38.7 C
Hyderabad
May 7, 2024 17: 50 PM
ప్రత్యేకం

ఒక కొత్త కాంతి ఉద్భవించిన పవిత్ర దినం

vevekaa 10

అందరూ నా వారు అనుకోవడమే నిజమైన స్వేచ్ఛ- స్వామి వివేకానంద చెప్పిన ఈ వేదాంత తత్వం ఈనాటి పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. ఎంత సేపూ పక్కవారిని అనుమానంగా చూస్తే ఆ అనుమానంతో మనమే బయటి ప్రపంచంలో స్వేచ్ఛగా మెలగలేం. అది స్వేచ్ఛ కోల్పోవడం అంటే.

అందరూ నా వారు అనుకుంటే, అదే స్వేచ్ఛ. స్వామి వివేకానంద జీవితాన్ని కాచివడపోసి చెప్పిన సత్యాలు హిందూ తత్వాన్ని, దాని గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియచేశాయి. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే. తన గురువు రామకృష్ణుడు నేర్పిన ‘జీవుడే దేవుడు’ అనేది వివేకానందుని మంత్రం.

‘దరిద్ర నారాయణ సేవ’ ఆ భగవంతునికి చేసే సేవతో సమానమన్నారు. విశ్వమంతా బ్రహ్మం నిండి ఉందనీ, హెచ్చు తగ్గులు లేవనీ వివేకానందుడు చాటి చెప్పారు. తన ప్రసంగాలతో భారతదేశాన్ని చైతన్య పరిచాడు వివేకానందుడు. జీవిత పరమార్థాన్ని బోధించాడు. యువతకు కర్తవ్యాన్ని నిర్దేశించాడు. హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు.

ఆయన వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం అప్పటిలోనే ఆయనకు బ్రహ్మరధం పట్టింది. 1863 జనవరి 12న జన్మించిన వివేకానందుడు ఈ ప్రపంచానికి లభించిన అద్భుతం. మహా గురువు రామకృష్ణ పరమహంస కు ప్రియ శిష్యుడైన వివేకానందుని పూర్వ నామం నరేంద్ర నాధుడు.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రసంగాలు చేసి వేదాంత, యోగ తత్త్వ శాస్త్రాల్ని ఆనాటి సమాజ పరిస్థితులకు జత చేసి సమాజానికి అందించిన తత్వవేత్త. ఆనాటికే కాదు. ఈనాటికీ… రాబోయే కొన్ని వందల తరాలకూ ఆయన చెప్పినదే వేదవాక్కు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే చిరకాలంగా నిలిచిపోయే మహోన్నత ఆధ్యాత్మిక నాయకుడు స్వామి వివేకానందుడు.

ఆయన ఎన్నో ప్రసంగాలు చేశారు. కానీ ఆయనకు అరుదైన అవకాశాన్ని ఇచ్చింది హైదరాబాద్ మహానగరం. వివేకానంద పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది చికాగో సర్వమత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం. కానీ అంతకు ముందే సికింద్రాబాద్‌ లోని మెహబూబియా కళాశాల వేదికగా 1893, ఫిబ్రవరి 13న ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగమే ఆయన తొలి ప్రసంగంగా చరిత్రలో నిలిచిపోయింది.

‘మై మిషన్‌ టు ది వెస్ట్‌’ అని చికాగో సమ్మేళనానికి వెళ్లడానికి కారణాలను ఆయన మెహబూబియా కాలేజీలో వివరించారు. ఇంగ్లీష్, హిందీ భాషలలో ఆయన ప్రసంగం చేయడంతో నిజాం సంస్థానం నుంచి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వందలాదిగా సమావేశానికి వచ్చారు. అప్పటి నిజాం రాజ ప్రధాని అయిన మహారాజా కిషన్ ప్రసాద్, ముస్లిం రాజులు అమెరికా, చికాగో పర్యటనకయ్యే మొత్తం ఖర్చులను భరిస్తామని ముందుకు వచ్చారు.

అయితే వివేకానందుడు అలాంటివి వద్దన్నాడు. ఒక వ్యక్తి తనను తాను ఎలా భావిస్తాడో అదే అవుతాడు. తాను బలహీనుడినని భావిస్తే బలహీనుడే అవుతాడు, బలవంతుడినని భావిస్తే బలవంతుడే అవుతాడు అని ఆయన చెప్పిన జీవిత సత్యం. ఇలా భావించిన వారు గతంలో సామాన్యులైనా ఇప్పుడు గొప్ప నాయకులుగా ఉన్నారు.

నీ శక్తే నీ జీవితం నీ బలహీనతే నీ మరణం అని ఎవరు చెప్పగలరు ఒక్క వివేకానందుడు తప్ప? ఇటువంటి ఎన్నో అమూల్యమైన జీవిత సత్యాలను ప్రపంచానికి చాటిచెప్పిన మహామనిషి స్వామీ వివేకానంద. మందలో ఒకరిగా ఉండకు…వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు…అంటూ ఆయన ఇచ్చిన పిలుపు నకు జాతి స్పందించింది.

 పశ్చిమబెంగాల్‌లోని కలకత్తాలో జన్మించిన వివేకానందుడు దేశం మొత్తానికి చెందిన వాడనే అంటారు తప్ప ఒక ప్రాంతానికి చెందినవాడని పొరబాటున కూడా ఎవరూ అనరు. అదే ఆయన గొప్పతనం. 1893 సెప్టెంబర్ 11న అమెరికా లోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి భారత ప్రతినిధిగా స్వామి వివేకానంద హాజరయ్యారు.

అంత పెద్ద కార్యక్రమంలో మాట్లాడేముందు ఒక్కసారి గురువుగారిని స్మరించుకుని ‘మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా’ అంటూ ఉపన్యాసం ప్రారంభించారు. ఆ పదాలు వినగానే అన్ని దేశాల ప్రతినిధులు దాదాపు మూడు నిమిషాలపాటు ఆపకుండా చప్పట్లు కొట్టారు. నిలువెత్తు భారతీయత.. స్ఫూర్తినిచ్చే మహావక్త వివేకానందుడు.

ఆయన మాటలు తూటాల కంటే వేగం వస్తాయి. అంతకుమించిన వేగంతో మన ఆలోచనల్ని మార్చివేసి తెలియని ధైర్యాన్ని నింపుతాయి. విజయం వైపు తీసుకెళ్తాయి. కేవలం ముప్ఫై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించినప్పటికీ భారతదేశ ఖ్యాతిని, మన సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద.

అందుకే స్వామి వివేకానంద పుట్టినరోజు జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జనవరి 12 ఆయన పుట్టిన రోజు మాత్రమే కాదు. ఒక జాతి పుట్టిన రోజు. ఒక స్ఫూర్తిమంతమైన కాంతి పుట్టిన రోజు. ఆయనను స్మరించుకోవడమే మనకు గర్వకారణం.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్

Related posts

పవన్ కళ్యాణ్ పై ఆధారపడ్డ ఏ పీ రాజకీయం

Satyam NEWS

అక్షయ తృతీయ రోజు తగ్గిన బంగారం వెండి ధరలు

Satyam NEWS

ఇంటి అద్దెపై ఇక నుంచి 18 శాతం GST

Satyam NEWS

Leave a Comment