28.7 C
Hyderabad
May 6, 2024 07: 37 AM
Slider చిత్తూరు

రోజా ఈ సారి ఓడిపోవడం ఖాయం… ఎందుకంటే…

#roja

మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం తరువాత చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి బలమైన నేత  లభించలేదు. రద్దయిన పుత్తూరు నియోజకవర్గం నుండి ఆయన అయిదు పర్యాయాలు, నగరి నుండి ఒక సారి విజయం సాధించారు. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ,  ప్రజల మనిషిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రతిపక్షాలను విమర్శలతో ఇరుకున పెట్టడంలో ఆయన సిద్దహస్తుడు.

ముద్దుకృష్ణమ నాయుడు మీద ఒకసారి, అయన కుమారుడు గాలి భానుప్రకాష్ మీద మరోసారి నగరి నుండి YCP అభ్యర్థిగా రోజా వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. అయితే రోజాకు క్రమంగా నియోజకవర్గంలో వ్యతిరేకత పెరుగుతున్న నేపధ్యంలోపై ఆమెపై పోటీ చేయడానికి టిడిపి నేతలు పోటీ పడుతున్నారు. శ్రీశైలం దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, నగరి మునిసిపల్ మాజీ చైర్ పర్సన్ కె జె శాంతి, ఆమె భర్త కె జె కుమార్ రోజాను తొలినుంచి వ్యతిరేకిస్తున్నారు. 

2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నగరి నుంచి పోటీ చేసిన రోజా టీడీపీ అభ్యర్ధి ముద్దు కృష్ణమ నాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలిచారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ పై 2708 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ సారి ఎలాగైనా నగరిలో రోజాను ఓడించాలని చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. దీని కోసం అనేక కోణాలలో పరిశీలనలు సాగిస్తున్నారు. రాబిన్ శర్మ బృందం కూడా వివిధ రకాల సర్వేలు చేస్తున్నది.

ఈ నేపథ్యంలో తిరిగి పోటీ చేయాలని ఇంచార్జి గాలి భాను ప్రకాష్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తాను తక్కువ తేడాతో ఓడి పోయానని, ఈ సారి తప్పకుండా విజయం సాధిస్తానని అంటున్నారు. ఆయనకు నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నాయి. అయితే భాను ప్రకాష్ ను సొంత తల్లి సరస్వతమ్మ, తమ్ముడు జగదీష్ వ్యతిరేకిస్తున్నారు. భానుప్రకాష్ ను వ్యతిరేకిస్తున్న  ఆయన తమ్ముడు జగదీష్ కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. ఆయనకు తన తల్లి మాజీ ఎమ్మెల్సీ సరస్వతమ్మ ఆశీస్సులు ఉన్నాయి. అలాగే కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు అండదండలు ఉన్నాయి. వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతూ ఎప్పుడూ ప్రజల్లో ఉంటున్నారు. ప్రజల మనిషిగా జగదీష్ కు ప్రజల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

కాగా పుత్తూరుకు చెందిన పోతుగుంట విజయబాబు కూడా టిక్కెట్టు కోసం చాపకింద నీరులా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గతంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు బాధ్యత నిర్వహించారు. 2014 ఎన్నికల్లో నగరి నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా గాలి ముద్దుకృష్ణమ నాయుడు మీద  పోటీ చేశారు.

సిద్దార్థ విద్యా సంస్థల అధిపతి కొండూరు అశోక రాజును బరిలో దింపితే మంచిదని ఒక వర్గం భావిస్తోంది. ఇక్కడ రాజుల సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయని అంటున్నారు. గతంలో దొరస్వామిరాజు నగరి నుండి తెదేపా తరపున పోటీచేసి విజయం సాధించారు.  అశోక రాజు గతంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.  అశోక రాజు సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలను చైర్మన్ గా ఉన్నారు. టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి తాను లేదా తన కుమారుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరారు.

సుధాకర్ రెడ్డి 1983లో పుత్తూరు నుంచి జనతా అభ్యర్ధిగా పోటీ చేశారు. మాజీ మంత్రి రెడ్డివారి చెంగా రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో రెడ్డివారి చెంగా రెడ్డి నగరి నుండి అయిదు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. హర్షవర్ధన్ రెండు నెలల క్రితం లోకేష్ ను కలసి మాట్లాడారు. తరువాత ఆయన  తిరుపతి ఐఐటిలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా కూడా చేశారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ సంస్థ జాతీయ డైరెక్టర్ గా ఉన్నారు. రోజాపై పోటీకి ఇంత మంది పోటీ పడటం ఆసక్తి రేకెత్తిస్తోంది. నగరి నియోజక వర్గంలో రానున్న ఎన్నికలలో తెదేపా విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్టు, చిత్తూరు

Related posts

తీర్పు నేపథ్యంలో సోషల్ మీడియాపై పూర్తి నిఘా

Satyam NEWS

పట్టభద్రులు తమ ఓట్లను నమోదు చేసుకోవాలి

Satyam NEWS

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎస్పీ లకు జర్నలిస్టుల సత్కారం

Satyam NEWS

Leave a Comment