41.2 C
Hyderabad
May 4, 2024 15: 23 PM
Slider సంపాదకీయం

పాదయాత్రను అడ్డుకోవడంలో విజయం

#mahapadayatra

అమరావతి నుంచి అరసవెల్లి వరకూ అమరావతి రైతులు ప్రారంభించి సగం ముగించిన పాదయాత్రను తాత్కాలికంగా అడ్డుకోవడంలో పోలీసులు కృతకృత్యులయ్యారు. పోలీసులు సాధించిన ఈ ఘన విజయానికి ప్రభుత్వ పెద్దలు కచ్చితంగా ఎంతో సంతోషించి ఉంటారు. అమరావతి రైతులు తమ మహా పాదయాత్రను ఎంతో బాధగా తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.

ఈ ప్రభుత్వం అలానే పొలీసులు గత వారం  రోజులు నుండి తమపై అలజడి  సృష్టించి పాదయాత్రకు ఆటంకం కలిగిస్తున్నారని అమరావతి రైతుల నాయకుడు అరె శివారెడ్డి ఎంతో ఆవేదనతో చెప్పారు. పోలీసులు టిఫిన్ లు భోజనాలు తమ దగ్గరే తింటున్నారని అయినా తమను అడ్డుకుంటున్నారని ఆయన చెప్పిన మాటలు ఎంతో బాధ కలిగిస్తున్నాయి. కనీసం పోలీసులకు భోజనాలు కూడా ఏర్పాటు చేయలేని ముఖ్యమంత్రి తమ పాదయాత్రను అడ్డుకోవటానికి అదే  పోలీసులను ఉపయోగిస్తున్నారని ఆయన అంటున్నారు.

పాదయాత్ర ఆరంభం అయిన నాటి నుంచి లేదా అంతకు ముందు నుంచే అమరావతి రైతుల పాదయాత్ర పై ప్రభుత్వ పెద్దలు విషయం చల్లుతూనే ఉన్నారు. రైతుల పాదయాత్రను దండయాత్రగా అభివర్ణిస్తూనే ఉన్నారు. ప్రాంతీయ విద్వేషాలను రగిల్చి రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికే ప్రాధాన్యతనిచ్చారు. నిస్సహాయులైన రైతులు ఏం చేస్తారు? ఏమీ చేయలేక పాదయాత్రను వాయిదా వేసుకున్నారు.

రాష్ట్ర హైకోర్టు మంచి ఉద్దేశ్యంతో ఇచ్చిన తీర్పు పోలీసుల చేతికి ఒక ఆయుధంగా మారింది. పోలీసులు తమ చేతికి ఆయుధం దొరకగానే దాన్ని విశృంఖలంగా ప్రయోగించారు. రైతుల కథ అర్ధంతరంగా ఆగిపోయేలా చేశారు. రాష్ట్ర హైకోర్టు విస్పష్టమైన తీర్పు చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు ఉంటాయని మాత్రమే చెబుతున్నది. మూడు రాజధానులను ముందుకు తీసుకువెళతామని మాత్రమే స్పష్టంగా చెబుతున్న మంత్రులు, ముఖ్యమంత్రి కోర్టు తీర్పు విషయాన్ని ప్రస్తావించడం లేదు.

‘‘చిన్న చిన్న న్యాయపరమైన అడ్డంకులు’’ ఉన్నా వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళతామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యుయస్ మాండమస్ ఇచ్చినా సరే చిన్న చిన్న అడ్డంకులుగానే భావిస్తున్న ప్రభుత్వానికి ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? అమరావతి రైతులను అర్ధంతరంగా ఆపిన వారు విజయగర్వంతో ఊగిపోవచ్చు. కానీ అంతకు మించి ఏమీ సాధించే అవకాశం లేదు.

ఎందుకంటే వచ్చిన న్యాయపరమైన అడ్డంకులు వారు అనుకున్నంత చిన్నవేం కాదు. అమరావతి రైతులు పాదయాత్రను అడ్డుకోవడానికి విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన గర్జన విఫలం అయిన తర్వాత కూడా ప్రజామోదం లేని తమ నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మాత్రమే అధికార పార్టీ ఆలోచిస్తున్నది. ప్రభుత్వం చెబుతున్న అధికార వికేంద్రీకరణకు అర్ధం లేకపోయినా అదే మళ్లీ అధికారానికి మూల మంత్రంగా వారు భావిస్తున్నారు. అధికార వైసీపీ మూడు ప్రాంతాలలో మళ్లీ బలం పుంజుకోవడానికి మూడు రాజధానుల మంత్రం ఒక్కటే శరణ్యమని భావిస్తున్నారు.

రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆర్ధికంగా రాష్ట్రం చితికిపోయింది. నీటిపారుదల ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు అడుగు ముందుకు వేయడం లేదు. అయినా సరే అధికార పార్టీ మూడు రాజధానుల వైపే వెళుతున్నది తప్ప తన వైఫల్యాలను వెనుదిరిగి చూసుకోవడం లేదు. అవి తమ వైఫల్యాలుగా వైసీపీ నేతలు అంగీకరించడం లేదు. కాలమే ఈ సమస్యలకు పరిష్కారం చెప్పాలి.

Related posts

తెలుగు రాజకీయాల్లో ఆ నాటి సంచలనం కాట్రగడ్డ ప్రసూన

Satyam NEWS

CCAP: తమిళుల తొలి అడుగులు

Satyam NEWS

క్రైమ్ స్టాఫ‌ర్ నెంబ‌ర్ స్థానంలో…బాధితుల కోసం కొత్త వాట్సాప్ నెంబ‌ర్..!

Satyam NEWS

Leave a Comment