31.7 C
Hyderabad
May 7, 2024 00: 00 AM
ప్రత్యేకం

భారత దేశం తెలియాలంటే స్వామి వివేకానందను చదవాలి

vivekananda full

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

నేను నేర్చుకున్న అత్యంత ఉన్నతమైన పాఠాలలో లక్ష్యం ప్రధానమైనది. దానిని చేరుకునే మార్గం గురించి కూడా గమనించాలి. ఎవరి నుండైతే ఈ పాఠాన్ని నేర్చుకున్నానో ఆ మహాత్ముని స్వీయ జీవనమే ఓ ప్రధాన తత్త్వానికి ఉదాహరణగా ఉండేది. ఆ ఒక్క తత్త్వం నుంచే నేను అనేక పాఠాలు నేర్చుకున్నాను.

విజయ రహస్యమంతా ఆ తత్త్వంలోనే ఉందని చెప్పిన స్వామి వివేకానంద గొప్ప వక్తగా యావత్ ప్రపంచ దృష్టినీ కట్టిపడేసారు. ఆయన ఉపన్యాసం మధ్యలో ఎవరైనా ఎగతాళి చేస్తే వారికి తగిన రీతిలో జవాబిచ్చేవారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఆలోచిస్తూ మీనమేషాలు లెక్కపెట్టేవారు దేనినీ సాధించలేరని, సత్యమని, మంచిదని అర్థం చేసుకున్న దేనినైనా తక్షణమే ఆచరించాలని చెప్పిన స్వామి వివేకానంద కుల, మత, జాతి, లింగ భేదాలకతీతంగా ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయులయ్యారు.

యువతకు మార్గదర్శకులైన స్వామి వివేకానంద 1863 జనవరి 12వ తేదీన ఓ బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి న్యాయవాది. స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్ర నాధ్ దత్తా. తన ఎనిమిదో ఏట ఆయన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రో పాలిటన్ పాఠశాలలో చదువుకున్నారు.

చిన్న వయసులోనే పాశ్చ్యాత, తత్వశాస్త్ర గ్రంధాలు, చరిత్ర పుస్తకాలు, అన్ని మతాల గ్రంథాలు చదివిన స్వామి వివేకానందుల వారి ప్రతిభ ఎలాంటిదంటే, ఆయన ఓ  పేరాలోని మొదటి, చివరి వాక్యాలు చదివితే ఆ పేరాలోని సారమంతా అర్థం చేసుకునే వారు. యువకుడిగా ఉన్న రోజుల్లోనే భగవంతుడనే వాడుంటే ఎలాగైనా ఆయనను కచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నారు.

పెద్దవాళ్ళెవరు కనిపించినా “మీరు భగవంతుడిని చూసారా ?” అని అడుగుతుండేవారు. అయితే దేవుడిని చూసామని జవాబిచ్చిన వారే లేరు. ఈ క్రమంలో ఓ రోజు ప్రిన్సిపాల్ విలియం హేస్టీ పాఠం చెప్తూ చెప్తూ పారవశ్యం అనే మాట ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ పదానికి అసలైన అర్ధం తెలియాలంటే దక్షిణేశ్వర్లో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంసను గురించి చెప్పి ఆయనను కలవమని స్వామి వివేకానందతో చెప్పారు.

ఆ వెంటనే స్వామి వివేకానంద దక్షిణేశ్వర్ కు వెళ్ళి రామకృష్ణ పరమహంస ను కలిసి “మీరు దేవుణ్ణి కనులారా చూసారా?” అని అడుగుతారు. అందుకు పరమహంస జవాబిస్తూ “అవును చూసాను. నిన్ను ఎలా చూస్తున్నానో, నీతో ఎలా మాట్లాడుతున్నానో అలానే భగవంతుడిని కూడా చూశాను. మాట్లాడాను”  అని అన్నారు.

మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దేవుడిని చూసానని చెప్పేసరికి స్వామి వివేకానంద ఆశ్చర్యపోయారు. అయితే తనకు కూడా దేవుడిని చూపించమని పరమహంసను అడిగారు. అప్పుడు రామకృష్ణ పరమహంస ఆయన కాలును మెల్లగా వివేకానంద ఒడిలో ఉంచారు. మరుక్షణం ఆయనకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయనలో ఏదో అయిపోతున్నట్లు అనిపించింది.

“నన్నేం చేస్తున్నారు ? నా తల్లిదండ్రులు బతికే ఉన్నారింకా. నేను వారి దగ్గరకు వెళ్ళాలి” అని పెద్దగా అరిచారు స్వామి వివేకానంద.  అప్పుడు పరమహంస చిన్న నవ్వు నవ్వి “ఈ రోజుకు ఇది చాలు” అంటూ తన కాలును వెనక్కి తీసేసారు. ఆ విధంగా పరమహంస సన్నిధిలో వివేకానందులవారు ఎన్నో అద్భుతాలను చూశారు.

ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సన్న్యాస మార్గంలోకి నడిచారు. 1886 లో రామకృష్ణ పరమహంస మరణించిన తర్వాత  ఆయన శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారికి వివేకానందులవారు సారథ్యం వహించారు.

కొంతమంది మహారాజులతోపాటు దేశ నలుమూల నుండి ఎందరో ఇచ్చిన విరాళాలతో స్వామి వివేకానంద 1893 మే 31న బొంబాయి నుండి ఒక నౌకలో బయలుదేరి చికాగో చేరుకున్నారు. అక్కడ సెప్టెంబర్ 11వ తేదీన ప్రారంభమైన సర్వ మత మహా సభలలో ఆయన చేసిన ప్రసంగం అందరికీ కనువిప్పు కలిగించింది. ఆయన దుస్తులు, వేషధారణ చూసి అవహేళన చేసిన వారు తీరా ఆయన ప్రసంగాన్ని విని విస్తుపోయారు.

స్వామిజీ లేచి నిల్చుని గంభీరమైన స్వరంతో అమెరికా దేశ సోదర సోదరీమణులారా అని పలకరించేసరికి సభలో ఉన్న వేలాది మందికి లేచి కొన్ని నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఆయన పిలుపులోని ఆత్మీయతకు కొందరైతే కన్నీరు కార్చారుకూడా. చప్పట్ల ఘోష ఆగిన తరువాత ఆయన భారతదేశ గొప్పతనం గురించి, ఆధ్యాత్మికత, సనాతన ధర్మం, సంసృతి, సంప్రదాయాల గురించి ఏకధాటిగా ప్రసంగించారు.

దానితో సభ మొత్తం చప్పట్లతో మార్మోగింది. మేధావులతోపాటు చిన్నపిల్లల్లా ఆయన వద్దకు వెళ్ళి పట్టరాని ఆనందంతో కరచాలనం చేశారు. ఆ ప్రసంగంతో చికాగో నగరమంతా ఆయన గురించే మాట్లాడుకున్నారు.  ఇలా ఉండగా, ఆయన ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన అంటే పడని ఓ వ్యక్తి ఒక పేపర్ మీద “ఇడియట్” అని రాసి స్వామిజీపైకి విసిరాడు.

 అప్పుడు స్వామిజీ ఆ కాగితం తెరిచి చదివి ఇలా “పాపం ఎవరో వాళ్ళ పేరు రాశారు కానీ తాను చెప్పదలచుకున్నదేదో రాయడం మర్చిపోయినట్లున్నారు”  అని అన్నారే తప్ప ఎక్కడా ఆవేశపడేవారు కాదు. దీనిని బట్టి ఆయన సమయస్ఫూర్తిని అర్థం చేసుకోవచ్చు. ఒకరోజు ప్రొఫెసర్ పీటర్ అనే ఆయన బల్లమీద కూర్చుని భోజనం చేస్తున్నారు. అప్పుడు స్వామి వివేకానంద తన ఆహారాన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని వచ్చి పీటర్ పక్కన కూర్చున్నారు.

అయితే వివేకానంద తన పక్కన కూర్చున్నందుకు పీటర్ ద్వేషిస్తూ “మిస్టర్, వివేకానంద మీకొక విషయం అర్థం కావడం లేదు. ఒక పంది, ఒక పావురం కలిసి కూర్చోకూడదు” అని అన్నారు. అయితే స్వామీజీ స్పందిస్తూ “మీరేమీ బాధపడకండి. నేను ఎగిరిపోతానులెండి” అంటూ మరో బల్లవద్దకు వెళ్లి అక్కడ కూర్చున్నారు.

దీంతో, నన్ను పంది అంటావా నువ్వు అని స్వామి వివేకానంద వైపు కోపంగా చూస్తారు పీటర్. మరుసటిరోజు క్లాసులో స్వామీ వివేకానందను ఎలాగోలా అవమానించాలనుకుని “మిస్టర్, వివేకానందా,  ఒక వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా ఓ సంచిలో డబ్బులు ఉండి, మరొక దాంట్లో జ్ఞానం ఉంటే ఆ రెండింటిలో ఏదో ఒక్కటే తీసుకోవాలంటే నువ్వేం తీసుకుంటావు?” అని ప్రశ్నిస్తారు పీటర్.

