25.2 C
Hyderabad
May 13, 2024 10: 23 AM
Slider ఖమ్మం

అటవీ హక్కుల చట్టం కఠినంగా అమలు చేయాలి

#Anant Nayak,

అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలుపర్చడం ద్వారా గిరిజనులు అడవికి హక్కుదార్లనే అవగాహన కల్పించాలని జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు అనంత నాయక్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, భద్రాచలం ఐటిడిఎ పీవో గౌతమ్ పోట్రూ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గిరిజనులకు అందుతున్న సంక్షేమ ఫలాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కమీషన్ సభ్యులు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు, పథకాలు, పాలసీల ద్వారా చేకూర్చిన హక్కులు గిరిజనులకు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గిరిజనుల స్వభావాన్ని ఇతరులు సరిగ్గా అర్థం చేసుకోలేరని, గిరిజనులు వారి సమస్యలను సరిగ్గా చెప్పుకోలేరని ఆయన తెలిపారు.

సమస్యలను సరిగ్గా వివరించలేక గిరిజనులు పరిష్కారాన్ని పొందడం లేదన్నారు. గిరిజనుల సమస్యలను క్షేత్ర అధికారులు అర్థం చేసుకొని, వారు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకొని వారికి న్యాయం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలులో లోపాలను కమీషన్ సమీక్షిస్తుందన్నారు. జిల్లాలో భూమిలేని ఎస్టీ వ్యవసాయ కూలీల వివరాలు సమర్పించాలన్నారు.

జిల్లాలో నైపుణ్యం ఉండి, ఉపాధికై నమోదు చేసుకున్న ఎస్టీలు ఎంతమంది, ఎంతమందికి ఉపాధి కల్పించింది వివరాలు సమర్పించాలన్నారు. ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిని కమీషన్ సభ్యులు సమీక్షించారు. జిల్లాలో డబల్ బెడ్ రూం ఇండ్లలో ఎస్టీలకు కేటాయించిన ఇండ్లు, ఎస్టీల ఆవాసాల్లో రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌళిక సదుపాయాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో ఎన్ని కుల, కమ్యూనిటీ ధృవీకరణలు దరఖాస్తులు వచ్చింది, ఎన్ని ధ్రువీకరణలు జారీచేసింది అడిగి తెలుసుకున్నారు. ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, చర్యలపై అడిగి తెలుసుకున్నారు. అటవీ హక్కు చట్టం క్రింద ఎన్ని దరఖాస్తులు వచ్చింది, ఎన్ని పరిష్కరించింది, ఎన్ని తిరస్కరించింది, తిరస్కరణకు కారణాలు అడిగి తెలుసుకున్నారు.

గిరిజన, గిరిజనేతర కేసుల్లో అధికారులు గిరిజనేతరులకు మద్దతుగా ఉంటున్నట్లు, క్షేత్ర స్థాయిలో విచారణ చేసి అర్హులకు న్యాయం చేయాలన్నారు. బంధన్ పథకంలో భాగంగా గిరిజన మహిళలచే స్వయం సహాయక సంఘాల ఏర్పాటుచేసి, ఆ సంఘాల ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు.

గిరిజనులకు వివిధ పథకాల ద్వారా రుణాలకు ఎన్ని దరఖాస్తులు వచ్చింది, ఎన్ని మంజూరు చేసింది, ఎన్ని గ్రౌండింగ్ చేసింది నివేదిక సుమర్పించాలన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన క్రింద ఎన్ని ఎస్టీ ఆవాసాల్లో లబ్ది చేకూర్చింది వివరాలు ఇవ్వాలన్నారు. గిరిజనుల స్థితిగతులు మార్చి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, వారిని అభివృద్ధిపథంలోకి తేవాలని ఎస్టీ కమీషన్ సభ్యులు తెలిపారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, ఐటిడిఏ పీవో గౌతమ్ పోట్రూ లు జిల్లాలో ఎస్టీలకు అమలవుతున్న పథకాలు, పాలసీలు, వారి సంక్షేమానికి చేపడుతున్న చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

