33.7 C
Hyderabad
April 29, 2024 02: 30 AM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

చెత్తపలుకు: పత్రికలు అమ్ముకోండి అక్షరాన్ని కాదు

kr murthy

‘ఎన్నికలకు ముందు నుంచే ఒక పకడ్బంది ప్రణాళికతో కమ్మ సామాజిక వర్గంపై ఇతర సామాజిక వర్గాలలో ద్వేష భావాన్ని రగిలించి రాజకీయ ప్రయోజనం పొందింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నది సత్యం కాదా?’ ఇదీ ప్రశ్న. చేసినోడు పోయాడు చెప్పినోడిదే పాపం అన్నట్టుగా లేదూ? చేసినోడు మనోడు కాబట్టి ఫర్వాలేదు.

చెప్పినోడు పరాయి వాడు కాబట్టి, అధికారంలోకి వస్తే మన మాట వినడు కాబట్టి, మనకు గతంలో ఇచ్చిన భూములు రద్దు చేసేస్తాడు కాబట్టి, మన పత్రిక ను నడుపుకోవడానికి ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ ధనాన్ని ప్రకటనల రూపంలో ఇవ్వడు కాబట్టి, ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనాల కోసం అచ్చేసిన ప్రభుత్వ ప్రకటనల బిల్లులు ఆపాడు కాబట్టి- వాడు ఏం చేసినా తప్పే.

‘మీడియా చాలా కాలం కిందటే కలుషితం అయింది’ ఇది మరో స్టేట్ మెంట్. కలుషితం చేసింది ఎవరు? బడా పెట్టుబడిదారుల సాయంతో మీడియాను కబ్జా పెట్టుకుని, ఇష్టం వచ్చిన విధంగా రాజకీయాలను ప్రభావితం చేసే వార్తలు రాస్తూ, రాజకీయ ప్రయోజనాలు పొందుతూ, ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ చేసిన వారిదా? కాదా? కచ్చితంగా మీడియాను కలుషితం చేసింది ఇలాంటి వారే.

ఈనాడు దినపత్రిక ఒక పార్టీని సపోర్టు చేసినా, ఒక పార్టీని వ్యతిరేకించినా ఒక పద్ధతి ప్రకారం ఇక సిద్ధాంతం ప్రాతిపదికన చేస్తుంది. బిలోది బెల్ట్ కొట్టే పనులు సాధ్యమైనంత వరకూ చేయదు. మరి కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నది ఏమిటి? కులాన్ని అడ్డంపెట్టుకుని మీడియా ముసుగు వేసుకుని ఒక పార్టీ తరపున ఎన్నికలలో డబ్బులు కూడా పంచిన వారు కూడా ఇప్పుడు నీతులు చెబుతున్నారు.

బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తో ఫొటో దిగంగానే ఆయన గురించి అనుకూలంగా వార్తలు వచ్చేస్తాయి. ఎవరైనా అప్పాయింట్ మెంటు ఇవ్వకపోయినా, తాను కోరిన పని చేయకోయినా వ్యతిరేక వార్తలు వస్తాయి. ఇదా జర్నలిజం స్వేచ్ఛ? జర్నలిజం, జర్నలిజం విలువల గురించి ప్రతి ఆదివారం రాయడమే కానీ ఆచరణ ఏది? ఒక జర్నలిస్టును కొందరు రాజకీయ నాయకులు దారుణంగా నడి రోడ్డుపై నరికి చంపితే ఆ కుటుంబాన్ని- ఈ నీతులు చెప్పే వారు, జర్నలిజం విలువల కోసం పరితపించే వారు ఆదుకున్నారా?

కనీసం ఆ జర్నలిస్టు కోసం ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు. తుని కి చెందిన ఆ జర్నలిస్టు భూవివాదాలపై వార్తలు రాస్తే అచ్చువేసుకుని పత్రికలు అమ్ముకున్న ఆ సంస్థ అదే కారణంతో అతడిని హతమారిస్తే మాట్లాడకపోవడానికి కారణం ఏమిటి? ‘దీర్ఘకాలం శ్రమించి విశ్వసనీయత సంపాదించుకున్నవారు సైతం జీవితం చరమాంకంలో సౌకర్యవంతమైన జీవితం కోసం ప్రభుత్వాల పంచన చేరిపోతున్నారు’ – ఏమిటీ రాతలు? సీనియర్ ఎడిటర్ కొండుభట్ల రామచంద్రమూర్తి గురించి రాసిన ఈ వ్యాఖ్యలు ఎంత దారుణమైనవో తెలుసా?

రామచంద్రమూర్తికి సౌకర్యవంతమైన జీవితం లేక ప్రభుత్వంలో చేరారా? ఏం మాట్లాడుతున్నావు? సాటి జర్నలిస్టు గురించి రాసే మాటలేనా ఇవి? రామచంద్రమూర్తికి ఎంతో సౌకర్యవంతమైన జీవితమే ఉంది. ఆయన సంతానం స్వశక్తితో పైకి వచ్చి వారి ఉద్యోగాలు వారు చేసుకుంటున్నారు. ఆయన ఏనాడూ డబ్బుల కోసం వెంపర్లాడలేదు. కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టలేదు. నా దగ్గర పని చేశాడు, నా దగ్గర పని చేశాడు అని పది సార్లు చెప్పుకునేవారికి ఈ విషయం తెలియకపోవడం వారి కుల దురహంకారమే తప్ప మరొకటి కాదు.

రాజశేఖరరెడ్డి పత్రికల స్వేచ్ఛను హరిస్తూ జీవో తెచ్చినపుడు రామచంద్రమూర్తి రాసిన విషయాలను ఏకరువు పెడుతున్నాడు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన కొత్తలో వార్త దినపత్రికను అడ్డుకోవడానికి ఒక జీవో తీసుకువచ్చాడు. అప్పుడు రామచంద్రమూర్తి వార్తలో ఎడిటర్ గా ఉన్నారు. నేను రిపోర్టర్ గా ఆ వార్త రాశాను. కొత్త కోరల నల్ల చట్టం కమ్ముకొస్తోంది అని హెడ్డింగ్ పెట్టి రామచంద్రమూర్తి మొదటి పేజీలో బ్యానర్ వేశారు.

చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేసినపుడు కూడా జర్నలిజానికి ప్రమాదమే ఏర్పడింది. ఇది ఎవరినో సపోర్టు చేయడానికి ఇది  రాయడం లేదు. గొంగటిలో తింటున్నాం- బొచ్చు ఏరుకుంటూ తిట్టుకోవద్దు అని మాత్రమే చెబుతున్నాను. ప్రస్తుతం తెలుగులో స్వతంత్ర పత్రికలు, స్వతంత్ర ఛానెళ్లు లేవు. అన్నీ పార్టీ పత్రికలు, పార్టీ ఛానెళ్లూ, కుల పత్రికలూ కుల ఛానెళ్లే.

ఆ మాటకొస్తే దేశం మొత్తంలో కూడా అలానే ఉంది. ఎవరు అధికారంలో ఉంటే వారు ఇలాంటి జీవోలే తెస్తున్నారు. పత్రికలలో పని చేసేవారు మాత్రం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పత్రికాధిపతులు కోటానుకోట్లు సంపాదిస్తూనే ఉన్నారు. పత్రిక అమ్మి కాదు సుమా, పత్రికలో అక్షరాన్ని అమ్మి.

-సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్

Related posts

మాల నాగరాజును హత్యచేసిన దుండగులను ఉరితీయాలి

Satyam NEWS

అత్యవసర మందుల స్మగ్లర్ అరెస్టు

Satyam NEWS

కుల వృత్తుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిఉంది

Satyam NEWS

Leave a Comment