34.7 C
Hyderabad
May 5, 2024 01: 48 AM
Slider ముఖ్యంశాలు

గర్భిణీపై సామూహిక అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు

#rape

ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో నాలుగు నెలల గర్భిణి అయిన ఎస్సీ మహిళపై భర్త కళ్లెదుటే నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులకు 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. 2022 మే ఒకటో తేదీ అర్ధరాత్రి.. నాలుగు నెలల గర్భిణి అయిన ఎస్సీ మహిళ.. భర్త, ముగ్గురు పసిబిడ్డలతో రైల్వే ఫ్లాట్‌ఫాంపై ఆదమరిచి నిద్రిస్తున్న వేళ.. కామాంధులు రెచ్చిపోయారు.

భర్తతో కావాలని గొడవ పెట్టుకుని మరీ ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. భర్త, పిల్లలతో కలిసి ఉపాధి పనుల కోసం మరో ప్రాంతానికి వలస వెళ్తూ మార్గమధ్యలో రేపల్లె రైల్వేస్టేషన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆమెపై (25) భర్త కళ్లెదుటే ఈ పాశవిక చర్యకు పాల్పడ్డారు. ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడగా మరొకరు ఈ దారుణానికి సహకరించారు. తనను నిర్బంధించిన వ్యక్తి నుంచి తప్పించుకున్న భర్త అదే ప్లాట్‌ఫాంపై ఉన్న రైల్వే పోలీసు కార్యాలయం వద్దకు వెళ్లి ఎంతగా అరిచినా, అతని ఆక్రందన విని ఒక్కరంటే ఒక్కరూ స్పందించలేదు. నిస్సహాయ స్థితిలో ఆ భర్త రైల్వేస్టేషన్‌ బయటికి వెళ్లి కనిపించినవారినల్లా సాయం కోరినా ఎవరూ ముందుకు రాలేదు.

ప్లాట్‌ఫాంపై నిద్రిస్తున్న ఇద్దరు పిల్లల్ని అక్కడే వదిలేసి ఓ బిడ్డను భుజాన ఎత్తుకుని ఆ అర్ధరాత్రి వేళ భార్యను రక్షించుకోవటానికి పరుగున పోలీసు స్టేషన్‌కు చేరుకున్న అతని దయనీయ స్థితి ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు వెంటనే స్పందించి అక్కడకు చేరుకునే వరకూ ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ హృదయవిదారకమైన ఘటన బాపట్ల జిల్లా రేపల్లె పోలీస్‌ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో, రేపల్లె రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లా నాగాయలంకలో ఉపాధి పనుల నిమిత్తం బాధితురాలు.. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి 2022 మే ఒకటో తేదీన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి బయల్దేరారు. గుంటూరు, తెనాలి మీదుగా రేపల్లె రైల్వేస్టేషన్‌కు శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో చేరుకున్నారు. అప్పుడు నాగాయలంక వెళ్లేందుకు బస్సులు లేకపోవటంతో బాధిత కుటుంబం రైల్వేస్టేషన్‌లోనే నిద్రించింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు యువకులు వారి వద్దకు వచ్చారు. బాధితురాలి భర్తను నిద్రలేపి టైం ఎంతయిందని అడిగారు.

తన వద్ద వాచీ లేదని అతను సమాధానమివ్వటంతో.. ఆ ముగ్గురూ అతని గొంతు నులిమి ఊపిరాడకుండా చేశారు. అతని వద్దనున్న రూ.750 లాక్కున్నారు. బాధితురాలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిలో ఇద్దరు ఆమెను జట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. మరొకరు ఆమె భర్తను నిర్బంధించారు. బాధితురాలిని ప్లాట్‌ఫాం చివరి వరకూ ఈడ్చుకుంటూ వెళ్లి భర్త కళ్లెదుటే ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. రైల్వేస్టేషన్‌లోనే ఈ ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఆమెను చిత్రహింసలు పెట్టారు.

ఈ కేసులో రేపల్లె నేతాజీనగర్‌కు చెందిన పాలుబోయిన విజయకృష్ణ (20), పాలుదురి నిఖిల్‌ (25), గతంలో పలు దొంగతనం కేసుల్లో నిందితుడైన మరో బాలుడిని నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులపై నేరం రుజువు కావడంతో ఏ1, ఏ2కి 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఏ3 మైనర్‌ కావడంతో తెనాలి పోక్సో కోర్టులో విచారణ జరుగుతోంది.

Related posts

ఇస్రో సక్సెస్: నింగిలోకి విజయవంతంగా జీశాట్-30

Satyam NEWS

TSRTC: మహా శివరాత్రికి 2427 ప్రత్యేక బస్సులు

Bhavani

నెక్స్ట్ జెన్: తెలుగుదేశం పార్టీ యువ నేతలకు లోకేశ్‌ విందు

Satyam NEWS

Leave a Comment