జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం దమ్మన్నపేట గ్రామ ఉపసర్పంచ్ పాదం వనిత, ఆమె భర్త కొమురెల్లిపై గ్రామ సర్పంచ్ భర్త మిల్కురి చంద్రయ్య శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో కొమురెల్లి కుడి చేయి విరిగింది. శుక్రవారం దమ్మన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుటే ఈ ఘటన చోటుచేసుకుంది.
ట్రాక్టర్ కొనుగోలులో సర్పంచ్ నిబంధనలు అతిక్రమించారంటూ జిల్లా పంచాయతీ అధికారి సర్పంచ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తర్వాత పంచాయతీ ట్రాక్టర్ ను యూరియా బస్తాలను పొలంలోకి తీసుకెళ్తూ సర్పంచ్ తన సొంత అవసరాలకు వినియోగించడంపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై డీపీవో విచారణకు ఆదేశించారు. శుక్రవారం విచారణ జరుగుతున్నా క్రమంలో సర్పంచ్ మిల్కురి అనసూర్య భర్త చంద్రయ్య, కొడుకు మధు, మేనల్లుడు బొలిశెట్టి నరేశ్ కలిసి మూకుమ్మడిగా ఉప సర్పంచ్ పాదం వనిత, ఆమె భర్త కొమురెల్లిపై అందరి ఎదుటే దాడి చేశారు.
ఎప్పటికైనా తనను చంపుతానని చంద్రయ్య బెదిరించాడని కొమురెల్లి ఆరోపించారు. జడ్పీటీసీ గోస్కుల జలందర్ అండతోనే సర్పంచ్ భర్త ఆగడాలు మితిమీరుతున్నాయని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.