38.2 C
Hyderabad
May 3, 2024 21: 54 PM
Slider జాతీయం

ఎనాలసిస్: రాహుల్ కు పరిణితి తెచ్చిన కోవిడ్ 19

#Rahul Gandhi Zoom

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి సమకాలీన అంశాలపై ఇటీవల  స్పందిస్తున్న తీరు రాజకీయ పరిశీలకుల దృష్టిని  ఆకర్షిస్తోంది.  మారిన ఆహార్యం నలభైఏళ్ల బ్రహ్మచారికి హుందాతనాన్ని కొత్తగా తెచ్చింది. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ అంశాలపై రాహుల్ గాంధీ  వైఖరి ఆయనలోని నవీన కోణాన్ని ఆవిష్కరిస్తోంది.

సమకాలీన సమస్యలపై రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు ఇంతకు ముందు లేని రాజకీయ ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ మార్చుకున్న తలకట్టు తీరుతో  ఆయన తండ్రి దివంగత రాజీవ్ గాంధి ముఖ కవళికలను గుర్తుకు తెస్తున్నారు.

భౌతిక మార్పుతో పాటు ఆలోచనా సరళి కూడా పరిణతి చెందినట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా దేశంలో ప్రవేశిస్తుందని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ కి ఫిబ్రవరి నెలలోనే రాహుల్ గాంధీ  సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు మొదటి నుంచి అంటూనే ఉన్నాయి.

వలస కార్మికులకు ఇచ్చిన మద్దతు మరువలేనిది

అప్పుడే స్పందించి వుంటే కరోనా తీవ్ర త ఇంతటి ప్రమాదకర స్థాయిలో ఉండేది కాదని వారు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని  తప్పు పడుతున్నారు. కరోనా సృష్టించిన హఠాత్పరిణామానికి ఘోరంగా దెబ్బతిన్న వలస కార్మికులకు మద్దతుగా రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు  కేంద్రప్రభుత్వాన్ని కొన్నిసార్లు ఇరకాటంలో పెట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను స్వయంగా తెలుసుకున్న రాహుల్… వారి వెతలు తీరడానికి తక్షణ ఆర్ధిక సాయం అవసరమని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వీధులపాలైన లక్షలాది వలస పని వారిని సురక్షితంగా వారి సొంతప్రాంతాలకు పంపాలని కాంగ్రెస్ కేంద్రాన్ని కోరింది.

కనీస చార్జీలు వలస కార్మికుల నుంచి వసూలు చేయాలని భావించిన కేంద్రప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. అవసరమైన వారికి కాంగ్రెస్ రవాణా ఖర్చులు భరించగలదని ప్రకటించింది. అర్హులైన బీద,మధ్యతరగతి వర్గాల ప్రజలకు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రు.7500 నగదు రూపంలో సాయం అందించాలని, కనీసం 3 నెలల కాలానికి సరిపడా రేషన్ సరుకులు ఉచితంగా ఇవ్వాలని కేంద్రం పై ఒత్తిడి పెంచింది.

పరిస్థితి చక్కదిద్దుకున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు సమర్ధవంతంగా చేపట్టినట్లు రాహుల్ గాంధి తెలిపారు. కేంద్రం నుంచి ఎటువంటి  సహాయ సహకారాలు అందకపోయినా సొంత కార్యాచరణతో ప్రమాదాన్ని నివారించగలిగామని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ప్రకటించాయి.

రాజకీయలకతీతంగా కాంగ్రెస్ ఇస్తున్న నిర్మాణాత్మక సూచనలు మోదీ  స్వీకరించక పోవడం కేంద్రప్రభుత్వ ఒంటెత్తు పోకడకు అద్దం పడుతోందని ఆ పార్టీకి చెందిన మీడియా నిర్వాహకులు విమర్శించారు. కోవిడ్-19 విజృంభణ కారణంగా ఉత్పన్నమైన సమస్యలను అధిగమించేందుకు కేంద్రం చేపట్టాల్సిన చర్యలపై రాహుల్ మేధావులతో చర్చిస్తున్నారు.

 భారతీయ రిజర్వ్ బ్యాంకు మాజీ  గవర్నర్ రఘురామ్ రాజన్, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ఎపిడేమియాలజిస్ట్ జోహాన్ గీసికే, పారిశ్రామిక వేత్త రాజీవ్ బజాజ్ ,తాజాగా యూఎస్ మాజీ దౌత్యవేత్త నికోలస్ బర్న్స్ తో పలు ఆసక్తికర అంశాలపై సంభాషించారు.

రఘురాం రాజన్ తో నిరంతర చర్చలు

కరోనా విలయానికి దారితీసిన పరిస్థితులు, తదనంతర పరిణామాలు, భారత్ తీసుకున్న చర్యలు చర్చకు వచ్చాయి. కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కునే విషయం లో కేంద్రప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని రాహుల్ మొదటి నుంచీ విమర్శిస్తున్నారు.

చర్చలో భాగంగా భారత్ ఇంకాస్త తెలివిగా లాక్ డవున్ ను విరమిస్తే దేశ ఆర్థిక పరిస్థితి విషమంగా ఉండేదికాదని, తద్వారా ప్రజలు కొలువులు కోల్పోయే పరిస్థితి ఉత్పన్నం అయ్యే ప్రమాదం తప్పేదని రఘురాం రాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంక్షోభంలో ఇరుక్కున్న పేద ప్రజలకు సాయం చేసేందుకు 6000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయాలని ఆయన సూచించారు. రాహుల్ గాంధీ తో సంభాషించిన ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ మాట్లాడుతూ భారత్ లో బీదరికంలో మగ్గుతున్న 60 శాతం ప్రజలకు నేరుగా ధన సాయం అందించాలని ప్రభుత్వానికి సూచించారు.

కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకునే సూచనలు

యూఎస్ మాజీ దౌత్యవేత్త నికోలస్ బర్న్స్ తో జరిపిన సంభాషణలో రాహుల్ కోవిడ్-19 సమస్య తీవ్రతను సునిశితంగా పరిశీలిస్తున్న తనకు భారత్ డీ ఎన్ ఏ అర్ధమైనట్లు తెలిపారు. కోవిడ్ వైరస్ సంక్షోభం నుంచి భారత్ త్వరలోనే బయటపడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్రప్రభుత్వం విధించిన లాక్ డవున్ దశలు, లాక్ డవున్ నిష్క్రమణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి చర్చల్లో భాగమయ్యాయి. నిష్క్రమణ ప్రణాళిక రహితమైన కారణంగా దేశంలో కరోనా ఉద్ధృతి విపరీతంగా పెరుగుతోందని ఆయన కేంద్రాన్ని విమర్శించారు.

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినా…

వలస కార్మికులను సొంత ప్రాంతాలకు చేర్చడం పూర్తికాలేదని మోదీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఇటీవల చైనా, నేపాల్ దేశాలతో తలెత్తిన వివాదాల సందర్భంగా కూడా రాహుల్ గాంధి కేంద్రప్రభుత్వాన్ని ఎండగట్టిన తీరు రాజకీయ విశ్లేషకుల మన్ననలను పొందింది.

అంతర్జాతీయ మీడియా సైతం రాహుల్ గాంధి ప్రస్తుత వ్యవహార శైలిని మెచ్చు కుంటూ తగిన ప్రచారం కల్పించడం విశేషం. రాహుల్ ప్రదర్శిస్తున్న చురుకుదనం కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని చోదక శక్తిగా పనిచేయలగదని ఆ పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి.

కాలక్రమేణా రాహుల్ గాంధి ప్రజామోదం పొందడానికి తగిన నాయకునిగా రూపుదిద్దుకునే మహదవకాశం కోవిడ్-19 సంక్షోభం రూపంలో లభించినట్లు రాజకీయ పరిశీలకుల భావన కొంతవరకు నిజమే అనిపిస్తుంది.

పొలమరశెట్టి కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  మాజీ  ఉన్నతాధికారి.

Related posts

శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలకమండలి

Satyam NEWS

ఈడి అధికారుల ఎదుటకు వచ్చిన ఐశ్వర్యారాయ్

Satyam NEWS

అర్ధంతరంగా తనువు చాలించిన చదువుల తల్లి

Satyam NEWS

Leave a Comment