33.2 C
Hyderabad
May 3, 2024 23: 24 PM
Slider ప్రత్యేకం

మిర్యాలగూడతో పాటు వైరా ఇవ్వకపోతే ఒంటరిగానే పోటీ

#tammineni

కాంగ్రెస్‌ చెప్పినట్లుగానే మిర్యాలగూడతో పాటు వైరా అసెంబ్లీ సీట్లను సీపీఐ (ఎం)కు కేటాయించకపోతే లౌకిక శక్తులను కలుపుకొని విడిగా పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రెండురోజుల్లో ఏ నిర్ణయమైంది తెలపకపోతే తమ పార్టీ అధినాయకత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని, ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కు వచ్చేది ఉండదని హెచ్చరించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు.

లౌకికశక్తుల ఐక్యత కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే ప్రతిపాదన పెట్టారని, ఆ ప్రకారం తాము ముందుకు వెళ్తుంటే కాంగ్రెస్‌ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికీ పది సార్లు ఎన్నికలు జరిగితే దానిలో 8 సార్లు భద్రాచలం స్థానాన్ని సీపీఐ (ఎం) దక్కించుకుందన్నారు. అయినప్పటికీ తాము ఆ స్థానాన్ని త్యాగం చేస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడెం, భద్రాచలం, పాలేరు, మధిర, ఇబ్రహీంపట్నం స్థానాలను తమ పార్టీ కోరిందన్నారు.

ఈ స్థానాలు కాంగ్రెస్‌తో పొత్తు కోసమో…లేక ఇతర పార్టీలతో పొత్తుకోసమో ఎంపిక చేసినవి కాదు..తమకున్న బలం దృష్ట్యా వీటిని ఎంచుకున్నామన్నారు. కాంగ్రెస్‌ నాయకత్వం మొదటి నుంచి ఒక మాట స్పష్టం చేస్తూ వచ్చిందన్నారు. భద్రాచలం తమ సిట్టింగ్‌ స్థానం… అందరూ అమ్ముడుపోయినా సరే అక్కడి ఎమ్మెల్యే మాత్రం నిబద్ధతతో పార్టీకి కట్టుబడి ఉన్నారని చెప్పుకొచ్చిందన్నారు.

ఆయన సీటు మార్చడం తప్పుడు సంకేతాలిస్తుందని కాంగ్రెస్‌ చెప్పిందని, ఒకటి, రెండుసార్లు పట్టుబట్టినా వారు చెప్పిన దాన్ని గౌరవించామన్నారు. అప్పటికీ ఉదాహరణ చెప్పామని త్రిపురలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు తమ పార్టీ సిట్టింగ్‌ సీటును కోరితే ఇచ్చిన ఉదంతాన్ని కూడా ప్రస్తావించామన్నారు. అయినా సరే వారు పట్టుబట్టారు. దీంతో భద్రాచలం స్థానాన్ని వదిలేశామన్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కస్థానమైనా ఇవ్వాల్సిందిగా కోరుతూ పాలేరు సీటు అడిగామన్నారు.

ఒక దశలో వారు ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసినా…ఆ తర్వాత మీడియాలో లీక్‌లు ఇచ్చారు…ఈ వార్తలు కాంగ్రెస్‌ పార్టీ లీకుచేసిందా…! లేక పత్రికలు ఊహించి రాశాయా? తెలియదుగానీ తమ్మినేని వీరభద్రం పట్టుదలతోనే చర్చలు ఆలస్యమవుతున్నాయని ఓ పత్రికలో వార్తలు సైతం వచ్చాయన్నారు. తాజాగా మరో పత్రిక మిర్యాలగూడెం, వైరా రెండుస్థానాలు ఇస్తామంటే కూడా వైరాను కాదని పాలేరు కోసమే సీపీఐ(ఎం) పట్టుబడుతుందని మరో పత్రిక రాసిందని తెలిపారు. ఇవేవీ వాస్తవాలు కాదన్నారు.

27వ తేదీ ఉదయం పాలేరు సీటు ఇవ్వడం కుదరదని చెప్పి…కాంగ్రెస్‌ క్యాండిడేట్‌గా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రకటించిందన్నారు. అదేరోజు సాయంత్రం తమ పార్టీ కార్యదర్శివర్గ సమావేశం జరిగిందని తెలిపారు. దానిలో వైరా సీటును అంగీకరిద్దామనే నిర్ణయం జరిగిందని చెప్పారు. ఆ ప్రకారం మిర్యాలగూడెం, వైరా సీట్లను తీసుకోవడానికి సిద్ధమయ్యాయమన్నారు. దీనికంటే ముందు ఏఐసీసీ నాయకులు ఒకరు వైరా స్థానం నుంచి ఓ ఇండిపెండెంట్‌ పోటీ చేస్తారని, కానీ నచ్చజెప్పుతామని ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు.

27వ తేదీ రాత్రి ఆ ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రికి ఫోన్‌ చేసి వైరాకు అంగీకారం తెలిపామన్నారు. రేవంత్‌రెడ్డి, భట్టితో మాట్లాడిస్తామని ఆ నాయకుడు చెప్పారే కానీ ఆ తర్వాత ఏ ఒక్క నాయకుడు తనతో మాట్లాడలేదన్నారు. అయినప్పటికీ ఆదివారం ఉదయం తానే సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకు ఫోన్‌ చేసి వైరా తీసుకోవడానికి సిద్ధమని చెప్పానన్నారు. దానికి ఆయన స్పందిస్తూ మిర్యాలగూడతో పాటు ఇంకో సీటు ఎక్కడ ఇవ్వాలని ఆలోచిస్తున్నామని సమాధానం చెప్పారన్నారు. దీనిపై వైరా ఇస్తామని అన్నారు కదా..!

