పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా ఒక వర్గం వారు ఆందోళన చేస్తున్న ఈ తరుణంలో కేరళ కు చెందిన ఒక ఐఏఎస్ అధికారి తీవ్ర విమర్శలు చేశారు. చట్టానికి వ్యతిరేకంగా ఐఏఎస్ అధికారి విమర్శలు చేయడం ఒక రకంగా ఆశ్చర్యకరమే. అయితే కేరళ రాష్ట్ర ఎన్నికల ముఖ్య కమిషనర్ తీకారామ్ మీనా ఎవరైనా సరే ప్రజలతో పోరాడటానికి ప్రయత్నిస్తే అది జరగదని వ్యాఖ్యానించారు.
కొందరు అధికార గర్వంతో ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అలాంటి వారు ఎన్నటికి విజయం సాధించలేరని ఆయన వ్యాఖ్యానించారు. వివాదాలకు పెట్టింది పేరు అయిన తీకారామ్ మీనా గతంలో కూడా చాలా సందర్భాలలో కేంద్రంలోని అధికార బిజెపిపై నిప్పులు చెరిగారు. కేరళ బిజెపి నాయకులు తీకారామ్ మీనాపై ఎన్ని ఫిర్యాదులు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
నేడు మలప్పురంలోని ఓరియంటల్ హయ్యర్ సెకండరీ స్కూల్ పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ప్రారంభించిన తరువాత తీకారామ్ మీనా మాట్లాడారు. లౌకికత్వం ఈ దేశానికి వారసత్వం అని, దేశానికి బలమైన రాజ్యాంగం ఉందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయం దేశంలో చాలా మందికి గౌరవం ఉంటుందని మహనీయులు చేసిన త్యాగాలకు అందరం వారసులమేనని ఆయన అన్నారు. అయితే కొందరు దేశ ప్రజలతోనే యుద్ధం చేస్తున్నారని ఇది కరెక్టు కాదని ఆయన అన్నారు. అలాంటి శక్తులు ఓడిపోతాయి తప్ప దేశం ఓడిపోదని మీనా అన్నారు.