ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం అసంతృప్తితో ఉన్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆయన ను పక్కన పెట్టే విధంగా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రవర్తిస్తున్న తీరుతో ఆయన విసిగిపోయినట్లుగా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకుంటున్న అభ్యంతరకర నిర్ణయాలకు కొందరు ఐఏఎస్ అధికారులు పూర్తి మద్దతు ప్రకటిస్తుండటం, చీఫ్ సెక్రటరీకి తెలియకుండానే జీవోలు విడుదల అవుతుండటం తో ఎల్ వి సుబ్రహ్మణ్యం పాలనా సంబంధిత విషయాలలో అంటిముట్టనట్లుగా ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా చీఫ్ సెక్రటరీ ద్వారానే జీవోలు విడుదల అవుతాయి.
ప్రభుత్వ ఆదేశాలు (జీవో )విడుదల కావాలంటే దానికి సంబంధించిన విధివిధానాలన్నీ చీఫ్ సెక్రటరీ కంట్రోల్ లో ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్త నిబంధనలు వస్తున్నాయి. సాధారణ పరిపాలన కార్యదర్శి చొరవతో జీవోలు విడుదల అవుతున్నాయి. ఈ మేరకు బిజినెస్ రూల్స్ ను సవరిస్తూ అక్టోబర్ 25న జీవో ఎంఎస్ నెం 128 ను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి జారీ చేశారు. సవరించిన ఈ బిజినెస్ రూల్స్ ప్రకారం ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు సత్వరమే అమలు చేయడానికి వీలుగా ఏ శాఖ కార్యదర్శి ఆ శాఖ కు సంబంధించిన జీవోలు విడుదల చేసుకోవచ్చు.
ఇలా తాజాగా నవంబర్ 1వ తేదీ న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాలని నిర్ణయించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో విడుదల చేయాల్సి ఉండగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా ఆదేశాలు వెళ్లి ఇవో లెటర్ వచ్చేసి చీఫ్ సెక్రటరీకి కాపీ వెళ్లింది. ప్రభుత్వ పెద్ద అయిన చీఫ్ సెక్రటరీ తన కింద పని చేసేవారి నుంచి నోట్ లు అందుకోవడం అంటే అది పరిపాలన అనిపించుకోదు. అలాంటి పనులు ఏపిలో జరుగుతుండటంతో ఎల్ వి సుబ్రహ్మణ్యం పరిపాలనలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా కాలం గడుపుతున్నారు.
ముఖ్యమంత్రి కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మధ్య అంతరం పెరగడం మంచి విషయం కాదు. అయితే కొందరు ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి ప్రాపకం కోసం ఎల్ వి సుబ్రహ్మణ్యంపై లేనిపోనివి కల్పించి చెప్పడం వల్లే ఇలా జరిగిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎల్ వి సుబ్రహ్మణ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పని చేశారు. అప్పటిలో ఆయన తీసుకున్న సంస్కరణలకు కొందరు కులం రంగు పులిమారు.
ఆ సంస్కరణలలో ఉద్యోగాలు కోల్పోయిన కొందరు తమను కులం పేరుతోనే ఇవో తీసేశారని ధర్నాలు చేశారు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాలు పరిపాలనా పరమైనవి కావడంతో ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఈ సందర్భంలోనే కొన్ని దళిత సంఘాలు తిరుమలలో ధర్నాలు చేశాయి. ఆ విషయాలన్నీ సిఎం జగన్ కు క్రమం తప్పకుండా చెబుతూ ఎల్ వి సుబ్రహ్మణ్యం తో దూరం పెంచడంలో సిఎం కార్యాలయంలో ఉన్న కొందరు దళిత అధికారులు కృతకృత్యం అయ్యారని అంటున్నారు. అందుకే సిఎం జగన్ చీఫ్ సెక్రటరీని దూరం పెట్టే చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ పాలనపైనే తీవ్ర ప్రభావం చూపించే నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా అంటున్నారు.