36.2 C
Hyderabad
May 14, 2024 17: 11 PM
Slider తెలంగాణ సంపాదకీయం

రాష్ట్ర రవాణా సంస్థకు రాజకీయ గ్రహణం

kollapur rtc

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మెట్టు దిగారు. కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారు – అనే మాట నుంచి ఆయన కిందికి దిగి వారు విధుల్లో చేరేందుకు మరొక అవకాశం ఇచ్చారు. ఆయన మాకు అవకాశం ఇచ్చేదేంటి? అని అడిగే వారికి ఇది నచ్చదు. కానీ, ఇక ఒక అడుగు దిగాల్సింది కార్మిక సంఘాలేనని మాత్రం చెప్పవచ్చు. ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం లేదనే స్థాయి నుంచి ముఖ్యమంత్రి ఒక్క మెట్టు దిగి వచ్చినందున ఈ అవకాశాన్ని కార్మిక సంఘాలు ఉపయోగించుకుంటే సబబు గా ఉంటుంది.

లేకుంటే ఇప్పటికే దాదాపుగా ఐదు వేల రూట్లు ప్రయివేటు వారికి ఇచ్చినట్లుగానే మరి కొద్ది రోజుల్లో ఇంకొన్ని ఆ తర్వాత మరికొన్ని రూట్లు కూడా ప్రయివేటు పరం చేసేఅవకాశం ఉంది. ఒక్క సారి ప్రయివేటు పరం అయిపోయిన తర్వాత మళ్లీ తిరిగి తీసుకోవడం సాధ్యం అయ్యే పని కాదు. ఈ విషయాన్ని సిఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించవద్దు, మేం వారి వెనుక ఉన్నాం అనే మాటలు చెప్పే రాజకీయ పార్టీలు వారి ఆకలి తీర్చలేవు. కేసీఆర్ మంత్రివర్గ సమావేశం వివరాలను చెబుతుండగానే మరోపు కమ్యూనిస్టు నాయకులు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించవద్దు అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనికి వంతపాడుతున్నారు. దీనికి సామాజిక మాధ్యమాన్ని కూడా వినియోగించుకుంటున్నారు. కేసీఆర్ ఒక మెట్టు దిగాడని, ఇంకా పట్టుబిగిస్తే అన్ని డిమాండ్లు నెరవేరుతాయని సోషల్ మీడియా మెసేజ్ లు నిన్నటి నుంచి తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ విధంగా కార్మికులను రెచ్చగొట్టడం ద్వారా ఎవరూ ఏమీ సాధించలేరు. సమ్మెకు ముందు ఆర్టీసీని ఇప్పటి పరిస్థితిని పోల్చుకోవడం కరెక్టు కాదు. న్యాయ స్థానాల నుంచి ఏ వ్యవస్థ కూడా ఆర్టీసీ సమ్మె విషయంలో చేయగలింది ఏమీ లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి కుండబద్దలు కొడుతున్నారు.

ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కమ్యూనిస్టు పార్టీలు కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చాయి. ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చి సమ్మెకు మద్దతు ఇస్తున్న బిజెపిని ఇరకాటంలో పెట్టే రాజకీయం ఇది. కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీలో ఏనాడైనా జోక్యం చేసుకుందా? చేసుకునే వీలు ఉందా? కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండే అవకాశం కలుగుతుందా? కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి బిజెపిని విలన్ గా చూపెట్టాలని కమ్యూనిస్టులు చేసే ప్రయత్నాలు ఇవి.

కమ్యూనిస్టు యూనియన్లు చేస్తున్న ఈ సమ్మెలో బిజెపి జోక్యం చేసుకున్న నాటి నుంచి సత్యం న్యూస్ ఈ విషయాన్ని వెల్లడిస్తూనే ఉంది. బిజెపి ఈ సమ్మె లో జోక్యం చేసుకోవడం ద్వారా సాధించేది ఏమీ ఉండదని సత్యం న్యూస్ చెప్పింది. ఆర్టీసీ సమ్మెలో ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు ఉంటే సాధించగలిగేది ఏమీ ఉండదు. కమ్యూనిస్టులు చేసే ఈ వాదన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది కాబట్టి వారికి ఆనందంగానే ఉంది. ఇందులోని సాధ్యాసాధ్యాలను పాలక పార్టీ అయిన కాంగ్రెస్ ఆలోచించడం లేదు. ప్రస్తుతం ఉన్న సమస్య కేవలం కార్మికుల డిమాండ్ల అంశం మాత్రమే కాదు. ఇందులో రాజకీయాలు జొరబడటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు పైచేయి సాధించడానికి ఆస్కారం కల్పిస్తున్నది.

బిజెపిని కమ్యూనిస్టు పార్టీలే కాదు కేసీఆర్ కూడా సమ్మె లో కార్నర్ చేస్తున్నారు. బిజెపిని కార్నర్ చేయడం ఆయనకు కూడా అత్యవసరం. కేంద్ర ప్రభుత్వం వాటా ఆర్టీసీలో ఉంటే మరి ఆర్టీసీ నష్టాలలో కూడా భారం పంచుకోవాలని ఆయన లేఖ రాయబోతున్నారు. దానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏం సమాధానం చెబుతుంది? నష్టాలను భర్తీ చేస్తుందా?

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో రాజకీయ పార్టీలు నేరుగా జోక్యం చేసుకోవడం వల్ల జరుగుతున్న పరిణామాలు ఇవి. గతంలో రాజకీయ పార్టీలకు అనుబంధంగా కార్మిక సంఘాలు ఉండేవి. అలా కార్మిక సంఘాలు రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు అయినా సరే అవి సమ్మెల్లో పాల్గొనడమో, సమ్మెలకు మద్దతు ఇవ్వడమో చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. ఇప్పుడు రాజకీయ పార్టీలే కార్మికుల వ్యవహారాలలో తలదూర్చి సమస్యను జటిలం చేస్తున్నాయి. ఆర్టీసీ సమ్మెవల్ల ఈ రాజకీయ పార్టీ నాయకులకు ఎవరికి ఎలాంటి నష్టం లేదు.

నష్టం ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ ప్రయాణీకులకు మాత్రమే. రూట్లు ప్రయివేటు పరం చేస్తే ముందు ఆర్టీసీ మూతబడుతుంది. కార్మికులకు ఉద్యోగాలు పోతాయి. వేలాది కుటుంబాలు రోడ్డుపైకి వస్తాయి. ఇదంతా జరిగిన తర్వాత ప్రయాణీకులపై భారం మొదలవుతుంది. ప్రయివేటు బస్సుల వాళ్లు ఏం చేస్తారో అందరికి తెలిసిందే. బస్సు నిండేవరకూ ప్రయాణం నిలిపివేస్తాడు. చార్జీలు పిండేస్తాడు.

ఇప్పటికే బలంగా ఉన్న ప్రయివేటు ట్రాన్స్ పోర్టు మాఫియా విచ్చలవిడిగా రాజ్యం ఏలుతుంది. మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ట్రాన్స్ పోర్టు మాఫియా కలిసి రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి. వారే రాజ్యం ఏలతారు. అందువల్ల ఆర్టీసీని బతికించుకోవడం ఇప్పటి ప్రజాస్వామ్య అవసరం.  

Related posts

లాజిక్కులు లేని ‘‘విశాఖపట్నం కథలు’’

Bhavani

జనసేనకు 24 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లు ఖరారు?

Satyam NEWS

పరకాల లో వచ్చి గెలువు

Bhavani

Leave a Comment