28.7 C
Hyderabad
May 6, 2024 09: 27 AM
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ నవ’యువ’ సంకల్పం

#rahulgandhi

ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి కొత్తనెత్తురు ఎక్కించే పనిలో రాహుల్ ప్రభృతులు పడిపోయినట్లు కనిపిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు, సహకారం లేకపోయినా పార్టీని గెలుపు బాటలో ఎలా నడిపించాలో మాకు తెలుసు అనే సంకేతాన్ని ఇచ్చే దిశగా రాహుల్ కదులుతున్నట్లు కొందరు విశ్లేషకులు భాష్యం చెబుతున్నారు.

మంచిదే, అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతూ దేశానికి పనికొచ్చే పనులు చేస్తామంటే కాదని ఎవరంటారు? ప్రతిపక్ష పార్టీగా తమవంతు బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించలేక పోయిందన్నది కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రధాన విమర్శ. ప్రతిపక్షం బలంగా లేకపోతే అధికారపక్షం ఏకస్వామ్యంతో వ్యవహరించే ప్రమాదం ఉందని,తద్వారా ప్రజాస్వామ్యానికి చెడు జరుగుతుందని ఎప్పుడో పెద్దలు చెప్పారు.

ఆ స్పృహ ప్రతి ప్రతిపక్షానికి ఉండాలి. ఎల్లకాలం ఎవ్వరూ అధికారంలో ఉండరు, ఏ పార్టీ ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదు. ప్రజాభిమానం, ప్రజాగ్రహం, కొన్ని ప్రత్యేక పరిస్థితులు జయాపజయాలను నిర్ణయిస్తాయని చరిత్ర చెబుతూనే ఉంది. ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు నిర్వహించిన ‘చింతన్ శివిర్’ సదస్సులు వేడివేడిగానే జరిగాయి. పలు కీలక సంస్కరణలకు అంకురార్పణ జరిగింది.

‘ఒకే కుటుంబం ఒకే టికెట్, ఒకే వ్యక్తికి ఒకే పదవి’అనే అంశాన్ని కొత్తగా తెరపైకి తెచ్చారు. యాభై ఏళ్ళ లోపు వారికి పార్టీలో ప్రాధాన్యం కల్పించాలనే నిర్ణయం కూడా మంచిదే. ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులకు సెలవివ్వాలని యువనాయకుడు రాహుల్ చేసిన ఆలోచన మంచిదే కానీ, కురువృద్ధులను విస్మరిస్తే ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. పాతతరం వృద్ధనాయకులతో జాగ్రత్తగా మెసులుతూ, అవసరమైన సందర్భాలలో వారి అనుభవాలను, జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం.

చింతన్ శివిర్ లో 20 తీర్మానాలు

ఇప్పటికే గ్రూప్ -23 ద్వారా కొంత గందరగోళం జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే ఈవిఎం లు రద్దు చేస్తామని, వాటి స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్ల వ్యవస్థను మళ్ళీ తీసుకువస్తామని కాంగ్రెస్ అంటోంది.దీనిపై ఇంకా సుదీర్ఘమైన చర్చలు, పరిశోధనలు జరగాల్సి ఉంది. చింతన్ శివిర్ లో (చింతన శిబిరం) మొత్తం 20 ప్రతిపాదనాలను రూపొందించారు. ఒకే పదవిలో ఒకరు ఇదేళ్ల కంటే ఎక్కువగా కొనసాగకూడదని,కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు.

ఇది కూడా స్వాగతించ తగినదే కానీ, ఆచరణలో సాధ్యాసాధ్యాలను చూసుకోవాలి. ప్రజల్లో మమేకమయ్యే దిశగా పాదయాత్రలు, జనతా దర్బార్ లు నిర్వహిస్తామంటున్నారు. దీని ద్వారా కాంగ్రెస్ వైపు కొంత అలజడి పెరగవచ్చు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ‘భారత్ జోడో యాత్ర’ నిర్వహిస్తామని ప్రకటించారు.

దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని , పరిష్కార మార్గాలను కనిపెట్టడం పాలకుల, నేతల బాధ్యత. నేతలకు ప్రజాసమస్యలపై అవగాహన కలగడమే కాక,ప్రజల్లో ధైర్యవిశ్వాసాలను నింపినవారవుతారు. ఇప్పటి వరకూ ప్రజాయాత్రలు, పాదయాత్రలు చేసిన ప్రతి నాయకునికీ ఓట్ల రూపంలో ప్రజలు మంచి ఫలితాలనే కానుకగా ఇచ్చారు.

బ్లాక్ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ వరకూ 50శాతం యువతకు ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ,మైనారిటీ వర్గాలకు ప్రాముఖ్యతను కల్పించడం ప్రజాస్వామ్యబద్ధమైన నిర్ణయమే.పార్టీలో కొత్తగా మూడు విభాగాలను నిర్మాణం చేస్తున్నారు.

(1) ప్రజా సమస్యలు

(2)ఎన్నికల మేనేజ్ మెంట్

(3) శిక్షణ.

ఇవి శాస్త్రీయంగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న ప్రశాంత్ కిషోర్ ముందుగా పార్టీకి కొన్ని సూచనలు, సలహాలను అందించారు. తమ బృందం చేసిన అధ్యయనాలు, పరిశోధనలను కూడా అధినాయకులకు తెలియజేశారు.

ఉదయ్ పూర్ లో మూడు రోజులపాటు జరిగిన సదస్సులో తీసుకున్న నిర్ణయాలు,రాహుల్ గాంధీ దూకుడుపై ప్రశాంత్ కిషోర్ ఆలోచనల ప్రభావం ఏమైనా ఉందా? అనే చర్చ జరుగుతోంది. ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలను తేవడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధమవ్వడాన్ని ఎవరూ కాదనరు.

అదే సమయంలో, వారు పరిపాలన చేసినప్పుడు చేసిన తప్పులను కూడా సమీక్షించుకుంటే మంచిది. ప్రస్తుత వాతావరణంలో, నరేంద్రమోదీ నాయకత్వంలోని బిజెపిని గద్దె దించడం ఆషామాషీ విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ మొదలు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిర్వీర్యమై పోయింది.

ఆంధ్రప్రదేశ్ లో సోదిలో లేకుండా పోయింది. పార్టీ శ్రేణుల్లో,ప్రజల్లో పార్టీ పట్ల, నాయకత్వం పట్ల తిరిగి విశ్వాసాన్ని ప్రోది చేసుకోవడం కాంగ్రెస్ కు ఎదురుగా ఉన్న పెద్ద సవాల్.2014 నుంచి ఇప్పటి వరకూ ఆ పార్టీకి అన్నీ వైఫల్యాలే. తాజాగా పంజాబ్ లో కూడా అధికారాన్ని కోల్పోయింది.

పంజాబ్ ఓటమి కూడా పెద్ద గుణపాఠం. ఇప్పటికైనా మేలుకొని,దేశభక్తితో మెలిగి, అవినీతి ముద్రను పోగొట్టుకుంటే ఎంతోకొంత ప్రగతి ఉంటుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి వయసు రీత్యా చాలా భవిష్యత్తు ఉంది. చరిత్ర సృష్టించిన మహామహులతో కళకళలాడిన కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటారా? జ్ఞాపకాల్లో కలిపేసుకుంటారా? అంతా వాళ్ల ‘హస్తం’లోనే ఉంది. మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

72వ ఏట అడుగుపెట్టిన భారత రిపబ్లిక్

Satyam NEWS

(2022) How Does Benicar Lower Blood Pressure 10 Home Remedies For High Blood Pressure

Bhavani

(Free|Trial) Fruit And Plant Weight Loss Pills Side Effects

Bhavani

Leave a Comment