24.7 C
Hyderabad
March 26, 2025 09: 47 AM
Slider సంపాదకీయం

స్పీడు మీదున్న బండి: విఫలమైన సోము

#somuveerraju

రాయలసీమ ప్రజలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. రాయలసీమ ప్రజలు మర్డర్ లు చేసే వారు అనే విధంగా ఆయన మాట్లాడిన మాటలతో రాయలసీమకు చెందిన బిజెపి నాయకులు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.

అంతకు ముందు అధికారం లోకి వస్తే చీప్ లిక్కర్ ఇస్తామని బహిరంగంగా ప్రకటించిన సోము వీర్రాజు పలు విమర్శలు ఎదుర్కొన్నారు. తెలంగాణ లో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీని పకడ్బందిగా నడుపుతూ కాంగ్రెస్ కు దీటుగా తీర్చి దిద్దారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సోము వీర్రాజు పార్టీకి భారంగా మారారు.

సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ పెరగడం మాట అటుంచి బిజెపి సానుభూతి పరులలో కూడా ఏహ్యభావం కలిగిస్తున్నారు. దాంతో పార్టీలో తీవ్ర నిరాశ నిస్ప్రహలు నెలకొంటున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన బిజెపి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉన్న పరిస్థితుల్లో సోము వీర్రాజు వ్యవహార శైలితో బాటు నోటు దురుసుతనం మరింత చేటు తెస్తున్నది.

అధికారంలో ఉన్న వైసీపీ పై పోరాటం చేయడంలో సోము వీర్రాజు లాలూచీ వ్యవహారం నడుపుతున్నారని బిజెపి శ్రేణులే అనుమాన పడుతున్నాయి. అందవల్ల బిజెపి చేసే ఆందోళనలకు ఎలాంటి మద్దతు దొరకడం లేదు. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్ట, గుంటూరులో జిన్నా టవర్ వివాదాలు బిజెపికి ఏ మాత్రం కలిసిరాలేదు. ప్రజా ఆగ్రహ సభ పేరుతో బిజెపి నిర్వహించిన సభ పూర్తి స్థాయిలో విఫలం కావడంతో బిజెపి అంటే గౌరవం ఉన్న వారు కూడా దూరం జరిగే పరిస్థితి ఏర్పడింది.

దీనికి తోడు సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలను ఎవరూ సమర్థించడం లేదు సరికదా పూర్తి వ్యతిరేక భావనలు రేకెత్తిస్తున్నాయి. రాయలసీమ వ్యవహారంలో గత బిజెపి అధ్యక్షుల హయాంలో పార్టీకి ఒక రకమైన సానుభూతి ఉండేది. దాదాపు నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాలలో బిజెపి నిర్ణయాత్మక స్థాయి ఓట్లను సాధించే పరిస్థితి వచ్చింది. కడప జిల్లాలో బలమైన నాయకుడుగా ఉన్న ఆదినారాయణ రెడ్డి తనదైన శైలిలో పార్టీని ముందుకు తీసుకువెళుతున్నారు. కర్నూలు జిల్లాలో కూడా బిజెపిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ముందుండి నడిపిస్తున్నారు.

ఇలా ముందుకు వెళుతున్న బిజెపిపై సోము వీర్రాజు వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తెలంగాణ లో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తూ బలమైన టీఆర్ఎస్ ను సవాల్ చేస్తున్నారు. ఎక్కడి కక్కడ టీఆర్ఎస్ ను నిలువరిస్తూ ముందుకు వెళుతున్నారు. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ను దాదాపు 40 నియోజకవర్గాలలో బిజెపి దాటి ముందుకు వెళ్లే విధంగా ఆయన వ్యూహాలు రూపొందిస్తున్నారు. పార్టీని ఏకతాటిపై నడిపిస్తూ కేంద్ర కమిటీతో కూడా ఆయన సమన్వయం చేసుకుంటున్నారు. ఇలాంటి విషయాలన్నింటిలో సోము వీర్రాజు విఫలమయ్యారు.

Related posts

సంక్రాంతి దర్శనం!

Satyam NEWS

ఇద్దరు అనుమానస్పద మృతి

mamatha

నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి గిరిజనుల ఘనస్వాగతం

Satyam NEWS

Leave a Comment