అప్పుడు వివేకానందుల వారు తాను డబ్బుల సంచీ తీసుకుంటానని సమాధానం ఇచ్చారు. అయితే ప్రొఫెసర్ తానైతే జ్ఞానంతో కూడిన సంచీని తీసుకుంటానని నవ్వుతారు.  అయితే స్వామీ వివేకానంద ఏ మాత్రం కంగారుపడకుండా చాలా ప్రశాంతంగా “ఎవరికి ఏది లేదో అదే కావాలని కోరుకుంటారు.

మీకు జ్ఞానం లేదు కనుక అదే తీసుకుంటారులెండి” అని చెప్పేసరికి ప్రొఫెసర్ పీటర్ కంగుతిన్నారు. మరొక సమావేశంలో ఒకరు భగవద్గీత పుస్తకంపై మరేవో మత గ్రంథాలు పేర్చి స్వామివివేకానంద దగ్గరకు వచ్చి “చూశారా, ఇదీ భగవద్గీత స్థాయి” అన్నారు. అయితే స్వామి భగవద్గీత పుస్తకాన్ని ఒక్కసారిగా పక్కకు లాగడంతో మిగిలిన పుస్తకాలన్నీ కింద పడిపోయాయి.

అప్పుడు స్వామి “చూశారా అన్నింటికీ ఈ గీతే ఆధారం” అనేసరికి అవతలి వ్యక్తి నోటంట మాట లేదు. ఓ సారి ఈయన అమెరికాలో ఒక రైలులో ఆయన ప్రయాణిస్తున్నప్పుడు కొందరు అమ్మాయిలు స్వామిజీ వేషధారణ చూసి ఆయనను ఆట పట్టించాలనుకుంటారు.

ఆ అమ్మాయిలు స్వామీజీ వద్దకు వచ్చి తన దగ్గరున్న వస్తువులను ఇవ్వమని, లేదంటే అదే బోగీలో ఉన్న పోలీసుకి మమ్మల్ని ఏడిపిస్తున్నావని ఫిర్యాదు చేస్తామంటారు. అప్పుడు స్వామిజీ తనకు వినపడదని, ఓ కాగితం మీద రాయమని సైగ చేసారు. అప్పుడు ఆ అమ్మాయిలు ఒక కాగితం మీద మీ దగ్గర ఉన్న డబ్బు ఇవ్వకపోతే మమ్మల్ని ఏడిపిస్తున్నావని పోలీసుకి ఫిర్యాదు చేస్తాం” అని రాసి స్వామీజీకి ఇస్తారు.

అప్పుడు స్వామిజీ “సరేగానీ ఇప్పుడు పోలీసులను పిలవండి” అని అంటారు. దాంతో చేసేదేమీ లేక ఆ అమ్మాయిలు తలదించుకుని వెళ్ళిపోతారు. ఆయన అన్ని మతాలను సమానంగా చూసేవారు. ఒకమారు ఆయన జీసస్ గురించి మాట్లాడుతూ “క్రీస్తు చూపించిన ప్రేమ మార్గానికి క్రీస్తు ఉన్న సమయంలో నేను కనుక పాలస్తీనాలో ఉండి ఉంటే నేను నా కన్నీటితో కాదు నా రక్తంతో ఆయన పాదాలు కడిగే వాడినని” అన్నారు.

రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యులుగా ఖ్యాతి గడించిన స్వామి వివేకానంద జయంతి జనవరి 12వ తేదీని నేషనల్ యూత్ డే గా దేశమంతటా భక్తిశ్రద్ధలతో మనం జరుపుకోవడం అందరికీ తెలిసిందే. దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రసంగాలు చేస్తూ, రామకృష్ణ మఠాభివృద్ధి కోసం పాటు పడిన స్వామి వివేకానంద 1902 జులై 4 వ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో కాస్సేపు ధ్యానం చేశారు.

ఆ తరువాత మంచం మీద పడుకుని ఆయన తమ తుదిశ్వాస  విడిచారు. అప్పుడు ఆయన వయస్సు 39 ఏళ్లు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన బోధనలు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శనీయమే. మహాత్మా గాంధీ , సుభాష్ చంద్రబోస్, తిలక్, బిపిన్ చంద్ర పాల్ వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులకు ఆయన ఆదర్శం. అందుకే రవీంద్ర నాథ్ ఠాగూర్ “ఎవరైనా భారత దేశం గురించి తెలుసుకోవాలనుకుంటే స్వామీ వివేకానంద గురించి తప్పనిసరిగా చదవాలి” అని చెప్పారు.

యామిజాల జగదీశ్, సీనియర్ జర్నలిస్టు

Related posts

రోడ్ల దుస్థితి పై డిజిటల్ వేదిక గా జనసేన ఉద్యమం

Satyam NEWS

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

Satyam NEWS

సీబీఐ కోర్టుకు జగన్ మళ్లీ ఎప్పుడు రావాలి?

Satyam NEWS

Leave a Comment