32.2 C
Hyderabad
May 16, 2024 13: 12 PM
Slider ఖమ్మం

ప్రభుత్వ స్కీంలా? బీఆర్ఎస్ పథకాలా

#BRS schemes

ప్రభుత్వ స్క్రీంలు బీఆర్ఎస్ పథకాలుగా మారుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికలకు ఆరు, మూడు నెలల ముందు ప్రకటించే పథకాలు మోసపూరితమని అన్నారు. ఈ పథకాలనైనా ‘గులాబీ‘ పథకాలుగా కాకుండా అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలపై విపరీతమైన భారాలను మోపుతోందని అన్నారు. కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు రాయితీలిస్తూ సామాన్యలపై భారాలు వేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబరు నెలలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నున్నా మాట్లాడారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం పథకాల అమలులో పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. 2018లో ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ వడ్డీలకే సరిపోతుందన్నారు. వడ్డీలు చెల్లించకపోతే రుణమాఫీ వర్తించదని, కొత్త రుణాలు ఇవ్వమనడంతో రైతులు ప్రైవేట్ గా అప్పుచేసి వడ్డీలు చెల్లించారన్నారు.

రెన్యువల్ అయినా కాకపోయినా కొర్రీలు పెట్టకుండా 2018 నవంబర్ 11 కు ముందు ఉన్న రుణాలన్నింటిని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 నుంచి ఆందోళనలకు పిలుపునిచ్చారు. 1 నుంచి 7 వరకు ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, సెకండ్ ఏఎన్ఎంల క్రమబద్దీకరణ, ఖాళీలకు తగినట్టుగా టీచర్ పోస్టుల భర్తీ తదితర సమస్యలపై ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.‌

200 శాతం పెరిగిన ధరలు..9 ఏళ్ల మోడీ ప్రభుత్వ కాలంలో 50 శాతంగా ఉన్న ధరల పెరుగుదల 200 శాతానికి చేరిందని నున్నా నాగేశ్వరరావు అన్నారు. కిలో కందిపప్పు రూ.90 నుంచి రూ.170కి చేరిందని, నిత్యవసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇలా అన్నింటి ధరలు పెరిగాయన్నారు.

రక్షాబంధన్ కానుక పేరుతో కేంద్రం రూ.200 గ్యాస్ ధరను తగ్గించిందని, అంతర్జాతీయంగా సహజ ముడి వనరుల ధరలు తగ్గిన దృష్ట్యా సిలిండర్ ధరను రూ. 400 తగ్గించాలని డిమాండ్ చేశారు. మోడీ హయాంలో రూ. 15లక్షల కోట్ల భారం దేశ ప్రజలపై పడిందన్నారు.

ధరల భారంతోనే ఇబ్బంది పడుతుంటే జిఎస్టి పేరుతో పన్నుల భారం వేస్తున్నారని తెలిపారు. పన్నులు, ధరల భారంతో దేశంలో పేదరికం పెరిగి 40 శాతం ప్రజానీకం పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడుతుందన్నారు. 57% మహిళలు, 67% పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు చెప్పారు. 67 ఏళ్లలో 14 మంది ప్రధానులు రూ.55.87 లక్షల కోట్ల అప్పులు చేస్తే మోడీ 9 ఏళ్లలో రూ. 100 లక్షల కోట్లు అప్పు చేసినట్లు వివరించారు.

కార్పొరేట్, పెట్టుబడుదారుల రాయితీ కోసం చేసిన అప్పుల భారం ప్రజలపై మోపుతున్నారన్నారు. పెట్టుబడిదారులకు 10% పన్ను తగ్గించి, సామాన్యులపై 18% పన్ను భారం వేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను బాహటంగానే ప్రైవేటీకరిస్తున్నట్లు మోడీ ప్రకటించడాన్ని బట్టి కార్పొరేట్ శక్తులకు ప్రధాని ఎంతలా కొమ్ము కాస్తున్నాడో అర్థం చేసుకోవాలన్నారు.‌ ఉపాధి హామీకి నిధుల కోత, సహజ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టడం, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల పై దాడులు, పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులపై దాడులు మోడీ హయాంలో అధికమయ్యాయని తెలిపారు.

ప్రజాస్వామ్యం అమలు కాని దేశాల్లో ప్రపంచంలోనే 112 వ స్థానంలో మన దేశం ఉండటం గమనార్హం అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల వివిధ అంశాలపై నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులతో దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. టీచర్ పోస్టులు పెంచాలని ఆందోళన చేసిన బీఎడ్ అభ్యర్థులపై, తమ పోస్టులను రెగ్యులరైజేషన్ చేయాలని నిరసన తెలిపిన ఆశా వర్కర్లపై ఒకేరోజు పోలీసులు అమానుషంగా వ్యవహరించడం దారుణం అన్నారు.

రాష్ట్రంలో 20వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేవలం 6,500 పోస్టులను మాత్రమే భర్తీ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.‌ ప్రభుత్వ పథకాలు బీఆర్ఎస్ స్ల్కీమ్ లుగా మారాయని ధ్వజమెత్తారు.‌ దళితబంధు పథకంలో ఒక్కొక్క ఎమ్మెల్యే రూ 3 లక్షల వరకు లంచం తీసుకున్నట్లు స్వయంగా సీఎం ప్రకటించినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.‌ గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలకు బదులుగా రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు‌‌. లాటరీ సిస్టం ద్వారా అర్హులను ఎంపిక చేయాలని కోరారు.

రూ.లక్ష బీసీ పథకానికి జిల్లాలో 26,500 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 1500 మందికి చెక్కులు పంపిణీ చేశారని తెలిపారు. ‌ మైనార్టీలు 8,000 మంది దరఖాస్తు చేస్తే కేవలం 100 మందిని మాత్రమే ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల్లోపారదర్శకత లోపిస్తుందని, అవి కేవలం బీఆర్ఎస్ పథకాలుగా మారుతున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ధరల పెరుగుదలకు నిరసనగా సెప్టెంబర్ లో ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు 2 నుంచి ప్రచారం ప్రారంభించి, 5న మండల కేంద్రాలు, 7న జిల్లా కేంద్రాల్లో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

Related posts

అధికారులకు ప్రాణ సంకటంగా మారిన ప్రభుత్వ తప్పిదాలు

Murali Krishna

మూగజీవాల దప్పిక తీరుస్తున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్

Satyam NEWS

విజయనగరం లో మినీ మహానాడు…చిత్రమాలిక.

Satyam NEWS

Leave a Comment