29.7 C
Hyderabad
May 4, 2024 06: 31 AM
Slider ఆదిలాబాద్

న్యూ డైమన్షన్: బీజేపీ వైపు ఆదిలాబాద్ ‘రెడ్డి’ చూపు

bjp flag

ఆదిలాబాద్ నియోజకవర్గంపై దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన ‘రెడ్డి’ వర్గానికి ప్రస్తుతం ప్రాముఖ్యత లేకుండాపోయింది. ఇది జీర్ణించుకోలేకపోతున్న రెడ్డి వర్గం వేరు వేరు పార్టీల్లో ఉన్నా ఏకమవుతూ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ లో వీరి ఆటలుసాగేలా కనిపించకపోవడంతో ఇప్పుడు బీజేపీ వైపు దృష్టి సారించారు.

 అక్కడ బీసీలను పక్కకు తప్పించి, వచ్చే ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని బరిలో నిలిపి గెలిపించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇదే క్రమంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు బీజేపీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది. దీని వెనక రెడ్డి వర్గీయులు ఉన్నది మాత్రం స్పష్టం.

గత ఎన్నికలలో పాయల శంకర్ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు. రెండుసార్లూ ఓటమిని చవి చూసినా రెండో స్థానంలో మాత్రం నిలువగలిగారు. దశాబ్ద కాలం క్రితం పాయల శంకర్ బీజేపీలో చేరిన తర్వాత ఆయనకు అధిక ప్రాధాన్యత లభించింది. దీంతో రెండు, మూడు దశాబ్దాల నుంచి బీజేపీలో ఉన్న సగానికి పైగా నాయకులు పార్టీని వీడారు.

అయితే వారికి అంత ప్రజాదరణ లేకపోవడం, పాయల శంకర్ కు ప్రజల్లో కొంతైనా ఆదరణ ఉండడంతో అధిష్టానం చూసీచూడనట్టు వ్యవహరించింది. అంతేకాకుండా పాయల శంకర్ ను జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతోపాటు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆయన సూచించిన వారికే అధిష్టానం టికెట్లు అప్పగించింది.

పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి విజయదుందుభి మోగించిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావించింది. అందుకనుగుణంగా ప్రణాళికలు సైతం రూపొందించారు. అయితే ఈ ఎన్నికల్లో 11 స్థానాలు గెలిచి రెండో స్థానంలో నిలిచింది.

గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పట్టణం నుంచి వచ్చిన ఓట్లుసైతం రాబట్టుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నిరసన గళం వినిపించడానికి కొందరు సిద్ధమయ్యారు. మొట్ట మొదటగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి నిరసన గళం వినిపించారు. ప్రెస్ మీట్ పెట్టి పాయల శంకర్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. గెలిచే అవకాశం లేకున్నా.. తనకు ఇష్టం వచ్చిన వారికే, తనకు నచ్చిన వారికే టికెట్లు ఇచ్చారని ఆరోపించారు.

అయితే అధిష్టానం నుంచి ఎలాంటి కదలిక లేకపోవడంతో ఇటీవల మళ్లీ పాయల వ్యతిరేక వర్గీయులను వెంటబెట్టుకొని పదుల సంఖ్యలో వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ను కలిసి పాయల శంకర్ పై ఫిర్యాదు చేశారు. అతడిని వెంటనే బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని,లేకుంటే బీజేపీ పరిస్థితి మరింత దిగజారుతుందని చెప్పారు.

ఆదిలాబాద్ నియోజకవర్గంలో రెడ్డి వర్గీయుల ఆధిపత్యం రోజురోజుకు తగ్గిపోతోంది. 1978 నుంచి 2009 వరకు రెడ్డి వర్గీయులు ఆధిపత్యం వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మాజీ మంత్రి సి. రాంచంద్రారెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు.

1978, 1985లో రెండుసార్లు ఇండిపెండెంట్ గా, 1989, 2004లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. అంతేకాకుండా సి. వామన్ రెడ్డి ఒకసారి ఇండిపెండెంట్ గా, మరోసారి తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. అయితే 2009లో జోగురామన్న గెలిచాక రెడ్డి వర్గీయుల ఆధిపత్యం తగ్గుతూ వచ్చింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏసీఎన్ ఛానెల్ నిర్వాహకుడు ప్రకాష్ రెడ్డిని టీఆర్ఎస్ నుంచి ఎన్నికల బరిలో నిలిపినా గెలిపించుకోలేకపోయారంటే రెడ్డి వర్గీయుల ఆధిపత్యం ఎంత మేర తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

అంతేకాకుండా అక్కడ ఇండిపెండెంట్ వ్యక్తి చేతుల్లో ఓడిపోవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల్లోనూ బీసీల ఆధిపత్యం కొనసాగుతోంది. టీఆర్ఎస్ లో జోగురామన్న, కాంగ్రెస్ లో గండ్రత్ సుజాత, బీజేపీలో పాయల శంకర్ ఉన్నారు. అయితే కాంగ్రెస్ భవిష్యత్తులో గెలిచే పరిస్థితులు లేవని రెడ్డీ వర్గీయులు అంచనా వేశారు.

 అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా టీఆర్ఎస్ నుంచి రెడ్డి వర్గీయులకు ఎలాగూ టికెట్టు దక్కే అవకాశాలులేవు. దీంతో ఇప్పుడు బీజేపీ వైపు దృష్టి సారించారు.

బీజేపీలో చేరిన పాయల శంకర్ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకున్నారే తప్ప.. పార్టీని అభివృద్ధి చేయలేదని చెబుతున్నారు. అందుకు సుహాసిని రెడ్డిని ముందుకు తెచ్చారు. సుహాసిని రెడ్డి కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. అయితే కొన్నాళ్ల పాటు ఆమె మౌనంగా ఉన్నారు.

2009లో టీఆర్ఎస్ టికెట్టు ఆశించినా.. పొత్తుల్లో భాగంగా ఈ స్థానం టీడీపీకి కేటాయించడంతో నిరసన తెలుపుతూ ఆమె ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు. ఓడిపోవడంతో కొన్నాళ్లు క్రియాశీలక రాజకీయాలకుదూరంగా ఉన్నారు. మళ్లీ బీజేపీలో చేరి ఇప్పుడిప్పుడే మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో పాయల శంకర్ బీజేపీలో ఉంటే టికెట్టు దక్కే అవకాశాలు లేకపోవడంతో నాలుగేళ్ల ముందు నుంచే ప్రణాళికలు రూపొందించారు. ఆయనపై ఫిర్యాదు చేస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనే దానిపై రెడ్డి వర్గీయుల ప్రణాళికలు, ముందడుగులు ఆధారపడి ఉంటాయి.

Related posts

కెమికల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన మరో వాహనం

Bhavani

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

Bhavani

అటు రైతుకు ఇటు పేదవాడికి సాయం చేసిన కిషన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment