29.7 C
Hyderabad
May 7, 2024 06: 42 AM
Slider ప్రత్యేకం

ధన ప్రవాహంలో హుజూరాబాద్ ను మించిన మునుగోడు

#cash

హుజూరాబాద్ ఉప ఎన్నికను మించి ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ ఈ ఉపఎన్నికలో గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని చమటోడుస్తున్నాయి.

అధికార టీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను మంత్రులను మునుగోడు ప్రచారంలోకి దింపింది. అంతే స్థాయిలో బీజేపీ తన బలాలను మోహరించింది. కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ మూడు పార్టీలకూ ప్రతిష్టాత్మకం కాగా డబ్బు వరదలా పారింది. ఇప్పుడు మునగోడు నియోజకవర్గంలో హుజూరాబాద్ ను మించిన ఖర్చుకు రాజకీయ పార్టీలు తెగపడుతున్నాయి.

కార్లు, ద్విచక్ర వాహనాల ఆశ చూపి నేతలను, డబ్బులు ఆశ చూపి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి బీజేపీ పన్నాగం పన్నిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టినా…బీజేపీకి ఓటమి తప్పదని హరీశ్‌రావు అన్నారు. అయితే అధికారం ఉపయోగించుకుని కోట్లు సంపాదించిన టీఆర్ఎస్ నాయకులు డబ్బులు, మద్యం విచ్చల విడగా వెదజల్లుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఓటుకు 30 వేల రూపాయల వరకూ ఖర్చు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేస్తోంది. పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. స్రవంతికి మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సహా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రచార బరిలోకి దిగారు. చౌటుప్పల్‌ మండలంలోని పలు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించిన రేవంత్‌ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.

డబ్బు సంచులతో వచ్చే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఓటర్లను కోరారు. ఓటుకు డబ్బులు ఇస్తామని చెబుతారు అవి ఎక్కడ నుంచి వచ్చాయో మునుగోడు ప్రజలు తెలుసుకోవాలి. పిల్లికి బిచ్చమైన పెట్టని వారు ఇప్పుడు ఇంత మొత్తంలో డబ్బులు ఇస్తానంటే ఎలా నమ్ముతున్నారు. మీకు అండగా నిలిచే పార్టీ కాంగ్రెస్​ పార్టీ. డబ్బులు తీసుకోండి  చప్పుడు కాకుండా కాంగ్రెస్ కు ఓటేసేసెయ్యండి అంటూ రేవంత్‌రెడ్డి ఓటర్లకు చెబుతున్నారు.

ప్రచార గడువు ముగిసేలోపు అగ్రనేతలను రంగంలోకి దింపేలా ప్రధాన పార్టీలైనా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మునుగోడులో సుమారు రెండు వేల మంది ఓటర్లకు ఒక మంత్రి లేదా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీకి బాధ్యత అప్పగించిన కేసీఆర్ మరోసారి స్వయంగా బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నెల 30న చండూరు మండలం బంగారిగడ్డ వద్ద కేసీఆర్​బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

నెలన్నర క్రితం అగస్టులో మునుగోడులో ప్రజాదీవెన పేరుతో బహిరంగ సభ నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ముగిసే రెండు రోజుల ముందు కేసీఆర్​ బహిరంగసభలో పాల్గొంటారని తెలిసింది. ఈ నెల 20 తర్వాత మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు చౌటుప్పల్, చండూరు పురపాలికలతో పాటూ మునుగోడులో రోడ్‌షోలలో పాల్గొంటారని సమాచారం. ఈ మేరకు పార్టీ క్యాడర్‌ ఏర్పాట్లు చేస్తోంది.

భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నాటి నుంచి మునుగోడులోనే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. దిల్లీ నుంచి అగ్రనేతను రంగంలోకి దించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులో 31న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బహిరంగ సభను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై భాజపా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ జాతీయ నేతలను సంప్రదించినట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఒక దఫా సభను నిర్వహించడంతో ఇప్పుడు జరిగే సభకు పార్టీ జాతీయధ్యక్షుడిని ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Related posts

గచ్చిబౌలి స్పోర్ట్స్ హాస్టల్లో అంబర్పేట కబడ్డీ ప్లేయర్ కు అవకాశం కల్పించండి

Satyam NEWS

కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం

Satyam NEWS

నీటిని పొదుపుగా వాడాలి.. భావి త‌రాల‌కు అందించాలి

Satyam NEWS

Leave a Comment