తల్లీకొడుకుల ప్రాణాలను డయల్ 100 కాల్ కాపాడింది. ఎస్సై రాజన్‌బాబు కథనం ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా గణపవరం మండలం చెల్పూరుకు చెందిన కొడగాని మౌనిక తన భర్తతో గొడవ జరిగిందని, తాను ఆత్మహత్య చేసుకుంటానని, అందుకు భర్త అనిల్ కారణమని డయల్ 100కు ఫోన్‌చేసి నిద్రమాత్రలు మింగింది. సమాచారం అందుకున్న గణపురం ఎస్సై రాజన్‌బాబు వెంటనే సిబ్బందితో చెల్పూరులోని ఆమె ఇంటికి వెళ్లారు.
అప్పటికే మూసి ఉన్న తలుపులను బలవంతంగా తెరిచారు. మౌనిక నిద్రమాత్రలు మింగి, తన రెండేళ్ల కొడుకుతో కూడా మింగించి మత్తులోకి జారుకుంది. ఆమె పరిస్థితిని చూసిన పోలీసులు తమ వాహనంలో సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే చికిత్స చేయించడంతో తల్లీకొడుకులు సురక్షితంగా బయటపడ్డారని ఎస్సై రాజన్‌బాబు విలేకరులకు తెలిపారు. ఎలాంటి ఆపదలో ఉన్నా ఆత్మహత్య చేసుకోవద్దని, ఆపదలొస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు.