37.7 C
Hyderabad
May 4, 2024 13: 14 PM
Slider చిత్తూరు

తిరుమలలో దారుణం: పారువేట మండపం కూల్చివేత

#Paruveta Mandapam

తిరుమలలో మరో చారిత్రాత్మక కట్టడం కూల్చివేస్తూ టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. తిరుమలనుండి పాపవినాశం మార్గానికి వెళ్లే దారిలో దాదాపు 350 సంవత్సరాల క్రితం రాయల కాలంలో నిర్మితమైన ఈ రాతి మండపం కింది భాగం అలాగే ఉంచి, పై భాగంలో స్వామివారిని కొలువు తీర్చి ఉత్సవ సేవలు నిర్వహించే పురాతన రాతిమండపాన్ని పూర్తిగా తొలగించాలని టిటిడి అధికారులు నిర్ణయించారు.

ఈ మేరకు గత రెండు రోజులుగా ఈ మండపాన్ని కూలదోసే పనులు చేపట్టారు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన అనంతరం తిరుమల రాయలు హయాంలో రాజుల పరిపాలన సాగే సమయంలో తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో ఈ పారువేట మండపాన్ని నిర్మించినట్లు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలో రాజులు ఇతర రాజ్యాల పైన దండెత్తి విజయం సాధించిన సందర్భాలలో ఆ విజయానికి ప్రతీకగా పారువేట ఉత్సవం పేరుతో అటవీ ప్రాంతంలోకి వెళ్లి జంతువులను వేటాడి, సేద తీరే కార్యక్రమాన్ని పారువేట ఉత్సవంగా పిలుస్తారు.

ఇదే సాంప్రదాయాన్ని అనుసరిస్తూ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం మరుదినమైన కనుమ పండుగ రోజున పారు వేట ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయం నుండి మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి వేట మండపానికి విచ్చేస్తారు.

అక్కడ ఆలయ అర్చకులు స్వామి వారు జంతువులను వేటాడే విధంగా సన్నివేశాలను రూపొందించి చిత్రీకరించి, పారు వేట ఉత్సవాన్ని స్వామివారు వేటాడిన విధంగా సంపూర్ణం చేస్తారు. అనంతరం మలయప్ప స్వామి ఉభయదేవేరలతో పారువేట మండపంలో సేద తీరుతారు.

ఈ సందర్భంగా ఆ పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి, మల్లయ్య స్వామి వారిని మండపంలో కొలువు తీర్చి ఆయనకు ఊంజల సేవను ఉత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే కార్తీక వనభోజనోత్సవాల సమయంలో కూడా ఏడాదికోసారి స్వామివారికి ప్రత్యేక పూజలు ఈ పారువేట మండపంలో నిర్వహించి భక్తులందరూ సహా పంక్తి భోజనాలు చేసే ఉత్సవాలను కూడా నిర్వహించడం ఆనవాయితీ.

శ్రీవారికి పరమ భక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు స్వామివారికి ఇదే మార్గంలో నడుచుకుంటూ తిరుమలకు వచ్చేవారని మధ్యలో ఉన్న ఈ పారువేట మండపంలో సాక్షాత్తు తాళ్లపాక అన్నమాచార్యులు సేదతీరే వాళ్ళని ఇక్కడే స్వామివారికి ఆయన పూజాది కార్యక్రమాలు నిర్వహించి భగవంతుని స్మరిస్తూ సంకీర్తనలు ఆలపించినట్లుగా అన్నమాచార్య వంశీకులు తెలుపుతున్నారు. అనంతరం కాలక్రమేనా ఈ పార్వేట మండపాన్ని అన్నమాచార్య వంశీకులే దశాబ్దాల తరబడి నిర్వహించినట్లుగా ఆధారాలు ఉన్నాయి.

1952 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన తరువాత దశాబ్ద కాలం అనంతరం 1962లో పారువేట మండపాన్ని కొంత విస్తరణ పనులు చేపట్టినట్లుగా తెలుస్తోంది. అయితే 2007 వ సంవత్సరం వరకు ఈ మండపం నిర్వహణ బాధ్యతలు తాళ్లపాక అన్నమాచార్య వంశీకులు ఆధ్వర్యంలో నడిచినట్లుగా తెలుస్తోంది. అనంతరం తాళ్లపాక అన్నమాచార్యుల వంశపారపర్య హక్కుల అంశంపై సుప్రీంకోర్టులో టీటీడీకి అనుకూలమైన తీర్పు వెలువడటం, మిగిలిన కొన్ని ఆస్తులతో పాటు ఈ చారిత్రాత్మక కట్టడమైన పారువేట మండపం కూడా టీటీడీ ఆధీనంలోకి వచ్చింది.

అంతకు క్రితం 2007వ సంవత్సరం వరకు ఈ పార్వేట మండపంలో ఏ ఉత్సవం నిర్వహించాలన్నా అన్నమాచార్య వంశీకుల అనుమతి తీసుకుని టిటిడి అధికారులు నిర్వహించేవారు. టీటీడీకి స్వాధీనమైన 2007వ సంవత్సరం నుండి ఈ మండపంలో స్వామివారికి ప్రతి ఏటా జరిగే పారువేట ఉత్సవం తదితర కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించడం ప్రారంభించింది. మండపం చుట్టూ షెడ్ల నిర్మాణం విస్తరణ అభివృద్ధి పనులు చేపట్టిన టీటీడీ మండపాన్ని కదిలించే, రూపుమాపే ప్రయత్నం మాత్రం ఇంతకాలం చేయలేదు.

ప్రస్తుతం ఈ పార్వేట మండపం పై భాగాన్ని రాతి మండపాన్ని కూల్చివేయడం ఓ రకంగా చారిత్రాత్మక కట్టడాన్ని కనుమరుగు చేయడమేనని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే తిరుమలలోని అనేక చారిత్రాత్మకమైన ఆధారాలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం, వేయికాళ్ల మండపం తొలగించడం వివాదాస్పదమైన సంఘటనలు చోటు చేసుకున్న గత నేపథ్యంలో ప్రస్తుతం పారువేట మండపం పునర్నిర్మాణ పనులు ఏ పరిస్థితులకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.

Related posts

వార్డు స‌చివాల‌యం త‌నిఖీ

Sub Editor

అల్లాహ్ అందరినీ చల్లగా చూస్తారు: మంత్రి పువ్వాడ

Satyam NEWS

ప్రకాశం జిల్లాలో కరోనా టెన్షన్

Satyam NEWS

Leave a Comment