33.2 C
Hyderabad
May 4, 2024 01: 45 AM
Slider ప్రత్యేకం

‘‘సై’’: ప్రత్యక్ష పోరాటం దిశగా కదులుతున్న రాజ్ భవన్?

#tamilsai

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళి సై సీఎం కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా ఒకింత కటువుగా సమాధానం ఇచ్చిన తీరు పలు సందేహాలకు తావిచ్చింది. గవర్నర్ పదవికి, రాజ్ భవన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని డా.తమిళి సై తీవ్ర స్వరంతో ఆరోపించారు. రాష్ట్రంలో వైద్య, విద్యా వ్యవస్థలు దారుణంగా ఉన్నాయని ఆమె విమర్శించారు. కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ ఆసుపత్రులు దయనీయంగా ఉన్నాయని గవర్నర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

యూనివర్సిటీలు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయక పోవడంతో విద్యా ప్రమాణాలు పడిపోతున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. హాస్టల్స్ లో స్టూడెంట్స్ కు ఇవ్వాల్సిన ఆహారం విషయంలో నిర్లక్ష్యం పేరుకుపోయిందని గవర్నర్ గతంలో కూడా చాలా సార్లు ప్రభుత్వాన్ని విమర్శించారు. తొలుత తన ప్రసంగంలో.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తానని ఆమె తెలిపారు. ఇక్కడి ప్రజల గౌరవాభిమానాలు పొందడం తన అదృష్టం అని ఆమె అన్నారు. రాష్ట్ర గవర్నర్ కు భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలకు అనుగుణంగానే తాను బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు అన్నారు.

తెరాస ప్రభుత్వం గవర్నర్ విషయంలో నిబంధనల ప్రకారం పాటించాల్సిన ప్రోటోకాల్స్ ను తుంగలో తొక్కి న సందర్భాలను ఆమె ప్రస్తావించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు, సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళిన సందర్భంలో సాధారణంగా గవర్నర్ కు కల్పించాల్సిన రక్షణ, గౌరవ మర్యాదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఆమె ఎత్తి చూపారు. రాజ్యాగబద్ధంగా నియమించబడిన గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎందుకు ప్రవర్తించాలి అని ఆమె ఉచ్ఛ స్వరంతో ప్రశ్నించారు. రాజ్ భవన్ మితిమీరిన జోక్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటం పెడుతోంది అనే విమర్శకు తమిళి సై దీటుగా స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయం ప్రజలు తెలుసుకోవాలన్నది తన అభిమతం అని అన్నారు.

విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్తూ.. తాను రాజకీయాలు చేయడం లేదని, గవర్నర్ పదవి చేపట్టే వారికి రాజకీయ నేపథ్యం ఉండడం తప్పేమీ కాదని ఆమె స్పష్టం చేశారు. ఇలా.. చాలా అంశాల చుట్టూ మీడియా సమావేశం తిరిగింది.

ఏ విషయంలోనైనా పట్టు విడుపు అవసరం అని అంటారు. కానీ ఇటు ప్రభుత్వం, అటు గవర్నర్ ఎక్కడా తగ్గేది లేదన్నట్లు మొండిగా వ్యవహరించడం పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది. పూర్వ గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ తరువాత తెలంగాణకు తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకురాలు డా. త మిళి సై నియామకంపై అప్పట్లోనే చాలా సందేహాలు రాజకీయ వర్గాలలో, మరీ ముఖ్యంగా తెరాస లో గుబులు పుట్టించాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే దురుద్దేశంతోనే ఆమెకు రాజ్యాంగ పదవి కట్ట బెట్టారని తెరాస మండి పడింది.

గవర్నర్ పదవి స్వీకరించిన కొద్ది కాలం రాష్ట్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరపిన ఆమె నెమ్మదిగా పావులు కదపడం ప్రారంభించారు. అందులో భాగమే.. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, రాష్ట్రంలో గిరిజనుల స్థితి గతుల విషయంలో ప్రభుత్వ అలసత్వాన్ని వేలెత్తి చూపడం, ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి లేఖలు రాయడం వంటివి. గవర్నర్ ఇలా తన వ్యవహార శైలి మార్చుకోవడానికి ముఖ్య మంత్రి కేసీఆర్ వైఖరి కూడా ఒక కారణం అని విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మెల్సీ పదవికి

తెరాస అభ్యర్థి కౌశిక్ ని ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి భావిస్తే..దానికి ఆమోదం తెలుపకుండా  అడ్డుపడడం ఇద్దరి మధ్య దూరం పెంచింది. గవర్నర్ కోటాలో సేవా కేటగిరీ విభాగంలో కౌశిక్ ను కౌన్సిల్ కి పంపించడం నిబంధనలకు విరుద్ధమని రాజ్ భవన్ వర్గాలు స్పష్టం చేయడంతో రెండు ప్రధాన వ్యవస్థల మధ్య వైరం మరింత ముదిరింది. ఇలాగే.. మరి కొన్ని సందర్భాలు భేదాభిప్రాయాలకు ఆజ్యం పోశాయి.

కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశగా చర్యలు  తీసుకొని కారణంగా సాధారణ ప్రజలు, వలస కూలీలు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇబ్బందులకు గురయ్యారని  గవర్నర్ పలుసార్లు మీడియా ముందు చెప్పారు. కాలం గడిచేకొద్దీ రాజ్ భవన్, ప్రభుత్వం ఏమాత్రం సంయమనం, సమన్వయం లేకుండా చెరో దారిలో ప్రయాణించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు. జాతీయ పతాక ఆవిష్కరణ విషయంలో మరింత బయట పడిన విభేదాలు,  ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం లేకుండానే సభా కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలు ఒక అనారోగ్య దృశ్యాన్ని ఆవిష్కరించాయి.

ఇటువంటి నేపథ్యంలో.. గవర్నర్ అధికారాలు, విధులు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. గవర్నర్ రాజకీయాలు మాట్లాడడం తగదని, రాజ్ భవన్ ను రాజకీయాలకు కేంద్రంగా మార్చడం వల్ల ఆ పదవికి ఉన్న పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు భంగపడగలవని తెరాస వర్గాలు బహిరంగ విమర్శలు చేశాయి. గవర్నర్ పదవిలో ఉండి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్రంతో కయ్యానికి కాలు దువ్వడం రాజ్యాంగ విరుద్ధం కాదా అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇక తాజా విషయానికి వస్తే.. కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడు పెంచాలని కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆదేశించడంతో డా.తమిళి సై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక దశలో .. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం తప్పదని గవర్నర్ అన్నారు. అలాగే.. తెరాస లో షిండేలు ఉన్నారని, అవసరమైన సమయంలో వాళ్ళు బైటకి వచ్చి ప్రభుత్వాన్ని కూలగొడతారని రాష్ట్ర బీజేపీ నేతలు అధికార తెరాసను హెచ్చరించడం గమనార్హం.

ఈ పర్యవసానాలకు ప్రధాన కారణం..తెరాస అధినేత కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీ కి వ్యతిరేకంగా ఎన్డీఏ యేతర రాజకీయ పార్టీలను ఒక తాటిపైకి తేవాలని చేస్తున్న ప్రయత్నం అని విశ్లేషకులు అంటున్నారు.  మోదీని, మోదీ ప్రభుత్వాన్ని నేరుగా దూషించడం బీజేపీ అధిష్టానం దృష్టిలో ఘోరమైన నేరంగా కనిపిస్తోంది. అందుకే..ఏదో ఒక కార్యక్రమం పేరుతో కేంద్ర మంత్రులు, బిజెపి పెద్దలు తెలంగాణ రాష్ట్రంలో తరచుగా పర్యటిస్తూ ప్రజలలో కేసీఆర్ వ్యతిరేక భావనలను రేకెత్తిస్తున్నారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన ఇక ముందు సాగదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందుగానే రాష్ట్ర రాజకీయాలలో వేడి పుట్టిస్తున్న రాజకీయ పక్షాలు ఎవరి దారిలో వారు లబ్ది పొందాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

రెండు ప్రధాన జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ.. తెరాస వంటి ఒక ప్రాంతీయపార్టీపై కక్ష గట్టి ఎన్నికలలో గెలవడానికి చేయని ప్రయత్నం లేదు. ఇదంతా పైకి కనిపించే రాజకీయ సమరం. కానీ.. రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ తో అధికార తెరాస పై సై అంటే సై అనేలా కాలు దువ్వించడం ఎటువంటి రాజనీతి అనేది విజ్ఞులు సెలవివ్వాలి.

ప్రజాస్వామ్య ప్రియులు ఏ మాత్రం మెచ్చని మూడు ముక్కలాటను ప్రస్తుతం తెలంగాణ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. రాజకీయులూ తస్మాత్ జాగ్రత్త!

పొలమరశెట్టి కృష్ణారావు, సామాజిక రాజకీయ విశ్లేషకుడు

Related posts

వనపర్తి ప్రజలపై మునిసిపాలిటీ యూజర్ చార్జీల పిడుగు

Satyam NEWS

కేసీఆర్ పోటీతో కామారెడ్డికి మహర్దశ

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం నుంచీ విదేశాల వ‌ర‌కు ఖండాల్లో తెలుగు ఖ్యాతిని చాటిన మ‌హిళ‌…!

Satyam NEWS

Leave a Comment