27.7 C
Hyderabad
May 16, 2024 05: 23 AM
Slider శ్రీకాకుళం

భ‌వ‌న‌, సంక్షేమ నిధి అమ‌లుపై సిఐటీయూ 17న మంత్రుల ఇళ్ల ముట్ట‌డి

Labours Demends

భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు పథకాలు అమలు చేయాలని, సంక్షేమ నిధి రక్షణ కోసం నవంబర్ 17న మంత్రుల ఇళ్ళు ముట్టడి జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక, ప్రధాన కార్యదర్శులు తంగి. హరినారాయణ‌, ఎం.హరనాధ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నవంబర్ 26 అఖిల భారత సమ్మెలో భవన నిర్మాణ కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో సమ్మె పోస్టర్లు ఆవిష్కరించారు.

భ‌వ‌న నిర్మాణ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ పిలుపు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయని అన్నారు.

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు కొనసాగింపు, సంక్షేమ నిధిని కాపాడాలనే డిమాండ్లతో నవంబర్ 17న మంత్రుల ఇళ్ళు ముట్టడించాలని రాష్ట్ర భవననిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి పిలుపునిచ్చిందని అన్నారు. నవంబర్ 17, నవంబర్ 26 పిలుపులలో భవన నిర్మాణ కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కార్మిక వ్య‌తిరేక విధానాల‌కు కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వాలే కార‌ణం

కరోనాకు ముందు కాలంలోను, కరోనా వచ్చిన తరువాత భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన కార్మిక వ్యతిరేక విధానాలు భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోవటానికి కారణమయ్యాయని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజెపి ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు, జిఎస్ టి విదానాలు అమలు చేసి ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించటంతో అప్పుడు భవన నిర్మాణ కార్మికులు చాలా కాలం పనులు కోల్పోయారని అన్నారు.

టీడీపీ, వైసీపీ వాడేసుకున్నాయి!

బీజెపి ప్రభుత్వం ఇటీవల కార్మిక చట్టాలలో కార్మిక వ్యతిరేక మార్పులు చేసిందని, బిల్డింగ్ కార్మికుల పని పరిస్థితులు, వెల్ఫేర్ చట్టాలను కూడా రద్దు చేసి కొత్త కోడ్ లో కలిపేసిందిని అన్నారు. కార్మిక సంఘాలు పోరాడినందువలన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి ప్రత్యేకంగా కొనసాగుతున్నదని, కానీ ఆ నిధిని రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాల కోసం వాడేసుకోకుండా తగిన ఏర్పాట్లు కొత్త చట్టంలో చేయలేదని విమర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పటి వైసిపి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని తమ పేర్లతో పెట్టిన పథకాలు అమలు కోసం చట్ట వ్యతిరేకంగా వాడేసుకున్నాయని విమర్శించారు.

డ‌బ్బులు లేవ‌ని రూ. 450 కోట్లు తీసుకుంటారా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథ‌కాలను ఆపేసి ప్రమాదాలలో మరణించిన కార్మికులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం కూడా రాకుండా చేశారని విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చింది మొదలు ఇసుక సమస్య కొనసాగుతున్నదని, ఇసుక సమస్య వలన నిర్మాణాలకు అవసరమైన ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులకు పని తగ్గిందని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నిరుద్యోభృతిగా రూ10,000/-లు ఇవ్వాలని భవన నిర్మాణ కార్మికులు ఎంత పోరాడినా డబ్బులు లేవని అబద్దాలు చెప్పిన వైసిపీ ప్రభుత్వం నిధులు మిగిలి ఉన్నాయనే పేరుతో 450 కోట్లను తీసుకున్నదని విమర్శించారు.

న‌వంబ‌ర్ 26న దేశ‌వ్యాప్త స‌మ్మె

ఈ అన్యాయాన్ని ప్రతిఘటించకపోతే భవన కార్మికులు ఏకైక చట్టంగా ఉన్న సంక్షేమ చట్టాన్ని కాపాడుకోలేమని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులు సంవత్సరాలు తరబడి పోరాడి సాధిచుకున్న హక్కులపై దాడిచేసిందని, 29 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా మార్చిందని విమర్శించారు. పనిలో పనిగా సమ్మె హక్కును ఆచరణలో అసాధ‌ చేసిందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలన్ని ప్రైవేటీకరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విదానాలు వ్యతిరేకిస్తూ నవంబర్ 17న మంత్రుల ఇళ్ళు ముట్టడి , నవంబర్ 26 దేశ వ్యాప్త సమ్మెలో భవననిర్మాణ కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

వెల్ఫేర్ బోర్డు నిధులు తిరిగిచ్చేయాలి!

రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా గతంలో వలే సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిధులను తిరిగి ఇచ్చేయాలని, కరోనా కాలంలో పనికోల్పోయిన కార్మికులకు రూ:10,000/- జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు ఇవ్వాలని, కార్మిక వ్యతిరేక కోట్లు, రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విరమించాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు యం.ఆదినారాయణమూర్తి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు అనుపోజు. కామేశ్వరరావు, పైడి.రాజారావు, సూర. అప్పారావు, ఉప్పాడ. సత్యం, చిట్టి. రాజు, గంగు. రమణ, అలపాన. అమ్మన్న, కుంచాల. అప్పన్న, హేమంత్ కుమార్ పాణిగ్రాహి, అల్లు. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రియల్ ఎస్టేట్ వ్యాపారిలా చంద్రబాబు

Satyam NEWS

పేదల కడుపు కొడుతున్న తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

ట్రాజెడీ: అదృశ్యమై అడవిలో శవంలా కనిపించిన సంజన

Satyam NEWS

Leave a Comment