చిన్నప్పటి నుంచి ఆమెకు సినిమాలంటే పిచ్చి. ఏదో ఒక రూపంలో సినిమా రంగంతో తన జీవితాన్ని మమేకం చేసుకోవాలన్నది తన ప్రగాఢ. వాంఛ. ఒకవైపు లెక్చరర్లు చెప్పే పాఠాలు తలకెక్కించుకుంటూనే… మరోవైపు తను తీయబోయే షార్ట్ ఫిలిమ్స్ కోసం షార్ప్ గా ఆలోచిస్తూ… మెదడులోని రెండు భాగాలను రెండు రంగాలకు కేటాయించి… రెంటికీ న్యాయం చేసిన ఘనత తనది. “కర్మమా, ఇట్స్ ఇనఫ్, చెలియా ఒక బహుమతి, ఫేస్ బుక్ ఫెయిల్యూర్, లాంగ్ లి(లీ)వ్” వంటి షార్ట్ ఫిల్మ్స్ స్వయంగా రాసి, డైరెక్ట్ చేయడంతోపాటు కొన్నిటిలో నటించి మెప్పించిన ఆ “ఆల్ రౌండర్” పేరు “రితీష రెడ్డి”.
“ముదితల్ నేర్వగలేని విద్యలు గలవే ముద్దార నేర్పించినన్” అన్నట్లుగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంచలంచెలుగా తన లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ… తన జీవిత భాగస్వామి సహకారంతో సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించడం కోసం అహరహం శ్రమిస్తోంది రితీష రెడ్డి.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాణంలో సుప్రసిద్ధ సింగర్ సునీత తనయుడు ఆకాష్ అరంగేట్రం చేస్తూ గంగనమోని శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన “సర్కారు నౌకరి” చిత్రానికి వస్త్ర సొబగులు (కాస్ట్యూమ్ డిజైనింగ్) అద్దిన రితీష… ఈ చిత్ర రూప కల్పన సమయంలో దర్శకేంద్రుడి ప్రశంసలు దండిగా అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతోంది.
“సర్కార్ నౌకరి” ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ గా వ్యవహరించిన వి.ఎన్. ఆదిత్య గారు… నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్ కొన్ని చూసి, చాలా ఇంప్రెస్ అయ్యి రాఘవేంద్రరావు గారికి చెప్పడం, ఆయన కూడా ఒకటి రెండు చూసి నన్ను మెచ్చుకోవడమే కాకుండా… నాకు “డైరెక్షన్ ఛాన్స్” ఇస్తానని మా టీమ్ మీటింగ్ లో చెప్పడం ఇప్పటికీ నమ్మశక్యం కాకుండా ఉందని చెబుతున్న రితీష… తను బేసిక్ గా రైటర్ కావడం, యాక్టింగ్ తోపాటు డైరెక్షన్ లోనూ ప్రవేశం ఉండడం కాస్ట్యూమ్ డిజైనర్ గా రాణించేందుకు తనకు కలిసి వస్తున్నాయని అంటోంది.
సంపూర్ణేష్ బాబు “బజార్ రౌడీ” హీరోయిన్ మహేశ్వరికి కాస్ట్యూమ్స్ చేయడంతో మొదలైన రితీష సినీ ప్రయాణం… కొన్ని సినిమాల్లో పాటలకు, పలువురు బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ కు పని చేసే అవకాశం దక్కించుకోవడం మీదుగా “పంచతంత్ర కథలు” చిత్రానికి పూర్తి స్థాయి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎదిగేలా చేసింది.
“ఆయా పాత్రల వస్త్రాలంకరణ… పాత్రల స్వభావాలు, అప్పటి వాళ్ళ మనఃస్థితితోపాటు… సన్నివేశానికి తగినట్లుగా ఉండాలి. అందుకోసం చాలా కష్టపడాలి” అంటున్న రితీష… ఇద్దరు చంటి బిడ్డల తల్లిగానే కాకుండా… హైద్రాబాద్ సుచిత్ర సర్కిల్ లో గల “రితీష రెడ్డి లేబుల్” బొటిక్ సమర్ధవంతంగా నిర్వహిస్తూ… సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా “త్రిపాత్రాభినయం” చేస్తూ ముందుకు సాగుతోంది.
అంతేకాదు, పలువురు సెలబ్రిటీస్ కి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ చేస్తూనే… ఎన్ టివి గ్రూప్ వనిత టివి “స్టార్ వనిత” ప్రోగ్రామ్ కు “స్టైలిస్ట్ అండ్ కో-ఆర్డినేటర్” గానూ పని చేస్తూ ప్రశంసలందుకుంటున్న బహుముఖ ప్రతిభాశాలి – ఇంజినీరింగ్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ పట్టభద్రురాలు అయిన రితీష రెడ్డి… అతి త్వరలోనే మెగా ఫోన్ పట్టడం, డైరెక్టర్ గానూ సూపర్ హిట్టవ్వడం ఖాయమని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.