38.2 C
Hyderabad
May 5, 2024 22: 52 PM
Slider నిజామాబాద్

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద యువకుని ఆత్మహత్యాయత్నం

#sucidebid

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. కలెక్టరేట్ ఎస్సై అప్రమత్తతతో యువకుడు ప్రాణం నిలిచింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం అవల్ గావ్ గ్రామానికి చెందిన సిద్ధప్ప అనే యువకుడు రెండు సంవత్సరాల క్రితం మద్నూర్ మార్కెట్ యార్డులో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఆర్టీఐ ద్వారా మార్కెట్ కమిటీకి వచ్చే నిధులు, ఖర్చుల వివరాలు కోరాడు.

యువకుడిని అడ్డుకుంటున్న పోలీసులు

అయితే యార్డు అధికారులు సమాచారం ఇవ్వలేదు. దాంతో తనవద్ద ఉన్న ఆధారాలతో ఢిల్లీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ కార్యాలయంలో, వ్యవసాయ శాఖ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన రాలేదు. అధికారుల చుట్టూ తిరగడంతో పాటు సిద్ధప్ప వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలంటూ అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి.

బెదిరింపులకు పాల్పడటం కూడా మొదలు పెట్టారు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా తనపైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆధారాలు లాక్కునే ప్రయత్నం చేసారని సిద్ధప్ప ఆరోపించారు. మార్కెట్ యార్డులో 5 కోట్ల వరకు అవినీతి జరిగిందని, విచారణకు అదేశించి అధికారులు వివరాలు కోరితే ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాటు బీఆర్ఎస్ మద్నూర్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్ తన అనుచరులకు మద్యం తాగించి తనను కొట్టించాడని ఆరోపించారు.

ఆత్మహత్యకు అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తు

దాంతో 7 నెలలుగా తాను ఇంటికి వెళ్లడం లేదని, నిజమాబాదులో ఉంటున్నానని తెలిపాడు. అవినీతిపై ప్రశ్నించినందుకు తన కుటుంబం మొత్తాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తాను ఇంటికి వెళ్తే ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. తన కుటుంబంపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరగకపోవడంతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్టు పేర్కొన్నాడు. అధికారులు ఇకనైనా స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.

ఆత్మహత్య అనుమతి కోసం దరఖాస్తు.. రిసీవ్ చేసుకున్న అధికారులు

ఇదిలా ఉండగా గత నెల 23 న మార్కెట్ యార్డు కుంభకోణంపై మాట్లాడుతున్న తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అధికారులు విచారణ చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆత్మహత్య చేసుకోవడానికి తనకు అనుమతి ఇవ్వాలని కలెక్టరేట్ లో సిద్ధప్ప వినతిపత్రాన్ని అందజేశారు. అయితే అధికారులు వినతిపత్రాన్ని తీసుకోవడమే కాకుండా దానికి రిసివ్డ్ కాపీ కూడా సిద్ధప్పకు అందించడం గమనార్హం.

ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే వద్దని చెప్పి సముదాయించాల్సిన అధికారులు సిద్ధప్ప ఇచ్చిన వినతిపత్రాన్ని తీసుకుని దానికి ఇన్ వార్డులో రిసివ్డ్ కాపీ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సిద్ధప్ప కోరిక మేరకు ఆత్మహత్య చేసుకోవడానికి అధికారులు అనుమతి ఇచినట్టేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కేవలం ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రమే వినతిపత్రాన్ని ఇవ్వలేదని, కుంభకోణంపై విచారణ జరపాలని కూడా ఆ వినతి పత్రంలో పేర్కొన్నాడని, ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని రాసిన విషయాన్ని అధికారులు గమనించి ఉండకపోవచ్చన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఇన్ వార్డులో ఇచ్చిన రిసివ్డ్ కాపీ

కలెక్టరేట్ లో రెండవసారి

నూతన కలెక్టర్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇది రెండవసారి. గతంలో గాంధారి మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇలాగే కలెక్టరేట్ లోపల పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. నేడు అలాంటి ఘటనే మళ్ళీ పునరావృతం కావడం కలకలం రేపింది. గేటు బయట వాటర్ బాటిల్ లో పెట్రోల్ తెచ్చుకున్న సిద్ధప్ప ఒంటిపై పెట్రోల్ పోసుకుని అగ్గిపుల్ల గీస్తుండగా కలెక్టరేట్ ఎస్సై ఉదయ్ శేఖర్ పరుగెత్తుకుంటూ వచ్చి అడ్డుకున్నారు. లేకపోతే ఘోర ప్రమాదం సంభవించేది.

ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వందలాదిగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టరేట్ కు వస్తుంటారు. వారిలో ఎవరు తమ వెంట పెట్రోల్ తెచ్చుకుంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్ లో ఓ ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలెక్టరేట్ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related posts

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్ధులు మృతి

Bhavani

విలేజ్ డెవలప్ మెంట్: రాజుల గ్రామాన్ని సందర్శించిన ఎంపీవో

Satyam NEWS

ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రీ పంచమి వేడుకలు

Satyam NEWS

Leave a Comment