జిల్లాలో ప్రాథమిక, ఉన్నత, కళాశాల స్థాయిల్లో 1,633 పాఠశాలలు ఉన్నట్లు, ఒక లక్షా 93 వేల 791 మంది విద్యార్థులు ఉండగా, 35,308 మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నట్లు వారు తెలిపారు. ఈ పాఠశాలల్లో 11,850 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు, ఉపాధ్యాయుల, విద్యార్థుల నిష్పత్తి 1:16 ఉన్నట్లు వారు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో టాయిలెట్స్, విద్యుద్దీకరణ, త్రాగునీరు, ఫర్నీచర్, భవనాల మరమ్మత్తులు, క్రొత్త భవనాల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో జిల్లా ప్రధాన ఆస్పత్రితోపాటు, 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 4 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 246 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నట్లు వారు తెలిపారు. 2022-23 లో ఏఎన్సి నమోదులు 22,674 జరగగా, 3,742 మంది ఎస్టీలు ఉన్నట్లు వారు అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 9,882 ప్రసవాలు జరగగా, 1,927 మంది ఎస్టీలు ఉన్నట్లు, వీరందరికి కేసీఆర్ కిట్ పథక లబ్ది చేకూర్చినట్లు వారు తెలిపారు. రైతుబంధు పథకం క్రింద జిల్లాలో 49,056 మందికి రూ. 10 వేల చొప్పున వారి వారి ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు వారు అన్నారు.

రైతు భీమా క్రింద 2020 నుండి 507 మంది ఎస్టీ రైతుల కుటుంబాలకు రూ. 25.35 కోట్లు అందజేశామన్నారు. జిల్లాలో 4,291 ఎస్టీ స్వయం సహాయక సంఘాల్లో 44,639 మంది సభ్యులు ఉన్నట్లు వారు అన్నారు. వివిధ పథకాల క్రింద ఎస్టీలకు 38,665.91 లక్షలు ఆందజేసినట్లు, ఇందులో కస్టమ్ హైరింగ్ సెంటర్, వడ్డీ లేని రుణాలు, రివాల్వింగ్ ఫండ్, సీడ్ ఫండ్, ఆసరా పెన్షన్లు ఉన్నట్లు వారు తెలిపారు.

జిల్లాలో 974 డబల్ బెడ్ రూం ఇండ్లు ఎస్టీలకు ఆందజేసినట్లు వారు అన్నారు. ఐటిడిఎ పరిధిలో 6 ఎస్టీ సంక్షేమ గురుకులాలు ఏర్పాటు చేయగా, ఇందులో 3,019 బాల బాలికలు విద్యానభ్యసిస్తున్నారని అన్నారు. గిరిజన గురుకుల్లాల్లో చదివిన విద్యార్థులు ప్రతిష్టాత్మక జేఈఈ, ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించారన్నారు.

ఎస్టీలకు ప్రత్యేకంగా 2 క్రీడా పాఠశాలలు నిర్వహించబడుతున్నట్లు వారు తెలిపారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, బ్యాంక్ పీవో, పోలీస్ ఎస్సై, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు వారు అన్నారు. ఐటిడిఎ ద్వారా ఎస్టీలకు వైద్య పరంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు.

భద్రాచలం లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుచేసి గిరిజన సాంస్కృతి, జీవనశైలిని కాపాడుకొనే చర్యలు తీసుకుంటున్నట్లు వారు అన్నారు. ఎస్టీ ఆవాసాల్లో ఆల్ వెదర్ రోడ్లు 54 మంజూరయి, పనులు ప్రగతిలో ఉన్నట్లు వారు తెలిపారు. సీఎం గిరివికాసం క్రింద రూ. 8.2 కోట్లు మంజూరు కాగా, రూ. 7.3 కోట్లు ఖర్చు చేసినట్లు వారు తెలిపారు. గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నట్లు వారు అన్నారు.

Related posts

కన్నతండ్రే హంతకుడు: సత్యంన్యూస్ చెప్పిందే నిజమైంది

Satyam NEWS

ఫోర్‌ వే పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అనంత

Satyam NEWS

కరోనా వ్యాధితో మరణించిన వారిని ఖననం చేయడం సబబేనా?

Satyam NEWS

Leave a Comment