28.7 C
Hyderabad
May 5, 2024 10: 01 AM
Slider ఖమ్మం

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం

#Congress government

బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంకా నాలుగు నెలలు మాత్రమే మిగులుందని… కేసీఆర్ మాయమాటలకు కాలం చెల్లిందని… రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రాష్ట్రంలో ఎగురనుందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్, ఎన్నికల కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

ప్రచార కమిటీ కో ఛైర్మన్ గా ఎన్నికై తొలిసారిగా అశ్వారావుపేట నియోజకవర్గానికి విచ్చేసిన పొంగులేటికి తొలుత భారీ కార్ల ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అనేక మంది పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

అశ్వారావుపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈనెల ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సమావేశం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం సభను విజయవంతం కాకుండా చేసేందుకు విఫలయత్నం చేశారన్నారు.

ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు పెట్టినా తమ సభను విజయవంతం చేసిన కాంగ్రెస్ శ్రేణులకు తెలిపారు. బంగారు తెలంగాణ సాధిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ కి కృతజ్ఞతగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలను కానుకగా ఇవ్వాలని ఆయన అన్నారు.

ఒకప్పుడు శ్రీనివాసరెడ్డి కొందరికి నాయకుడని కాంగ్రెస్ లో చేరాక ఇప్పుడు అందరివాడయ్యాడని, పాత, కొత్త కార్యకర్తలు అందరూ కలివిడిగా కలిసి పనిచేయాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతున్నారన్నారు. నాయకులు అలుపు లేకుండా పోరాడి రాష్ట్రంలో కాంగ్రెస్ ని అధికారంలోకి తెస్తే, తెలంగాణలో రామరాజ్యం ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.

కాంగ్రెస్ లో ఒకటే గ్రూప్ ఉందని అది రాహుల్ గాంధీ గ్రూప్ అని ఆయన అన్నారు. మైనార్టీలకు మేలు జరిగింది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అని, కులమతాలకు అతీతంగా కాంగ్రెస్ పాలన సాగుతుందన్నారు. బీజేపీ కి బీఆర్ఎస్ బీ టీమ్ అని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బయటకు కొట్టుకున్నట్టు నటించినా లోపల ఇద్దరూ ఒకటే అని విమర్శించారు.

కాంగ్రెస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి జరిగితే తానే ప్రత్యక్షంగా వచ్చి కార్యకర్తలకు అండగా నిలుస్తానని ఆయన కార్యకర్తలకు అభయం ఇచ్చారు. కొంతమంది పోలీస్ అధికారులు ప్రభుత్వానికి తాబేదార్లుగా పనిచేస్తున్నారని, అధికారం ఎవడబ్బా సొత్తు కాదని, నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.

Related posts

జగన్ పదవిపై మరో సంచలన ట్విట్ చేసిన పీవీపీ

Satyam NEWS

ఖమ్మం ప్రజల అకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా

Satyam NEWS

ప్రేమకోసం దొంగగా మారాడు

Murali Krishna

Leave a Comment