29.7 C
Hyderabad
May 4, 2024 05: 42 AM
Slider హైదరాబాద్

సుపరిపాలన కోసమే వార్డ్ కార్యాలయాలు

#KTR

నగర పౌరులకు సుపరిపాలన అందించాలన్న సదుద్దేశంతోనే వార్డ్ కార్యాలయ వ్యవస్థను తీసుకువచ్చామని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. అంబర్ పెట్ నియోజకవర్గం లోని కాచిగూడలో జిహెచ్ఎంసి వార్డ్ కార్యాలయ వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్లు ఇ.విజయ్ కుమార్ గౌడ్, దూసరి లావణ్య గౌడ్, కన్నె ఉమా, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకే రోజు నగరవ్యాప్తంగా 150 డివిజన్ లలో వార్డ్ కార్యాలయాలను ప్రారంభించుకుంటున్నాం. వార్డు కార్యాలయం ద్వారా నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలు అందుతాయి. పౌర సేవలతో పాటు ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిహెచ్ఎంసి అధికార యంత్రాంగానికి వీలు కలుగుతుంది.

వార్డు స్థాయిలో కార్పొరేటర్లు ఉన్నారు కానీ అధికార యంత్రాంగం ప్రత్యేకంగా లేకపోవడం వలన ఈ వార్డు కార్యాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. నగర పౌరులకు సుపరిపాలన అందించాలన్న సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రాజకీయాలకు అతీతంగా ఈ వ్యవస్థ విజయవంతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

స్ధానిక ప్రజా ప్రతినిధులు ఏ పార్టీకి చెందిన వారైనా వార్డు కార్యాలయానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము. ఈ వ్యవస్థ విజయవంతం అయితే దేశం మొత్తం ఈ వ్యవస్థను అన్ని నగరాల్లో అమలు చేసే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ విజయవంతం అయితే దేశంలో సూపరిపాలన అందిస్తున్న నగరాలలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తుందన్న నమ్మకం ఉంది.

జిహెచ్ఎంసి అధికారులు కూడా ఎవరు ఫిర్యాదు చేసినా, ఈ వ్యవస్థ ద్వారా సత్వరం వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నాను. వార్డు వ్యవస్థ కొత్తది అయినందువలన కొద్ది రోజులపాటు కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉంది. అయినా సాధ్యమైనంత వేగంగా ఈ వ్యవస్థను సంపూర్ణంగా పనిచేసేలా పనిచేస్తాం.

దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి వ్యవస్థను మన నగరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వార్డు కార్యాలయానికి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇన్చార్జిగా ఉంటారు. వాటి కార్యాలయంలో మొత్తం పదిమంది అధికారుల బృందం వివిధ శాఖల నుంచి పనిచేస్తుంది. రోడ్డు నిర్వహణ, పారిశుధ్యము, ఎంటమాలజీ, హరితహారం, టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖ, జలమండలి, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఇలా పదిమంది అధికారులు వార్డు స్థాయిలో జరిగే ఆయా శాఖల కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.

వీరితోపాటు భవిష్యత్తులో ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ తరపున కూడా మరింత మంది అధికారులను వార్డు కార్యాలయానికి అనుసంధానం చేస్తాం. కేవలం అధికారులను నియమించడమే కాకుండా, వారి విధుల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను చేస్తాం.

పౌరుల సమస్యల పరిష్కారానికి నిర్ణీతమైన గడుపుతో కూడిన సిటిజన్ చార్టర్ కూడా జిహెచ్ఎంసి ఈ వార్డు కార్యాలయం ద్వారా పౌరులకు అందిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు మైనార్టీ నాయకులు అనుబంధ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోవాక్సిన్ కు వ్యతిరేక ఆర్టికల్స్ తొలగించాలని ది వైర్ కు ఆదేశం

Satyam NEWS

బంగాళాఖాతంలో నివర్ తుపాను

Sub Editor

మంచి సందేశం ఇచ్చే చిత్రం పలాస 1978

Satyam NEWS

Leave a Comment