23.2 C
Hyderabad
May 8, 2024 02: 33 AM
Slider సంపాదకీయం

లాజిక్కులు లేని ‘‘విశాఖపట్నం కథలు’’

#Jagan

రాజధాని అమరావతిని చంపేసి విశాఖపట్నం వెళ్లిపోవాలన్న కోరికకు ఇంత పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని ఎవరూ ఊహించలేదు. మూడు రాజధానుల ప్రతిపాదన కానీ, విశాఖను రాజధానిగా చేసే ప్రతిపాదన కానీ తమకు తెలియదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఒక్క సారిగా వైసీపీ నేతలకు నక్షత్రాలు కనిపించాయి. ఇదే విషయాన్ని పార్టీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అమరావతి రైతులకు అండగా ఉండి చంద్రబాబే ఉద్యమం నడిపిస్తున్నారని ఇంత కాలం వైసీపీ నేతలు ప్రచారం చేశారు.

అసలు అమరావతిలో ఉద్యమమే లేదని, కేవలం చంద్రబాబు వల్లే ఉద్యమం నడుస్తున్నదని కూడా అన్నారు. అమరావతి రైతులది త్యాగమే కాదని, వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులని కూడా వైసీపీ నేతలు కామెంట్లు చేశారు. అమరావతిలో ఏముంది బూడిద అంటూ కొందరు వ్యాఖ్యానించగా అమరావతి ఎడారి అని మరి కొందరు అన్నారు. అత్యంత దారుణమైన పదజాలంతో అమరావతి రైతులను అవమానించారు.

అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు. రాజమండ్రి లాంటి ప్రాంతంలో అయితే వైసీపీ కార్యకర్తలు అమరావతి రైతుల అరసవెల్లి పాదయాత్రపై దాడి చేశారు కూడా. ఏపి హైకోర్టు అమరావతి రాజధానిపై విస్పష్టమైన తీర్పు చెప్పిన తర్వాత కూడా వైసీపీ తన ప్లాన్ ను వదులుకోలేదు.

మూడు రాజధానుల అంశంపై ముందుకే వెళ్తామని చెప్పిన వైసీపీ ఆ మధ్య కాలంలో ప్రాంతీయ సభలు నిర్వహించి ప్రజలకు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రాంతీయ సభలకు పెద్దగా ప్రజల నుంచి స్పందన రాలేదు. అయినా సరే మూడు రాజధానులు అంటూ అదే వాదన ఇంత కాలంగా వినిపిస్తున్నారు.

కర్నూలులో న్యాయ రాజధాని లేదని, హైకోర్టును తరలించే ప్రతిపాదన లేదని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా మూడు రాజధానులు అంటూ మళ్లీ వైసీపీ నేతలే ఎలా వాదిస్తారో ఎవరికీ అర్ధం కాలేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సన్నాహక సదస్సులో విశాఖపట్నం తమ రాజధాని అని ముఖ్యమంత్రి జగన్ స్పష్టంగా చెప్పేశారు.

అంటే మూడు రాజధానుల ముచ్చటకు వైసీపీ ప్రభుత్వం చరమగీతం పాడినట్లేనా? అని ఆ పార్టీకి చెందిన నేతలే లోలోన మదనపడుతున్నారు. మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఉపసంహరించుకోవడం, న్యాయ రాజధాని కర్నూలులో లేదని అంగీకరించడం, అమరావతి నుంచి రాజధానిని తరలించి విశాఖ పట్నంలో పెట్టేందుకు తాజాగా ప్రయత్నాలు చేయడం…. ఇలా దేనికి దేనికి పొంతన లేని నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం కుండ బద్దలు కొట్టింది.

ఏపి రాష్ట్ర హైకోర్టు తీర్పుపై తాము దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని వత్తిడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ లోపు రాజ్యసభలో అమరావతి రాజధానిపై ప్రశ్న ఎందుకు వేసిందో ఎవరికి అర్ధం కాదు. అదీ కూడా వేరే వేరే ఎంపి కాదు. సాక్ష్యాత్తూ ఆ పార్టీ అత్యంత కీలక నాయకుడు విజయసాయిరెడ్డి ఈ విధమైన ప్రశ్న వేసి జగన్ మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకునే విధంగా ఎందుకు ప్రవర్తించారో అర్ధం కాదు.

మూడు రాజధానులు పోయి విశాఖ రాజధాని అని చెబుతున్న వైసీపీ ఇప్పటికే కోస్తా ఆంధ్రాకు దూరం కాగా ఇప్పుడు రాయలసీమకు కూడా దూరం అయిపోతున్నది. రాజధాని వద్దని కచ్చితంగా చెబుతున్న ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని ఆదరించే అవకాశం లేదు.

విశాఖపట్నం రాజధానిగా చేయకపోతే తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు మళ్లీ ఆ మాట మాట్లాడటం లేదు. విశాఖపట్నం కు తరలి రావడం ఖాయం అని ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జి ఇటీవలే చెప్పారు. మరి ఈ తాజా పరిణామాల తర్వాత ఇప్పుడు ఏం చెబుతారో తెలియదు.

ఇలా అన్ని రకాలుగా అయోమయంలో ఉంచడమే వైసీపీ రాజకీయం ఏమో తెలియదు. ‘‘కన్ఫ్యూజన్ లో ఎక్కువ కోట్టేస్తాను’’ అని అదేదో సినిమాలో మహేష్ బాబు అన్నట్లు ప్రజలను అయోమయంలో ఉంచి ఎక్కువ సీట్లు కొట్టేయడం జగన్ ప్లానా???

Related posts

అనుమానాస్పద పరిస్థితుల్లో వివాహిత మృతి

Satyam NEWS

మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Satyam NEWS

లాక్ డౌన్ బాధితులకు సహాయం చేసిన పూర్వ విద్యార్ధులు

Satyam NEWS

Leave a Comment