29.7 C
Hyderabad
May 7, 2024 06: 03 AM
Slider నిజామాబాద్

ధాన్యం రైతుల మహాధర్నా: మూడు గంటల పాటు ఆందోళన

#kamareddy

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లోడింగ్ చేసిన ధాన్యం రైస్ మిల్లర్లు తీసుకెళ్ళకుండా ఉంచడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం చెప్పిన దానికన్నా మిల్లర్లు ధాన్యాన్ని ఎక్కువగా తూకం చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యాన్ని తిప్పి పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిని దిగ్బంధించి రాస్తారోకో చేపట్టారు.

సుమారు మూడు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా రైతులు పట్టు వీడలేదు. మూడు గంటల పాటు పోలీసులకు చుక్కలు చూపించారు. ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకుని అక్కడికి తహసీల్దార్ వచ్చినా రైతుల ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆందోళన కొనసాగించారు. మూడు గంటల పాటు రైతులు ఆందోళన చేపట్టడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు రైతుల్ని ఎంత సముదాయించినా వినిపించుకోకపోవడంతో రైతులను పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు.

దాంతో రైతులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో రైతులను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు జీపులో పడేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రైతులను లాక్కెళ్లి జీపులో వేసే క్రమంలో రైతులు ప్రతిఘటించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులంటే అంత చులకనా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తహసీల్దార్ ను రైతులు నిలదీశారు. తహసిల్దార్ కలుగజేసుకుని సివిప్ సప్లయ్ అధికారులను పిలిపించగా రైతులతో మాట్లాడారు. రైతుల సూచన మేరకే ధాన్యం తూకం వేస్తామని, ధాన్యం రిటర్న్ రాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

అసలేం జరిగింది

మండలంలోని ఫరీద్ పేట, వాడి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన తూకం మోసాలను దృష్టిలో ఉంచుకుని రైతులే ముందస్తుగా ప్రభుత్వ సూచనల ప్రకారం బస్తాకు 41.5 కిలోలు కాకుండా 42 కిలోల చొప్పున తూకం చేయాలని, ఒక్క బస్తా ధాన్యం కూడా మిల్లర్ల నుంచి తిరిగి రావద్దని ముందుగానే నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఒక్క బస్తాకు 42 కిలోల చొప్పున తూకం వేస్తున్నారు.

అయితే శనివారం బస్తాకు 42 కిలోల చొప్పున కాంటా చేసి లోడింగ్ చేసిన ధాన్యం వాహనం కొనుగోలు కేంద్రం నుంచి కదలలేదు. సెంటర్ నిర్వాహకుడు ఒకరు 43 కిలోలు ఉంటేనే తూకం వేయాలని రైస్ మిల్లర్లు చెప్తున్నారని ఫరీద్ పేట వ్యవసాయం వాట్సాప్ గ్రూపులో మెసేజ్ చేశారు. దాంతో రైతులంతా ఆందోళనకు దిగారు. 43 కిలోలు ఉంటేనే ధాన్యం తీసుకుంటారట అని అంతటా ప్రచారం సాగడంతో రైతులు పెద్దఎత్తున పాల్వంచ రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు.

తహసీల్దార్ తో రైతుల వాగ్వాదం

పోలీసులకు చుక్కలు చూపించిన రైతులు

తూకం వేసిన ధాన్యం లారీ వెళ్లకపోవడంతో రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మూడు గంటల పాటు రహదారిని దిగ్బంధించారు. దాంతో పోలీసులు పెద్ద ఎత్తున పాల్వంచ వద్దకు చేరుకుని ధర్నాకు విరమింపజేసే ప్రయత్నం చేసినా కుదరలేదు. చివరికి రైతులను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు జీపులో ఎక్కించడంతో అరెస్ట్ చేస్తారేమోనని భావించి రైతులు పోలీసుల తీరుని తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. పోలీసులను అడ్డుకున్నారు. పోలీసు వాహనానికి అడ్డుగా పడుకునే ప్రయత్నం చేశారు. ‘ఏం తప్పు చేశామని తమను జీపులో ఎక్కిస్తున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తారా..?’ అంటూ పోలీసులను నిలదీశారు. రైతులంతా ఏకం కావడంతో పోలీసులు వెనక్కితగ్గారు.

ఇంకెన్నాళ్లు నష్టపోవాలి..?

తూకం పేరుతో తాము ఇంకెన్నాళ్లు నష్టపోవాలి అని రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక బస్తాకు 41.5 కిలోలు ధాన్యం తూకం వేయాలని నిబంధనలు పెట్టినా ధాన్యం తరుగు రావద్దన్న ఉద్దేశ్యంతో తామే మరొక అరకిలో ఎక్కువగా 42 కిలోల తూకం వేస్తున్నామన్నారు. అయినా మిల్లర్లు ధాన్యం వెనక్కి పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. 43 కిలోలు ఉంటేనే లోడింగ్ చేయాలంటూ సెంటర్ నిర్వాహకులకు చెప్పడం ఏంటని నిలదీశారు. రైతు అనే వారు లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు.

Related posts

మెగా ఫ్యాన్స్ కి ఇక పూనకాలే

Satyam NEWS

అక్షరాలా అమ్మ

Satyam NEWS

నడిరోడ్డుపై నాగుపాము… నిలిచిపోయిన ట్రాఫిక్

Bhavani

Leave a Comment