28.7 C
Hyderabad
May 5, 2024 10: 41 AM
Slider ప్రత్యేకం

కారు… కమలం మధ్య నలుగుతున్న వడ్ల గింజ

#cmkcr

తెలంగాణలో కమల దళం బలం పెంచుకునేందుకు తాజాగా రాజకీయ దుమారం రేపుతున్న ధాన్యం కొనుగోలు వ్యవహారం కేంద్ర బిందువు కానున్నదా? అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ధాన్యం కొనుగోళ్ల  విషయంలో ఇటు టీ ఆర్ ఎస్ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలు గందరగోళం సృష్టిస్తున్నాయి.

చివరి ధాన్యం గింజ వరకు కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ…కానీ సేకరించిన బియ్యం తరలింపులో కేంద్రం నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెరాస ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేంద్రం పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సహకరిస్తున్నా తెరాస ఉద్దేశ పూర్వకంగానే కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్న ట్లు కమల నాధులు ఎదురుదాడి చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం గత రబీకి సంబంధించి భారత ఆహార సంస్థ కు అందించాల్సిన 27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వకుండా, వారి చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడానికి తప్పుడు మాటలు మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన రైతులను, ప్రజలను భ్రమలకు గురిచేస్తున్నారని కేంద్ర ఆహార , ప్రజా పంపిణీ వ్యవహార శాఖా మంత్రి పీయూష్ గోయెల్ విమర్శించారు.

తెలంగాణ రైతులను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ సూచనమేరకు అవసరమైన సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఎఫ్ సీ ఐ కి ఇవ్వాల్సిన బియ్యం ఇప్పటికీ ఇవ్వకపోగా కేసీఆర్ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెరాస ప్రభుత్వం తీరుపట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీ ఆర్ ఎస్ ప్రభుత్వ వైఫాల్యాలు, విధానాలపై పోరాడాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు.

ఇదిలా ఉండగా.. కేంద్ర మంత్రి పీయూష్ గొయెల్ ని కలిసిన రాష్ట్ర మంత్రులు , ఎంపీల బృందం వాదన మరోలా ఉంది. ధాన్యం సేకరణపై కేంద్రం లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని వారు గట్టిగా వాదిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలానికి సంబంధించి కేంద్రం విధించిన లక్ష్యం మేరకు 60 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చివరి దశలో ఉన్నందున అదనపు ధాన్యం సేకరణపై కేంద్రప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని వారు కోరుతున్నారు.

మిల్లింగ్ చేసిన బియ్యాన్ని గోదాముల నుంచి తరలించడంలో ఎఫ్ సీ ఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రుల బృందం కేంద్రమంత్రికి వివరించారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఇదేవిషయంపై విమర్శిస్తోంది. తెరాస, బీజీపీ నేతలు కలిసి నాటకాలు ఆడుతూ రైతులను మోసం చేస్తున్నారని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రెండింటినీ దుయ్యబడుతోంది.

మధ్యన దూరి విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్

ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు ఆత్మహత్య లకు పాల్పడుతుంటే తెరాస,భాజపా చోద్యం చూస్తున్నాయని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది.

తెలంగాణలో తెరాస,బీజీపీ లకు ప్రధాన శత్రువు కాంగ్రెస్. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలం పెంచుకునే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అనుకూలంగా ఉన్నట్లు ఇటీవలి ఎన్నికలు ఋజువుచేశాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని వై ఎస్ ఆర్ సీ పీ కేంద్రంతో స్నేహం పూర్వకంగానే వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెదేపా కంటే వై ఎస్ ఆర్ సీ పీ తో చెలిమి శ్రేయస్కరమని భాజపా నమ్ముతోంది. తెలంగాణ లో పరిస్థితులు వేరు. కేంద్రం ఎంతగా సహకరిస్తున్నా తెరాస కొన్ని సందర్భాలలో కేంద్రంపై విరుచుకుపడడంతో తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని భాజపా ఆశిస్తోంది. ఈ అంశానికి ఊతం ఇస్తూ రాష్ట్రంలో తెలంగాణ గ్రాఫ్ క్రమంగా పెరుగుతూ ఉండడం ఆ పార్టీకి అనుకూలంగా కనిపిస్తోంది.

అందుకే…ప్రభుత్వ అవినీతిని ప్రశ్నంచాలని, తద్వారా తెరాస ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అధిష్టానం పావులు కదుపుతోంది. కేంద్రం పెత్తనం పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి  మమతా బెనర్జీ ప్రతిఘటిస్తూ దూసుకు వెళ్తున్న తరహాలోనే ముందుకు సాగాలని తెరాస పార్టీ సిద్ధం కావడం కేంద్రానికి మింగుడు పడటంలేదు.

తెలంగాణ రాష్ట్రంలో భాజపా ఆకర్షక్ కార్యక్రమం త్వరలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది తెరాస ద్వితీయ శ్రేణి నేతలు భాజపా లో చేరడానికి సిద్ధపడినట్లు వినికిడి. ఈటెల రాజేందర్ నాయకత్వంలో తెరాస ను బలహీనం చేయడానికి అధిష్టానం తెరాస ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించింది.

సమీప భవిష్యత్తులో తెలంగాణ లో భాజపా జెండా ఎగిరేందుకు చేపట్టాల్సిన సామ, దాన, భేద, దండో పాయాలకు కేంద్ర కమిటీ వ్యూహరచన చేస్తోంది. తెరాస, కాంగ్రెస్, భాజపా పార్టీల ఎత్తులు, పై ఎత్తులతో తెలంగాణ సమాజం ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కోవాలో కాలమే నిర్ణయిస్తుంది.

పొలమరశెట్టి రమాకృష్ణారావు

Related posts

బండి దమ్ముంటే ఢిల్లీలో మిలియన్ మార్చ్ పెట్టు

Satyam NEWS

ఏడాది పొడుగునా పివి శత జయంతి వేడుకలు

Satyam NEWS

ఆర్ఎస్ యు 5వ మహాసభల కరపత్రం విడుదల

Satyam NEWS

Leave a Comment