కూలి డబ్బులు అడిగితే కొట్టి చంపుతారా? కొల్లాపూర్ మండలం చింతపల్లి గ్రామంలో ఒక వ్యక్తి మాత్రం అలానే చేశాడు. చిన్న నర్సింహులు అనే వ్యక్తి కూలి పని చేసుకునేవాడు. ఆ గ్రామంలో నాగ శేషు అనే వ్యక్తి వద్ద పని చేశాడు. తనకు కూలి డబ్బులు ఇవ్వాలని చిన్ననర్సింహులు నాగ శేషును అడిగాడు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ మాటల యుద్ధం చినికి చినికి గాలి వాన అయినట్లు కొట్టుకోవడం ప్రారంభించారు. మద్యం మత్తులో ఉన్నారో ఏమో కానీ ఇద్దరూ తీవ్రంగా కొట్టుకున్నారు. నాగ శేషు బలంగా కొట్టి పక్కకు నెట్టడంతో చిన్న నర్సింహులు అక్కడికక్కడే మరణించాడు. ఒక్క సారిగా ఈ సంఘటన జరగడంతో నాగ శేషు హతాశుడయ్యాడు. దాంతో నాగ శేషు పై నర్సింహులు అన్న కొడుకు కురుమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బాబాయిని నాగ శేషు కొట్టి చంపాడని అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో నాగ శేషు పై పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలో సంచలనం సృష్టించిన ఈ కేసును కొల్లాపూర్ సిఐ బి వెంకట్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.