28.7 C
Hyderabad
May 5, 2024 07: 42 AM
Slider అనంతపురం

సైకిల్ ఎక్కనున్న సాకే శైలజనాథ్?

#Sailajnath

కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడుగా పనిచేసిన, మాజీ పిసిసి అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో, శైలజనాథ్ ఈ మధ్యకాలంలో భేటీ అయినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మార్చి నెలలో ఆయన పార్టీలో చేరిక కార్యక్రమం లాంఛనంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో ఆయన నేరుగా మాట్లాడే చొరవ, సన్నిహితం ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడుతో సమావేశం లో పాల్గొన్నారు. అయితే పిసిసి అధ్యక్షుడు హోదాలో ఆయన బాబుతో పలుమార్లు భేటీ అయ్యారు. ప్రస్తుతం పిసిసి అధ్యక్ష స్థానంలో రుద్రరాజుకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. చాలాకాలంగా శైలజనాథ్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది.

ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు ఇదే స్థాయిలో ఒత్తిడి పెంచారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష హోదాలో కొనసాగారు. ప్రస్తుతం ఎటువంటి రాజకీయ బరువు బాధ్యతలు లేకపోవడంతో కొంతకాలం విరామం పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వాస్తవంగా శ్రేయోభిలాషులు సన్నిహితులతో తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ పై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సింగనమల నియోజకవర్గం లోని నార్పల బుక్కరాయసముద్రం గార్లదిన్నె సింగనమల ఎల్లనూరు పుట్లూరు మండలాల్లో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో అక్కడి కార్యకర్తలు నాయకులు నుంచి అభిప్రాయాల సేకరణ కొనసాగుతోంది. ఫిబ్రవరి మాసంతానికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు నాయుడుతో భేటీతోపాటు తెలుగుదేశం పార్టీలోకి ఆయన చేరిక గురించి ఒక కీలకమైన మీడియా సంస్థ యజమాని సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శైలజనాథ్ లాంటివారు తెలుగుదేశం పార్టీలో ఉండడం వల్ల పార్టీకి మరింత బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. వైద్యుడిగా, వామపక్ష విద్యార్థి నేతగా సమకాలీన రాజకీయాలపై మంచి అనుభవం ఉంది. వక్తగా కూడా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సైలజనాథ్ ఒక ఆయుధంగా మారనున్నారు.

సింగనమలలో లోటు పూర్తి

డాక్టర్ సాకే శైలజనాథ్ సింగనమల నియోజకవర్గంలో ఉన్న లోటును తెలుగుదేశం పార్టీలో భర్తీ చేరున్నారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఉన్న ఈ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు మధ్య గ్రూపు గొడవలు ఉన్నాయి. పైగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆలం నరస నాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి లతో రాష్ట్ర పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. నియోజకవర్గంలో ఈ కమిటీ పార్టీ వ్యవహారాలను నిర్వహిస్తోంది. అయితే బలమైన నాయకుడుగా ఉన్న శైలజనాథ్ రాక వల్ల సింగనమల నియోజకవర్గ రూపురేకులు తెలుగుదేశం పార్టీలో మారిపోయే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు.

గతంలో సింగనమల నుంచి ఇన్చార్జిగా కొనసాగిన మాజీ మంత్రి సమంతకమని, మాజీ విప్ యామిని బాల కుటుంబం వైయస్ఆర్సీపీలోకి చేరిపోయింది. దీంతో అక్కడ గ్యాప్ కొనసాగుతుంది. బండారు శ్రావణి కి పార్టీ టికెట్ ఇచ్చి అవకాశం కల్పించినప్పటికీ, ఆమె గట్టిగా పని చేయకపోవడం వల్ల పార్టీ మరొకరికి బాధ్యతలను అప్పగించాల్సి వచ్చిందని, ఆ నియోజకవర్గ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బలమైన నాయకుడుగా గుర్తింపు పొందిన శైలజనాథ్ రాకవల్ల తెలుగుదేశంకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మరో నేత పేర్కొన్నారు.

మోసం చేసిన అధిష్టానం

సింగనమల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ సాకే శైలజనాథ్ మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా పదవులు నిర్వహించారు. పార్టీ కష్టకాలంలో ఆయన రాహుల్ గాంధీ వెంట నడిచారు. రాహుల్ చేపట్టిన భారత్ జూడో యాత్ర మొదలుకొని, అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధితులు చేపట్టిన తర్వాత అక్కడ సామాజిక పోరు కొనసాగింది. ఖర్గే సామాజిక వర్గానికి చెందిన వారికే రాష్ట్రంలో అత్యధిక పదవులను కట్టబెట్టారు. పీసీసీ అధ్యక్షులు మొదలుకొని ఇతర కీలకమైన పదవులన్నీ ఆయన వర్గానికి దక్కాయి. కనీసం పిసిసి అధ్యక్షుడిగా తనను తప్పిస్తున్నట్లు జాతీయ అధ్యక్షుడు ఎటువంటి సమాచారాన్ని శైలజనాథ్ అందుకోలేదు. కనీసం మార్పు గురించి సమాచారం అందించలేదు.

ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని శైలజ నాథ్ ను పార్టీ నుంచి తప్పించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయం కనీసం రాహుల్ గాంధీ కూడా తెలియకుండా చేశారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నోటీసు ఇవ్వడం, విషయాన్ని చెప్పడం లాంటివి చేయకుండా కాంగ్రెస్ పెద్దలు వ్యవహరించారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని భుజాన ఎత్తుకొని పనిచేసిన ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం సేవలు అందించినందుకు పార్టీ మంచి బహుమానం ఇచ్చిందని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

సంస్థాన్ నారాయణపురం లో మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం

Bhavani

జెఈఈ (మెయిన్) ఫలితాలలో శ్రీచైతన్య కొత్త రికార్డు

Satyam NEWS

ట్రాఫిక్ పోలీసులకు అందరూ సహకరించండి

Satyam NEWS

Leave a Comment