29.7 C
Hyderabad
May 7, 2024 04: 39 AM
Slider ప్రత్యేకం

కొత్త సమీకరణాల్లో అస్థిత్వం కోల్పోయిన బిజెపి

#somuveerraju

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ కోయిలలు తొందరపడి ముందుగానే కూస్తున్నాయి. శాసనసభ ఎన్నికలకు రెండు సంవత్సరాల పైగా సమయం ఉన్నా…ఇప్పటినుంచే రాజకీయ సమీకరణల కోసం అధికార వై ఎస్ ఆర్ సీ పీ మినహా మిగతా రాజకీయపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి. దేశవ్యాప్తంగా జమీలి ఎన్నికలకు కేంద్రం లోని  ఎన్డీయే ప్రభుత్వం  మొగ్గు చూపుతోంది. 2024 ఎన్నికల లో కూడా పరిపూర్ణ మెజారిటీ దక్కించుకొని హాట్రిక్ సాధించడానికి బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీ జే పీ శ్రేణులకు సాక్షాత్తూ అమిత్ షా దిశా నిర్దేశం చేయడంగా గుర్తించాలి.

ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే.. జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి రాష్ట్ర బీజేపీ నాయకత్వం దూకుడుగా వ్యవహరించిన దాఖలాలు నామమాత్రం. మాజీ  బీజే పీ   అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడేవారు.అయితే  ప్రస్తుత రాష్ట్ర భాజపా అధ్యక్షుడు  సోము వీర్రాజు  అధినాయకత్వం ఆశించిన స్థా యిలో అధికార పార్టీ ని ఎండగట్టడం లేదని విమర్శలను ఎదుర్కొంటున్నారు.

నిశితంగా పరిశీలిస్తే …దేశంలో భాజపాకు ఏ రాష్ట్రంలోనూ లేని విచిత్ర పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొని ఉంది.రాష్ట్రంలో భాజపా జగన్ అనుకూల, ప్రతికూల వర్గాలుగా చీలినట్లు రాజకీయ విశ్లేషకుల భావన. స్వతహాగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన భాజపా శ్రేణులు… అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీనుంచి వలసవచ్చిన నేతలతో కలగా పులగమై అస్తిత్వాన్ని కోల్పోయినట్లు  వారు వ్యాఖ్యానిస్తున్నారు.

అటూ ఇటూ లాగుతున్న నాయకులు

జగన్ ప్రభుత్వాన్ని పూర్తిగా సమర్ధించడం లేదా పూర్తిగా వ్యతిరేకించడం అనే విషయంలో రాష్ట్ర నాయకుల లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. తెలుగుదేశం నుంచి వలసవచ్చి భాజపా లో చేరిన సుజనాచౌదరి , సీ. ఎం. రమేష్ వంటి వారు వై ఎస్ ఆర్ సీ పీ తో పూర్తి శత్రువైఖరితో ఉన్నారు. రాష్ట్ర   భాజపా నాయకత్వం అధికార పక్షంపై దూకుడుగా వ్యవహరించడం లేదని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. భాజపా లో ఉన్న తెలుగుదేశం కోవర్ట్ లుగా వీరిని వై ఎస్ ఆర్ సీ పీ ముద్ర వేసింది.

ఈ నేపథ్యంలో…తాజాగా తిరుపతిలో జరిగిన అమరావతి ప్రాంత రైతుల సభను వై ఎస్ ఆర్ సీ పీ వ్యతిరేకుల సమైక్య వేదికగా కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. సిద్ధాంతాలతో సంబంధం లేకుండా తెదేపా, భాజపా, కాంగ్రెస్, జనసేన, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకే వేదిక పంచుకోవడం ఆసక్తికరం. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు… తెదేపా జన సేన మైత్రి వల్ల భాజపా కు లాభం కానీ నష్టం కానీ ఏమీ లేదు. రాష్ట్రంలో భాజపా బలం పుంజుకోవడానికి వై ఎస్ ఆర్ సీ పీ ని దెబ్బకొట్టడం అంటే చాప కింద నీరులా వెళ్ళాలని ఆ పార్టీ అధినేత కు బాగా తెలుసు.

అమరావతి వ్యవహారంలో రాష్ట్ర భాజపా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని తటస్థ మీడియా భావన. రాయలసీమలో హై కోర్టు విషయం సమ్మటమని గతంలో నమ్మబలికి ఇప్పుడు జగన్ ప్రభుత్వం తలపెట్టిన వికేంద్రీకరణ ను వ్యతిరేకిస్తే తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉందని వారు భాజపా ను హెచ్చరిస్తున్నారు.

రానున్న కాలంలో భాజపా వేయనున్న  ఎత్తుగడల పై ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రశ్నే లేదని పార్లమెంట్ సాక్షిగా ఎన్ డీ ఏ ప్రకటించడం కొసమెరుపు.

పొలమరశెట్టి రమాకృష్ణారావు

Related posts

షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక దారుణ హత్య

Satyam NEWS

Good News: అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు

Satyam NEWS

చంద్రబాబును వదిలేస్తున్న కమ్మ కులస్తులు

Satyam NEWS

Leave a Comment