అంటే తాము ఎప్పుడూ అనలేదని ప్రతిసమాధానం చెప్పినట్లుగా తెలిపారు. దీనిపై తాము సీపీఐ(ఎం) ఇచ్చే సీట్ల విషయం చెప్పండని ప్రశ్నించామన్నారు. దానికి వారు మిర్యాలగూడెంతో పాటు హైదరాబాద్‌ సిటీలో ఓ సీటు ఇస్తామని చెప్పినట్లుగా తెలిపారు. తామెప్పుడూ హైదరాబాద్‌లో సీటు అడగలేదు కదా! అని ప్రశ్నించామన్నారు. దీనిబట్టి సీపీఐ(ఎం)తో పొత్తు పట్ల కాంగ్రెస్‌కు సీరియస్‌నెస్‌ లేదని అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ నాయకులు ఆలోచించుకోవాలన్నారు.

ఈ రాష్ట్రంలో బీజేపీ గానీ, బీజేపీ అనుకూల శక్తులేవీ గెలవొద్దని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ఆ ప్రాధాన్యతను గుర్తించి మిర్యాలగూడతో పాటు వైరా స్థానాన్ని ఇస్తే కాంగ్రెస్‌తో పొత్తుకు తాము సిద్ధమన్నారు. లేదంటే ఇంకా ఎన్నిమెట్లో దిగటం కుదరదన్నారు. భద్రాచలం నుంచి పాలేరు, అక్కడి నుంచి వైరా అన్నారు. ఇప్పుడు వైరా కూడా కాదంటే పొత్తు సాధ్యం కాదన్నారు. మరోవైపు మిర్యాలగూడ ఒప్పుకున్నా కాంగ్రెస్‌ అభ్యర్థిగా భావిస్తున్న ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారని తెలిపారు.

అది చూసి కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు తమ పార్టీ జిల్లా నాయకత్వానికి ఫోన్‌ చేసి వైరాలో తాము కూడా స్వతంత్ర అభ్యర్థిని పెడతామని చెప్పుతున్నట్లు పేర్కొన్నారు. అస్సలు నాయకులు సీట్లు ఇవ్వకుండా పక్కదారి పట్టించే యత్నం, ఆ నియోజకవర్గ స్థానిక నాయకులేమో మా నాయకులు సీట్లు ఇచ్చినా మీకు మేము ఎసరు పెడతామనే రీతిలో వ్యహరిస్తున్నారన్నారు. మిర్యాలగూడెం, పాలేరు రెండు ఇవ్వడం అవసరం…ఈ రెండిరటిలో పోటీ లేకుండా ఐక్యంగా గెలిపించాల్సిన అవసరం కూడా కాంగ్రెస్‌ నాయకత్వంపై ఉందన్నారు. కొందరు మీరైతే గెలవలేరని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌ ఓట్లేస్తే తామెందుకు గెలవమని ప్రశ్నించారు. సీపీఐ(ఎం) లేకుండా ఆ స్థానాల్లో కాంగ్రెస్‌ ఎలా గెలుస్తుందన్నారు. ఈ జిల్లాలో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం)కలిస్తే ఏంటో చూపించాలంటే ఆ పార్టీ నాయకత్వం ఇప్పటికైనా పునరాలోచించాలని కోరారు. ఆరకంగా జరగని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విడిగా పోటీ చేయడం మినహా మరో మార్గం లేదన్నారు. ఇవేవీ లేకుండా తమ వెంట రమ్మంటే తాము రాజకీయాల కోసం, రాజకీయ విధానం కోసం ఉన్నామన్నారు. తమ ఆర్గనైజేషన్‌ను కాపాడుకునే బాధ్యత తమపై ఉందన్నారు.

రాజకీయ విధానం, ఆర్గనైజేషన్‌ను కాపాడుకునే లక్ష్యంతో తప్పకుండా తాము ఆలోచన చేస్తామన్నారు. రేపటి వరకు చూసి, ఎల్లుండి రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం హైదరాబాద్‌లో ఉంటుందన్నారు. ఆ మరుసటి రోజే రాష్ట్ర కమిటీ మీటింగ్‌ ఉంటుందని, దీనికి పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరవుతారని తెలిపారు. ఈ లోపు ఏ సీట్లు అనేది కాంగ్రెస్‌ స్పష్టం చేయకపోతే ఆ సమావేశాల్లో ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఒక్కసారి నిర్ణయానికి వచ్చాక సీపీఐ(ఎం) వెనక్కు తగ్గేది ఉండదని తమ్మినేని స్పష్టం చేశారు.

Related posts

యూత్ కాంగ్రెస్ లో చేరండి ప్రజా సమస్యలపై పోరాడండి

Satyam NEWS

సర్వేలకు అందని రీతిలో తీర్పు

Bhavani

వార్నింగ్: నేను కంటి సైగ చేస్తే చాలు…

Satyam NEWS

Leave a Comment