40.2 C
Hyderabad
May 2, 2024 18: 15 PM
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్‌లో వివాదాలకు విరామం

#congress

రాష్ట్ర కాంగ్రెస్‌లో వివాదాలకు తెరదించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ దిశగా ప్రత్యేకంగా దృష్టి సారించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నాయకుల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలపై పట్టున్న నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్‌కు సమన్వయ బాధ్యత అప్పగించారు.మంగళవారం మల్లికార్జున ఖర్గే సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకు ఫోన్‌చేసి మాట్లాడారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లేలా అన్ని చర్యలు తీసుకుంటామని, అంతవరకూ ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని వారించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డితో దిగ్విజయ్‌సింగ్‌ మాట్లాడారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ రెండు రోజుల్లో రాష్ట్రానికి రానున్నారు. పార్టీ నేతల మధ్య సమన్వయమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డితో పాటు సీనియర్‌ నాయకులతోనూ భేటీ కానున్నారు.

ప్రధానంగా రేవంత్‌ వైఖరితో పాటు ఇటీవల నియమించిన కమిటీలపై సీనియర్‌ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, జగ్గారెడ్డి, మధుయాస్కీ సహా ఇతర సీనియర్‌ నాయకులు కొత్త కమిటీల ఏర్పాటు, రేవంత్‌ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి వీరు హాజరుకాలేదు. పార్టీలో సీనియర్లు, కొత్తగా చేరిన నేతల మధ్య విభేదాలు ఇతర పార్టీలకు అవకాశంగా మారుతుండటంతో పాటు, పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ఆలస్యం చేస్తే మరింత నష్టం జరుగుతుందని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావించింది. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, దిగ్విజయ్‌సింగ్‌లు సీనియర్‌ నేతలకు ఫోన్‌చేసి మాట్లాడారు. ఐతే వివాదం పూర్తిగా సమసిపోలేదని , విరామం మాత్రమేనని కొందరు నేతలు చెప్పారు.

Related posts

చేప ప్రసాదం పంపిణీ కి ఏర్పాట్లు పూర్తి

Bhavani

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాధిద్దాం

Satyam NEWS

హైదరాబాద్ నడిబొడ్డున తాగునీటి సమస్య తీవ్రం

Satyam NEWS

Leave a Comment