మంజూరు కావ‌డం సంతోష‌క‌ర‌మ‌ని, దీని నిర్మాణానికి పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌న్నారు.

జిల్లాలో కేసుల ప‌రిష్కారంలో న్యాయ‌వ్య‌వ‌స్థ నుంచి పోలీసుల‌కు పూర్తి స‌హ‌కారం వుంద‌ని ఎస్‌.పి. ఎం.దీపిక చెప్పారు. న్యాయ‌వ్య‌వ‌స్థ చేసిన సూచ‌న‌లు, ఇచ్చిన ఆదేశాలు త‌మ‌కు ఎంత‌గానో మార్గ‌నిర్దేశం చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. వారు చేసిన సూచ‌న‌ల‌తో త‌మ శాఖ ప‌నితీరు మెరుగుప‌రిచే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలిపారు.జిల్లా జ‌డ్జి బి.సాయి క‌ళ్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మ‌న్ గంటా రామారావు, జిల్లా బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు దామోద‌ర్ రామ్మోహ‌న్‌, కె.వి.ఎన్‌.త‌మ్మ‌న్న‌శెట్టి త‌దిత‌రులు మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా హైకోర్టు న్యాయ‌మూర్తుల‌ను బార్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు, కోర్టు ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు ఘ‌నంగా స‌న్మానించారు.

Related posts

త్వరలోనే కొల్లాపూర్ కు రానున్న కేంద్ర మంత్రులు

Satyam NEWS

అత్యధిక మార్కులు సాధించిన నవ్వకు ప్రశంస

Satyam NEWS

అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన వారికి ప్రభుత్వ సాయం

Satyam NEWS

Leave a Comment