సుమారు మూడు నెలల క్రితం విజయనగరం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీపికా ఎం పాటిల్..తానేంటో..తన పనితనం ఏంటో…మాటలల్లోకాక చేతల్లో చూపిస్తున్నారు. ఇటీవల వరుసగా మూడు డివిజన్ ల పరిధిలో పలు ముఖ్యమైన స్టేషన్లను ఇన్స్పెక్ట్ చేసిన ఎస్పీ…తద్వారా ఆయా స్టేషన్లలో పేరుకుపోయిన కేసుల పరిష్కారం కోరకు కొత్త మార్గాలను తన స్వీయ పరిశీలనలో తెలుసుకున్నట్టు తెలుస్తోంది.అందకు తాజా నిదర్శనమే…ప్రతీసోమవారం బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే “స్పందన నుఇక నుంచీ ప్రతీరోజూ నిర్వహించనున్నారు.
ఇదీ విజయనగరం జిల్లాకు మూడు నెలల క్రితం ఎస్పీగా వచ్చిన లేడీ పోలీస్ అధికారిణి దీపికా ఎం.పాటిల్ తీసుకుంటున్న చర్యలు. జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితుల నుంచీ ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఇకపై పని దినాల్లో ప్రతీ రోజూ మద్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్య “స్పందన” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. అంతేకాకుండా, ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ 9392903402ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఫిర్యాదు చేసేందుకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి రాలేనివారు ఈ కొత్త వాట్సాప్ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఈ వాట్సాప్ నంబరుకు వచ్చే ఫిర్యాదులను, పోలీసుల పనితీరుపై అభిప్రాయాలను పంపవచ్చునని, ఈ వాట్సాప్ నంబరును స్పెషల్ బ్రాంచ్ సీఐ పర్యవేక్షిస్తారన్నారు. డీపీఓలో నిర్వహించిన “స్పందన” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని ఆదేశించారు.
“స్పందన” కార్యక్రమంలో భాగంగా 28 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ…, ఫిర్యాదుదారులకు రశీదులను అందజేసి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. జామి మండలం జన్నివలస కి చెందిన ఓ బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్తను అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు కొట్టారని… పోలీసులు కేసు నమోదు చేసారని, కాని వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
నెల్లిమర్లకి చెందిన ఓ బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను విశాఖపట్నంకు చెందిన ఒక వ్యక్తిని ప్రేమించి, వివాహం చేసుకున్నానని.. తన భర్త వివాహం అయిన నాలుగు నెలలకే తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు. విశాఖకు చెందిన మరో బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తమకు పార్వతీపురం మండలం గోచెక్క పంచాయతీ నిడికివలనలో కొంత వ్యవసాయ భూమి కలదని, సదరు భూమిని వేరే వ్యక్తులకు వ్యవసాయం చేసేందుకు కౌలుకు ఇవ్వగా, అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు సదరు భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయమై తాము ప్రశ్నించగా, తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు.
విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెదతాడివాడ వంచాయతీకి చెందిన ఇంకొక బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త నాలుగు నెలల క్రితం చనిపోయారని, తన భర్త పేరున ఉన్న ఆటోను, భూమిని తన కుటుంబ అవసరాలకు అమ్మకుండా భర్త కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు.
విజయనగరంకు చెందిన మరో బాధితురాలు తన అవసరాల నిమిత్తం తన తండ్రి పెన్షన్ పుస్తకంను, ఇంటి పట్టాను ఒక వ్యక్తి వద్ద తాకట్టు పెట్టి 30వేలు అప్పుగా తీసుకొని, తిరిగి ఇప్పటికే 20వేలు చెల్లించానని కానీ సదరు వ్యక్తి ఇంకనూ 50వేలు బకాయి ఉన్నట్లుగా చెబుతూ, వేధిస్తున్నట్లు, న్యాయం చేయాలని కోరారు.
ఇలా మొత్తం 28 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ…అక్కడిక్కడే బాధితుల ముందే సంబందిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మాట్లాడారు. తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు, డీసీఆర్ బి సీఐ బి.వెంకటరావు, ఎస్బీ సీబలు జి. రాంబాబు, ఎన్. శ్రీనివాసరావు, డీసీఆర్ బి ఎస్ఐలు నీలకంఠం, సూర్యారావు, విక్రమరావు పాల్గొన్నారు.