39.2 C
Hyderabad
May 4, 2024 19: 14 PM
Slider సంపాదకీయం

అమరావతి రైతుల పాదయాత్రకు ‘‘అగ్ని పరీక్ష’’

#amaravatimahapadayatra

రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని సూర్య భగవానుడని కోరేందుకు అమరావతి నుంచి అరసవెల్లి వరకూ పాదయాత్ర తలపెట్టిన రైతులకు ఇప్పటి వరకూ ఊహించని స్పందన వస్తూనే ఉన్నది. గుంటూరు జిల్లాలో ప్రారంభం అయిన ఈ రైతు మహాపాదయాత్ర కృష్ణా జిల్లాకు చేరిన తర్వాత గుడివాడ ప్రాంతంలో కొద్ది పాటి ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో అనూహ్య స్పందన కనిపించింది.

అదే విధంగా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో కూడా అద్భుతమైన స్పందన వస్తున్నది. ఇప్పటి వరకూ బాగానే ఉంది కానీ విశాఖ జిల్లాలోకి ప్రవేశించే సమయం నుంచి అమరావతి రైతులకు అగ్ని పరీక్ష ఎదురుకానున్నది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పాదయాత్రకు పూర్తి స్థాయి వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాదయాత్ర చేస్తున్న రైతులపై ఎగబడుతున్నారు.

అమరావతి రైతుల పాదయాత్రను రియల్ ఎస్టేట్ యాత్రగా అభివర్ణిస్తూ మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉంటున్నాయి. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామాలు సమర్పించే డ్రామాకు తెరతీశారు. జేఏసీ పేరుతో వైసీపీ సానుభూతిపరులను రెచ్చగొడుతున్నారు. పోలీసులు ఎటూ వైసీపీ వైపే ఉంటారు. అందువల్ల అమరావతి రైతులు మరింత జాగ్రత్తగా ఉండటం ఇప్పుడు అవసరం.

ఇప్పటి వరకూ వచ్చిన అనూహ్య స్పందన ఫలితాన్ని అనుభవించాలంటే పూర్వపు విశాఖ పట్నం జిల్లా అంచుకు చేరే సమయానికి అమరావతి రైతులు మరింత సంయమనంతో సాగాల్సి ఉంటుంది. ఏ మాత్రం రెచ్చగొట్టే ప్రసంగాలు ఉన్నా కూడా అధికార పార్టీ ఎడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని అమరావతి రైతులు గుర్తు పెట్టుకోవాలి. సీనియర్ మంత్రులైన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవాలని తమ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు.

ఈ ఇద్దరు మంత్రులతో బాటు మరో మంత్రి అమర్ నాథ్ అతి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ‘‘ మా ప్రాంతాన్ని కొల్లగొట్టేందుకు వస్తున్నారు’’ అంటూ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల పట్ల అమరావతి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తరాంధ్రలో ఎక్కడా కూడా ప్రజలు ఈ పాదయాత్రకు వ్యతిరేకిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అయితే వైసీపీ నాయకులు, కార్యకర్తలు శృతి మించితే సమస్యలు వచ్చేది అమరావతి రైతులకే.

ప్రభుత్వంలో సానుభూతి కనిపించే మాట అటుంచి పాదయాత్రను సాగనివ్వరాదనే పట్టుదల కనిపిస్తున్నది. అందువల్ల అమరావతి రైతులు ఇప్పుడు ఎదుర్కొనబోయేది అగ్ని పరీక్ష. రాయలసీమ ప్రాంతానికి పాదయాత్రగా వెళ్లినప్పుడు కూడా ప్రభుత్వం అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది.

అప్పుడు పోలీసుల ద్వారా మాత్రమే ప్రయత్నం చేసిన వైసీపీ ఇప్పుడు తన పార్టీ నాయకులను కూడా మోహరించింది. అమరావతి రైతుల పాదయాత్ర సఫలం కావడం అనేది తమకు జీవన్మరణ సమస్యగా వైసీపీ ఊహించుకుంటున్నది. అందువల్లే ఈ సంఘర్షణ. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలతో అమరావతి రైతులు పాదయాత్ర నిర్వహించుకోవాల్సి ఉంటుంది.  

Related posts

అన్ని వర్గాలను మోసం చేసిన జగన్ రెడ్డి

Satyam NEWS

దర్శి కూటమి అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మికి ఘన స్వాగతం

Satyam NEWS

నేను సగర్వంగా చెప్పుకునే ఓ మంచి సినిమా “మాతృదేవోభవ” (ఓ అమ్మ కథ) !!

Satyam NEWS

Leave a Comment