Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేయండి

#kamareddy

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తో తమ జీవనాధారమైన భూములను కొల్పతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని నెల రోజులుగా రైతులు ఆందోళన బాట పట్టారు. మాస్టర్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వివరణ ఇచ్చినా రైతులు నమ్మడం లేదు. మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలకు ఈ నెల 11 వరకు గడువు ఉండటంతో కౌన్సిల్ తీర్మానంలో సంతకాలు చేసి ఆమోదం తెలిపిన 49 మంది మున్సిపల్ కౌన్సిలర్లకు ముసాయిదాను రద్దు చేయాలని తీర్మానం చేయాలని నేడు వినతిపత్రాలు అందజేస్తున్నారు.

అందులో భాగంగా కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి నేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి అందుబాటులో లేకపోవడంతో ఆమె తండ్రి నిట్టు వేణుగోపాల్ రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ‘కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి జీఓ నంబర్ 478 ప్రకారం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం నంబర్ 42/407 తేదీ 23.07.2021 రోజున ఆమోదించిన ప్రకారం కామారెడ్డి పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కావున గత నెల రోజులుగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తున్నాము.

గౌరవ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గార్లు తెలియజేసిన దాని ప్రకారం కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందిందని తెలిసింది. గతంలో మీరు చేసిన తీర్మానం రైతులకు నష్టం జరుగుతుందని తెలిసి చేశారో తెలియక చేశారో కానీ మాస్టర్ ప్లాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మాస్టర్ ప్లాన్ విషయంలో పురపాలక సంఘానికి 1026 అభ్యంతరాలు వచ్చాయని కలెక్టర్ ప్రెస్ మీట్లో చెప్పారు.

అభ్యంతరాలకు చివరి తేదీ జనవరి 11, 2023 సాయంత్రం 5 గంటల వరకు ఉన్నందున తదుపరి రైతులు నష్టపోకుండా ఉండడం కోసం జనవరి 12, 2023 రోజున పురపాలక సంఘం అత్యవసర సర్వసభ్య సమావేశం పెట్టుకొని రైతులకు నష్టం కలిగే విధంగా ఉన్న మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని తీర్మానం చేయాలని కామారెడ్డి రైతుల పక్షాన వేడుకుంటున్నాము. దయచేసి 49 మంది కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా రైతుల పక్షాన ఉంటారని, దయ ఉంచి మాకు సహకరిస్తారని, మాకు మా కుటుంబానికి మేలు చేస్తారని, మా జీవనాధారాన్ని కాపడతారని సకుటుంబ సమేతంగా కోరుతున్నాము.. ఇట్లు.. అందరికి అన్నం పెట్టే రైతన్న’ అంటూ కౌన్సిలర్లకు ఇచ్చే వినతిపత్రంలో వేడుకున్నారు.

రేపు ఒక్కరోజు రైతుల ఉద్యమానికి ఐక్య కార్యాచరణ కమిటీ విరామం ప్రకటించింది. 11 వ తేదీన శాంతియుతంగా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు నిర్ణయించింది. నేడు కౌన్సిలర్లను రైతులు వేడుకున్నట్టుగా మున్సిపల్ కౌన్సిల్ ఈ నెల 12 న తీర్మానం చేస్తుందా.. లేక తిర్మణాన్ని ఆమోదిస్తూ తదుపరి చర్యలకు ముందుకు సాగుతుందా.. అదే జరిగితే రైతుల కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి.

Related posts

కుషాయిగూడాలో ఘనంగా శోభాయాత్ర

Satyam NEWS

తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల ఛాయా చిత్ర ప్రదర్శన

Satyam NEWS

మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాప‌న‌

Bhavani

Leave a Comment