26.7 C
Hyderabad
May 16, 2024 10: 03 AM
Slider నిజామాబాద్

ఉద్యమ బాట: భిక్షాటన చేయనున్న ఇండస్ట్రియల్ జోన్ బాధిత రైతులు

#farmers

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. రైతులు వర్సెస్ నాయకులు అన్న విధంగా ఉద్యమం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నెల రోజులుగా రైతులు వివిధ రకాల్లో తమ నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ముట్టడించారు. ప్రభుత్వ విప్, మాజీ మంత్రిని కలిశారు. విప్ సమయం ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

మాస్టర్ ప్లాన్ విషయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాత్ర ఉందన్న ఆరోపణలపై ఆయన నిన్న అడ్లూర్ గ్రామంలో జరిగిన రైతుల సమావేశంలో రైతుల ఉద్యమానికి తానే ముందుంటానని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. మొదటి నుంచి బీజేపీ రైతులకు మద్దతు ప్రకటిస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం రైతులకు మద్దతు పలుకుతామని స్పష్టం చేశారు. ఇక అధికార పార్టీ నుంచి మాత్రం ఇప్పటికి ఎలాంటి స్పందన రాలేదు. బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా వద్దకు ప్లకార్డులతో వెళ్లిన రైతులను పోలీసులు అరెస్ట్ చేయడంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారు. రెండు రోజుల క్రితం నిజాంసాగర్ చౌరస్తా దిగ్బంధించి రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు

మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు

మాస్టర్ ప్లాన్ లో అభ్యంతరాలు తెలపాలని అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడంతో రైతులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు చెప్పారు. జనవరి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించనుండటంతో ఇప్పటి వరకు సుమారు 1100 వరకు అభ్యంతరాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మాస్టర్ ప్లాన్ లో తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూములు తీసుకోవడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. అదే విషయాన్ని దరఖాస్తు రూపంలో రైతులు అధికారులకు విన్నవించారు.

సంతకాల సేకరణ పూర్తి

మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లలో భూములు కోల్పోతున్న సుమారు 500 మంది రైతులు లేఖలు రాసి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ లేఖలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ప్రిన్సిపాల్ సెక్రెటరీ, చీఫ్ సెక్రెటరీ, గవర్నర్, మున్సిపల్ డైరెక్టర్లకు లేఖలు పంపించారు. మరోవైపు హైకోర్టు అడ్వకేట్ ద్వారా మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు నోటీసులు పంపించనున్నారు.  మున్సిపల్ కమిషనర్ కు రేపటి లోగా, జిల్లా కలెక్టర్ కు శనివారం లోగా నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

రేపు రైతుల భిక్షాటన

నెల రోజులుగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న నిరసనకు అధికారుల నుంచి స్పందన కరువైంది. దాంతో గురువారం జిల్లా కేంద్రంలో రైతులు భిక్షాటన చేపట్టనున్నారు. భిక్షాటన కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద గల సీఎస్ఐ చర్చి నుంచి మున్సిపల్ కార్యాలయం, నిజాంసాగర్ చౌరస్తా, రైల్వేకమాన్, సుభాష్ రోడ్, గంజి రోడ్, సిరిసిల్ల రోడ్, ఇందిరా చౌక్, పాత బస్టాండ్, పంచముఖి హనుమాన్ ఆలయం, రైల్వేగేట్, అశోక్ నగర్ మీదుగా సీఎస్ఐ గ్రౌండ్ వరకు ర్యాలీగా వెళ్లి వ్యాపారులు, ప్రముఖులు, ప్రజల ద్వారా భిక్షాటన చేపట్టనున్నారు.

రైతులకు పెరుగుతున్న మద్దతు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్, 100 ఫీట్ల రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు మద్దతు పెరుగుతోంది. భూములు కోల్పోతున్న విషయాన్ని కామారెడ్డి బీజేపీ నాయకులు బయటపెట్టగా సాధారణ ప్రజలతో పాటు పలువురు నాయకులు రైతులకు మద్దతు పలుకుతున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కేటీఆర్ ను కలిసి విన్నవించానని తెలుపగా టీపీసీసీ ఐటి సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు రైతులతో సమావేశమై మద్దతు తెలిపారు.

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. తాజాగా మాస్టర్ ప్లాన్ పై ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం మాస్టర్ ప్లాన్ మొత్తాన్ని రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ కు లేఖ రాయడం జరిగిందని ఆ లేఖ కాపీని రైతులకు అందజేయడంతో పాటు రైతులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి సైతం తాను సిద్ధమని ప్రకటించారు.

ఉద్యమానికి శ్రీకారం చుడుతున్న అన్నదాతలు

తమకు అన్నం పెట్టే భూమిని కోల్పోతున్న రైతులు తమ కార్యాచరణ ప్రకటిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు కోల్పోయేది లేదని స్పష్టం చేస్తున్నారు. భూములను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా వెళ్తామని చెప్తున్నారు. భూములను కాపాడుకోవడం కోసం న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. తమతో నాయకులు కలిసి రావాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్తామని, పాతాళంలో తొక్కేస్తామని హెచ్చరిస్తున్నారు. దాంతో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం ఝటిలం కానుంది. రైతుల పోరాటం ఎటువైపు మల్లుతుందో, మాస్టర్ ప్లాన్ వివాదం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

దొంగ డబ్బు కాకపోతే 2 వేల నోట్లు సులభంగా మార్చుకోవచ్చు

Satyam NEWS

Free|Sample = Burn Stomach Fat Fast Pills Diet Pills For Weight Loss Review Herbal Diet Supplements Weight Loss

Bhavani

మెడికల్ నెగ్లిజెన్స్: పిల్లోడి పట్ల నీలోఫర్ వైద్యుల నిర్లక్ష్యం

Satyam NEWS

Leave a Comment