ఈ దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజును ప్రజలు మంచి మహుర్తంగా భావిస్తున్నందున ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ధరణి పోర్టల్ ను ఆరోజు ప్రారంభిస్తారు.
ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈ లోపుగానే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ధరణి పోర్టల్ కు అవసరమైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, బ్యాండ్ విడ్త్ లను సిద్ధం చేయాలని చెప్పారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్ చేయడం, ధరణి పోర్టల్ కు వివరాలను అప్ డేట్ చేయడం తదితర అంశాలపై, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు సిఎం వెల్లడించారు.
డెమో ట్రయల్స్ కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి మండలానికి ఒకరు చొప్పున, ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ల నియోమకాన్ని పూర్తి చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.
ధరణి పోర్టల్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించనున్నట్లు సిఎం చెప్పారు. అదే రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయి అన్నారు.
తహశీల్దారు కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలోడాక్యుమెంట్ రైటర్స్ కు లైసెన్సులు ఇచ్చి వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటా ధరణి పోర్టల్ లో ఎంటర్ చేయాలని అధికారులను కోరారు.
ఆ తర్వాత జరిగే మార్పులు చేర్పులు వెంటవెంటనే నమోదు చేయడం జరుగుతుందని సిఎం చెప్పరు. దసరా రోజున పోర్టల్ ప్రారంభిస్తునందున అదే రోజు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం అవుతాయని సిఎం చెప్పారు. ఈ లోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు కానీ, ఎలాంటి రెవెన్యూ వ్యవహారాలు కానీ జరగవని స్పష్టం చేశారు.