సూర్యుడు ధనూ రాశి నుంచి మకరంలోకి వెళుతున్న ఈ కాలం అతి పవిత్రమైనది. దక్షిణాయనం వెళ్లిపోయి నేటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. ఉత్తరాయణ పుణ్య కాలం ముక్తిని పొందడానికి వీలైన కాలం. సంక్రాంతి పండుగ సూర్యుడి గమనంపై ఆధారపడి వచ్చే పండుగ కాబట్టి ఈ మకర సంక్రమణం ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అనే అంశం ఆసక్తి కలిగిస్తుంది.
సత్యం న్యూస్ తో మాట్లాడుతూ పవిత్ర తిరుపతి క్షేత్రంలో ఉన్న ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త రాష్ట్ర నంది అవార్డు గ్రహీత చక్రధర్ సిద్ధాంతి ఈ ఆసక్తికి తగిన సమాధానాలను ఇచ్చారు. ప్రతి ఏటా సంక్రాంతి పురుషుడు సమస్త జీవరాసులలో ఒకదాన్ని వాహనంగా చేసుకుని వస్తుంటాడని చక్రధర్ సిద్ధాంతి వివరించారు.
ఈ ఏడాది సంక్రాంతి పురుషుడు గార్దభ (గాడిద) వాహనంపై వస్తున్నందున విపరీతమైన పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సారి వచ్చే వేసవి కాలం అత్యంత తీవ్రంగా ఉంటుందని, సూర్యుడి తీక్షణత కారణంగా విపరీతమైన జననష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అంచనా వేశారు. లక్షలాది మంది సూర్యుడి తీవ్రత కారణంగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
సమాజంలోని అన్ని వర్గాల వారిలో పలురకాల రుగ్మతలు పెరుగుతాయని ఆయన అన్నారు. విపరీతమైన జంతు నష్టం కూడా గోచరిస్తున్నదని ఆయన అంచనా వేశారు. రేపు సరిగ్గా ఉదయం 7.38కి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడని ఆయన తెలిపారు. జనవరి 24న శని ప్రభావం కూడా తోడు కాబోతున్నదని చక్రధర్ సిద్ధాంతి తెలిపారు. మకర రాశిలో సూర్యుడు, బుధుడితో బాటు శని కలవడం వల్ల, సూర్యుడి పుత్రుడైన శనికి తన తండ్రితో ఉన్న విభేదాల కారణంగా కాలాన్ని వక్రీకరిస్తాడని దీనివల్ల మరిన్ని విపరీత పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఈ నెలాఖరు నుంచి రాబోయే రెండున్నర నెలల కాలంలో పెను ఉపద్రవాలు జరిగే అవకాశం ఉందని చక్రధర్ సిద్ధాంతి తెలిపారు. ప్రపంచంలో చాలా చోట్ల యుద్ధ వాతావరణ కనిపిస్తుందని భయానక పరిస్థితులు తలెత్తుతాయని చక్రధర్ సిద్ధాంతి అంచనావేస్తున్నారు. దేశంలో అనేక రకాలైన ఊహించని సమస్యలు తలెత్తబోతున్నాయని ఆయన అన్నారు.
మనుషుల మధ్య వైరం పెరిగిపోయి దారుణ సంఘటనలు జరుగుతాయని ఆయన తెలిపారు. కొడుకులు తండ్రి మాట వినని పరిస్థితి తలెత్తుతుందని ఆయన అన్నారు. తండ్రిని జైలుకు పంపి అయినా సరే కుటుంబం, ఆస్తి, అధికారం, ఇతర సంపదలు కైవసం చేసుకొందామనే కొడుకులు తయారవుతారని చక్రధర్ సిద్ధాంతి అన్నారు.
వీలైనంత వరకూ ఇష్ట దేవతలను ఆరాధించడం ఒక్కటే పరిష్కారమార్గమని ఆయన సూచించారు. యజ్ఞ యాగాదులు చేసిన రాష్ట్రాలు, దేశాలు ఈ అరిష్టాల నుంచి తప్పించుకునే అవకాశం ఏర్పడుతుందని చక్రధర్ సిద్ధాంతి అన్నారు.