30.7 C
Hyderabad
May 13, 2024 01: 07 AM
Slider నిజామాబాద్

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : పోచారం

#pocharam

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ద్వితీయ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో తాను టిడిపిలో ఉన్నానన్నారు.

ఉద్యమం సందర్బంగా జరంలిస్టులంతా ఏకమై ఆర్టీసీ భవన్ లో నిర్వహించిన సమావేశానికి తాను అనుకోకుండా వెళ్లానన్నారు. ఆ సమయంలో అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ అక్కడే ఉన్నారన్నారు. ఆ రోజు జరిగిన సభలోనే తెలంగాణ కోసం అవసరం అయితే తాను టిడిపి నుంచి బయటకు వస్తానని, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా సైతం చేస్తానని ప్రకటించానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు సానుకూలంగా లేకపోవడంతో పార్టీ నుంచి మొట్టమొదటగా బయటకు వచ్చింది తానేనన్నారు.

తర్వాత జరిగిన ఉద్యమం జర్నలిస్టుల వార్తలతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్నారు. జర్నలిస్టుల ప్రధానమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం నుంచి జిఓ రావాల్సి ఉందన్నారు. బాన్సువాడలో తాను 55 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చానని, జిఓ లేకపోవడంతో ఇప్పటికి వారికి పట్టాలు ఇవ్వలేకపోయానన్నారు.

ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఎలాంటి సమస్య లేదని, జర్నలిస్టుల ముసుగులో అనేక మంది ఇళ్లను పొందడానికి ప్రయత్నిస్తున్నారని, తద్వారా అసలైన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని, దానిని నివారించాలని సూచించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాల కోసం స్థలం కేటాయించామని, ఇళ్ల స్థలాలు ఇప్పటివరకు ఇవ్వలేదన్న విషయం తనకు తెలియదని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

జర్నలిస్టుల పిల్లల ఉచిత విద్యకు ప్రత్యేక జిఓ తేవాలి

ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించేలా ప్రభుత్వం ప్రత్యేక జిఓ తేవాలని టియుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహాత్ అలీ అన్నారు. ప్రస్తుతం 50 శాతం ఫీజు కోసం జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి లేఖలు తీసుకుని పాఠశాలల్లో అందించాల్సి వస్తుందని, ఇలాంటి తాత్కాలిక లేఖలు కాకుండా ఉచిత విద్య అందేలా క్యాబినెట్ లో చర్చించి ప్రత్యేక జిఓ తేవాలన్నారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులు 2018 వరకు మాత్రమే పని చేశాయని, ప్రస్తుతం వాటిని చెత్తబుట్టలో పడేసే పరిస్థితి ఉందన్నారు.

హెల్త్ కార్డులను పునరుద్ధరించాలని స్పీకర్ ను కోరారు. ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం స్పందించి అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పటిష్టమైన సంఘాలు ఉన్న వాటిలో టియుడబ్ల్యుజె మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల జర్నలిస్టులతో సభ్యత్వం ఉన్న ఏకైక యూనియన్ టియుడబ్ల్యుజె అని పేర్కొన్నర్జ్. త్యాగాలు, పోరాటాలు, విజయాలు తీయుడబ్ల్యుజె సొంతమన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జాతీయ కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల్ చారి, జిల్లా మాజీ అధ్యక్షుడు లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక

టీయుడబ్ల్యుజె కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రింట్ మీడియా జిల్లా అధ్యక్షునిగా రజనీకాంత్, ప్రధాన కార్యదర్శిగా వెంకట రమణ, ఉపాధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ఎన్నిక వాయిదా పడింది. ఎన్నిక తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను యూనియన్ జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.

Related posts

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Satyam NEWS

కడప జిల్లాలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం స్వాధీనం

Satyam NEWS

పండు వయసులో పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తారా?

Satyam NEWS

Leave a Comment