34.7 C
Hyderabad
May 4, 2024 23: 48 PM
Slider ఖమ్మం

నాడు మురికికూపం నేడు ఉద్యానవనం

#gollapadu

సరిగ్గా మూడేళ్ల క్రితం వరకు అది ఓ మురికికూపం. నిత్యం దుర్వాసనతో.. పక్క నుంచి వెళ్లాలంటేనే కర్చీఫ్తో ముక్కుమూసుకుని నడవాల్సిన దుస్థితి నుంచి నేడు కాస్త సమయం దొరికితే చాలు అక్కడికి వెళ్లి ఆహ్లాదాన్ని ఎంజాయ్‌ చేద్దామన్న స్థితికి చేరింది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతో పట్టణం నుంచి నగరం రూపుదాల్చిన ఖమ్మంలో నిత్యనరకంగా ఉన్న గోళ్లపాడు ఛానెల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్న తలంపు నుంచి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ చొరవ వల్ల ఇది సాధ్యమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ మేరకు సుమారు రూ.70 కోట్ల నిధులతో  22 డివిజన్ల నుంచి వచ్చే మురికినీటిని పూర్తిగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజిగా మారుస్తూ, డ్రైనేజి నీటిని ఎస్టీపీ ద్వారా ప్రాసెస్‌ చేసి మున్నేరుకు మళ్లించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. నగరంలోని పన్నెండు డివిజన్లకు పైగా ప్రజలు నిత్యం మురికినీటి సమస్యతో ఇబ్బంది పడుతుండడం, తద్వారా దోమల బెడద, వెరసి ప్రజారోగ్యం, పారిశుద్య నిర్వహణ మున్సిపల్‌ యంత్రాంగానికి సవాలుగా మారింది. దీనికితోడు విలువైన ప్రభుత్వభూమి ఆక్రమణలను తొలగించడం సైతం అధికార యంత్రాంగానికి అలవికాని పనిగా మారింది. ఈ దుస్థితిని ఎలాగైనా తొలగించాలన్న లక్ష్యంతో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి చొరవతో ఈ ప్రాజెక్టు డిజైన్ల రూపకల్పన మొదలు, క్షేత్రస్థాయిలో అమలు దాకా నిత్యం పర్యవేక్షిస్తూ, అవసరమైన సలహాలు, సూచనలు చేస్తూ ఈ ప్రాజెక్టు విజయవంతం చేయడంలో ప్రముఖపాత్ర పోషించారు.

ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని గ్రామాల రైతుల పంటపొలాలకు సాగునీరు అందించే లక్ష్యంతో అప్పట్లో ఏర్పాటు చేసుకున్న గోళ్లపాడు ఛానెల్‌ కాలక్రమంలో పడావు పడిరది. దీంతో పెరిగిన నగరీకరణ వల్ల డ్రైనేజి గా మారింది. నగరంలోని సుమారు 28 డివిజన్లకు పైగా ఏరియాలోని మురికినీరు ఈ ఛానల్‌ ద్వారా ఎంబీ గార్డెన్స్‌, సారధినగర్‌, జూబ్లీపుర, కాల్వొడ్డు, ఆంజనేయస్వామి టెంపుల్‌, మోతినగర్‌, వెంకటలక్ష్మీ థియేటర్‌, వాసవి కళ్యాణమండపం, ప బురదరాఘవాపురం, గాంధీచౌక్‌, గాంధీనగర్‌, సుందరయ్యనగర్‌, ప్రకాష్‌ నగర్‌, త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతం, కుమ్మరిబజార్‌, మంచికంటినగర్‌, దాల్మిలిరియా, కోల్డ్‌ స్టోరేజి ఏరియా మరియు శ్రీనివాసనగర్‌ మీదుగా మున్నేరుకు దారితీసే ఈ డ్రైనేజి ఫ్లోను, ఎస్టీపీలో ప్రాసెస్‌ అనంతరం మున్నేరుకు మళ్లించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఖమ్మం నగర ప్రజలను గోళ్లపాడు ఛానెల్‌ మురికికూపం నుంచి రక్షించడం, విలువైన భూముల ఆక్రమణలను తొలగించడం, తద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడడం, డ్రైనేజి వాటర్‌ ట్రీట్మెంట్‌ ద్వారా పర్యావరణ హితంగా మార్చి నదీకాలుష్య నివారణకు తోడ్పడడం ఈ ప్రాజెక్టు లక్ష్యాలు. అభివృద్ధి అనంతరం ఈ ఛానల్‌ ప్రాంతాన్ని ప్రజల నిత్యజీవితానికి అనువుగా మార్చడంతో పాటుగా విశాలమైన పార్కింగ్‌ ప్రదేశం, అందమైన కళతో కూడిన గేట్లు, ఫౌంటెన్ల ఏర్పాటు, పార్కులు, పిల్లల ఆటస్థలాలు, ఓపెన్‌ జిమ్‌లు స్కేటింగ్‌ రింగులు, వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, బాస్కెట్‌బాల్‌, షటిల్‌, మెగా చెస్‌ బోర్డు, పంచతత్వ మెడిసినల్‌ ప్లాంటేషన్‌ సహా ఇంకా మహిళలు, వృద్ధులు కూర్చోడానికి బెంచ్లు ఏర్పాటు చేశారు. ప్రకాష్‌ నగర్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ పార్కు, పుచ్చలపల్లి సుందరయ్య పార్కు, మంచికంటి రామకిషన్‌రావు పార్కు, కాళోజి నారాయణరావు పార్కు, దాల్మిల్‌ పార్కు, వనజీవి రామయ్య పార్కు, కొండా  లక్ష్మణ్‌ బాపూజీ పార్కు, మోతీనగర్‌ పార్కు, కాల్వఒడ్డు వెండిరగ్‌ జోన్‌, జూబ్లీక్లబ్‌ వద్ద రజబ్‌ అలీ పార్కు, ఎఫ్సీఐ గోడౌన్‌ పార్కు, ఇలా మొత్తం పదకొండు ఉద్యానవనాలను ఏర్పాటుకు తలపెట్టి, ఇప్పటికి ఏడు పూర్తికాగా, మరో నాలుగు శరవేగంగా సాగుతున్నాయి. అయితే భవిష్యత్‌లో  సైతం ఎలాంటి ఆక్రమణలకు తావివ్వని విధంగా చెయిన్‌లింక్‌ మెష్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.

గోళ్లపాడు ఛానెల్‌ అభివృద్ధి క్రమంలో ఇక్కడ ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న 812 నివాసాలను తొలగించి వారికి వైఎస్సార్‌ నగర్లో సకల సౌకర్యాలతో పునరావాసాన్ని ఏర్పాటు చేయడం పూర్తయింది. ఇప్పటిదాకా 10.60 కి.మీ మేర అభివృద్ధి పరచిన గోళ్లపాడు ఛానెల్‌ ద్వారా  32 ఎకరాలను ‘‘స్వాధీనం చేసుకుని పార్కులు ఏర్పాటు చేయడం పూర్తి చేశారు. ఈ ప్రాంతంలో మియావకీ ఫారెస్ట్‌తో పాటు ఇంకా ప్లాంటేషన్‌ ఏర్పాటు సైతం పూర్తయింది. దీన్లో 6.5 కి.మీ మేర వరద నివారణ కోసం వర్షపు నీటి ప్రవాహానికి డ్రైన్లు నిర్మించి మున్నేరుకు మళ్లించారు. నిత్యం రెండు కోట్ల లీటర్ల మురికినీటిని శుద్ధిచేసే సామర్థ్యంతో ఏర్పాటు చేసిన మురుగునీటి    శుద్ధ కేంద్రం నిర్మాణంలో ఉంది. గోళ్లపాడు ఛానెల్‌ అభివృద్ధికి డిజైన్ల రూపకల్పన నుంచి అమలు దాకా సరైన  సమయంలో విజయవంతంగా పూర్తిచేసిన మున్సిపల్‌ ఎస్‌ఈ వి. రంజిత్‌ సహా మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ బృందాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌, మేయర్‌ పునుకొల్లు నీరజ, మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభిలు అభినందించారు.

Related posts

కేంద్రం విధానాల వల్లే ధాన్యం సేకరణలో ఇబ్బందులు

Satyam NEWS

రోడ్డు వెడల్పు చేయకుంటే రాజీనామా చేయండి

Satyam NEWS

పేరు పిచ్చితో అంబేద్కర్ ను అవమానించిన జగన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment